నీటి చుక్కే గగనమైనా పట్టదా?

నీటి చుక్కే గగనమైనా పట్టదా? - Sakshi


విశ్లేషణ

డెబ్భై కోట్ల మంది ప్రజలు వరుసగా రెండో ఏడాది దుర్భిక్షానికి గురయ్యారు. బట్టలు ఉతుక్కోవడం, స్నానం చేయడం వంటి నిత్యకృత్యాలకు అవసరమయ్యే నీరు దాదాపుగా లభించక, తాగునీటి కోసం వారు మైళ్ల తరబడి అన్వేషించాల్సి వస్తుండగా... కుళాయి తిప్పితే నీరు లభించే నగరవాసులకు ఈ సంక్షోభం ఎంత తీవ్రమైనదో, రోజుల తరబడి నీరు లేకుండా మనగలగడం ఎలాగో ఊహకైనా అందదు. ఈ కష్ట కాలంలో నీటి బొట్టు కోసం ఆక్రందిస్తున్న పెద్ద సంఖ్యలోని ప్రజలకు దేశం సంఘీభావంగా నిలిచి తీరాలి.

 

ఇది ఎన్నడో మరుపున పడిపోయిన కథనం. అది 1965. ఆ ఏడాది దేశంలో కరువు నెలకొంది, ఆహార దిగుమతు లపైనే చాలా ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. దేశంలో చాలా భాగం ఆహార కొరతను ఎదుర్కొంటున్న ఆ సమయంలో, నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి దేశ ప్రజలంతా ప్రతి సోమవారం ఉపవాసం పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిజానికి నాడు దేశంలోని ప్రతి ఒక్కరూ ఆకలితో పడుకోవాల్సిన పరిస్థితి నెలకొనలేదు. సోమ వారం ఉపవాసం పాటించాలన్న శాస్త్రి పిలుపు ప్రాథమి కంగా ఆకలితో అల్లాడుతున్న లక్షలాదిమంది పట్ల సౌహార్ద్రతా ప్రకటన మాత్రమే. అలా ఆదా చేసిన ఆహా రం, ఆకలితో ఉన్న జనాభాలో ఒక చిన్న భాగం ఆకలిని తీర్చడానికైనా సరిపోయిందనుకోను. కాకపోతే ఆకలితో అల్లాడుతున్న ప్రజల పట్ల దేశం పట్టింపును ప్రదర్శి స్తోంది, వారితో పంచుకోవడం కోసం ఒక రోజు ఆహా రాన్ని త్యాగం చేయడానికి అది సిద్ధంగా ఉన్నది అనే అంతర్నిహిత సందేశాన్ని ఆ పిలుపు స్పష్టంగానూ, గట్టిగానూ వినిపించింది.



సహానుభూతికి కోర్టు అదేశాలు అవసరం

యాభై ఏళ్ల తర్వాత, ‘‘విశాల ప్రజానీకం ప్రయోజనాల కోసం’’ 13 ఐపీఎల్ మ్యాచ్‌లను తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న మహారాష్ట్ర నుంచి బయటకు తరలించడం కోసం బొంబాయి హైకోర్టు ఆదేశం అవసరమైంది! క్రికెట్ పిచ్ కోసం ఖర్చయ్యే నీటిని ఆదా చేయడం వల్ల లాతూరు నగరం ఒక్క రోజు నీటి అవసరాన్ని కూడా తీర్చలేదని హైకోర్టుకు నిస్సంశయంగా తెలుసు. ‘‘ప్రభుత్వం ప్రజల దుస్థితిని పట్టించుకోకుండా ఉండటానికి వీల్లేదు’’ అనే సందే శాన్ని పంపాలనేదే కోర్టు ఆదేశాల ప్రాథమిక లక్ష్యం.



ఆ సందేశానికి స్పందించిన ముంబై హోటల్స్, రెస్టారెంట్ల అసోసి యేషన్... ఇక నుంచి కస్టమర్లు, తాము వచ్చి కూర్చున్న వెంటనే గ్లాసుల నిండా నీరు ఉంచుతారని ఆశించవద్దని ప్రకటించింది. టేబుల్ మీద ఉంచిన  జగ్గును తీసుకుని వారు తమంతట తాము కావల్సినంత నీటిని గ్లాసులో పోసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల వారు వదిలి వెళ్లే సగం గ్లాసు నీళ్లు వృథా కాకుండా ఉంటాయి. ఈ చర్య వల్ల దుర్భిక్ష మహారాష్ట్ర ఎదుర్కొంటున్న నీటి కొరత సమస్య  తీరేదేమీ కాదు. కాకపోతే, తోటి పౌరుల పట్ల పట్టింపును చూపే స్పందనాతత్వాన్ని అది ప్రతిఫలిస్తుంది.



దుర్భిక్ష పీడిత ప్రాంతాల ప్రజల దుస్థితి గురించి, వారు అనుభవిస్తున్న బాధల గురించి సుప్రీం కోర్టు, ప్రభుత్వాన్ని మేల్కొల్పడం అవసరమైంది. పాలనా యంత్రాంగం ఎంతగా పట్టింపుతనం లేకుండా బండబారిపోయిందో దీన్ని బట్టి అర్థమౌతుంది. ఇంచుమించు 70 కోట్ల మంది ప్రజలు వరుసగా రెండో ఏడాది సంభవించిన ఈ దుర్భిక్ష పీడితులుగా ఉన్నారని అంచనా. దేశ  ప్రధాన భాగంలో నెలకొన్న ఈ తీవ్ర సంక్షోభం గురించిన స్పృహ అటు ప్రభుత్వానికి, ఇటు మీడియాకు కూడా లేకుండా పోయింది. 10 రాష్ట్రాలలోని గణనీయమైన భాగాలు వరుసగా రెండో ఏడాది క్షామంతో అల్లాడుతున్నాయి. వేడి వాతావరణం కొనసాగడం వల్ల పంటలు ఎండిపోయాయి. రైతులు మొదట తమ పశువులను వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాతే వారే ఇల్లూ వాకిళ్లు, ఊళ్లు వదిలి వలస పోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది.



ఇళ్లూవాకిళ్లూ పదిలి వలస బాట   

మహారాష్ట్రలోని మరఠ్వాడా సహా పలు ప్రాంతాలు వరుసగా మూడో ఏడాది దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం 2015 సెప్టెంబర్‌లోనే రాష్ట్రంలోని 43,000 గ్రామాల్లో 14,708  క్షామ పీడిత గ్రామాలని ప్రకటించింది. కర్ణాటకలోని 30 జిల్లాల్లో 27 జిల్లాల్లోని 127 తాలూకాలను క్షామపీడితమైనవని సెప్టెంబర్ 2015లో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, 196 మండలాలను క్షామ పీడితమైనవిగా ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో క్షామ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జార్ఖండ్‌లోని పాలమూ జిల్లా గత ఆరేళ్లలో ఐదేళ్లుగా క్షామాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. బుందేల్‌ఖండ్‌దీ అదే కథ. క్షామానికి ఆల్లాడుతున్న ప్రజల మొహాల్లోనే ఆ దైన్యమంతా తాండవిస్తోంది.

 ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు రెంటిలోనూ విస్తరించి ఉన్న బుందేల్‌ఖండ్  క్షామం గురించి కనీసం గత నాలుగేళ్లుగా వార్తా నివేదికలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. దుర్భిక్షం నెలకొన్నప్పుడు మొదట దాని బారినపడేది పశువులు. మహిళలు వాటి నుదుట తిలకం దిద్ది, వాటి పాదాలకు నమస్కరించి స్వేచ్ఛగా వాటిని వదిలిపెట్టేయడం నేను చూసిన సాధారణ రివాజు. పశువులు పోయాక కూడా దుర్భిక్ష పరిస్థితులు మరింత అధ్వానంగా మారడంతో తాగునీటి వనరులు సైతం ఎండిపోతాయి. ఆడా, మగా అంతా రోజులో అత్యధిక భాగం ఒక బకెట్టు నీళ్లు సంపాదించడం కోసం దూరాభారాలకు నడుస్తూనే ఉంటారు. పంటలు పూర్తిగా ఎండిపోయాక ఇక వలస పోవడం మాత్రమే రైతులకు మిగిలి ఉండే దారి.



నగరవాసి ఊహకందని విపత్తు

మహారాష్ట్రలోని లాతూరులో ట్యాంకర్లతో నీటిని అందించే ప్రాంతాల్లో సెక్షన్ 144ను విధించినట్టు వస్తున్న వార్తలు... తాగునీటి కరువు వల్ల ఎంతటి విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయో తెలుపుతోంది. బట్టలు ఉతుక్కోవడం, స్నానం చేయడం వంటి నిత్యకృత్యాలకు అవసరమయ్యే నీరు దాదాపుగా లభించని పరిస్థితిలో ప్రజలు చెప్పనలవిగాని కష్టాలకు గురికావాల్సి వస్తోంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కుళాయి తిప్పితే చాలు నీరు లభించే లేదా రిఫ్రిజిరేటర్లోని చల్లటి నీరు అందుబాటులో ఉండే నగర ప్రజలకు... ఈ సంక్షోభం ఎంత తీవ్రమైనదో, రోజుల తరబడి నీరు అసలుకే లభించకుండా మనగలగడం ఎలాగో ఊహకైనా అందదు. ఇటీవల నేను బుందేల్‌ఖండ్ ప్రాంతంలో జరిపిన పర్యటనల్లో ఒక రైతు కుటుంబాన్ని స్నానం చేయాలని అడిగాను. ‘మరో లడ్డూ తినండి, అంతేగానీ స్నానం మాట ఎత్తకండి!’ అని ఆ ఇంటి ఆడమనిషి నాకు చెప్పేసింది.



గత కొన్ని నెలలుగా క్షామ పీడిత రాష్ట్రాలు చాలా వాటిలో పర్యటిస్తున్న నేను ఈ విషయంలో నెలకొన్న తీవ్ర అసమానతను చూసి నివ్వెరపోయాను. కర్ణాటక లోని 80 శాతం ప్రాంతం దుర్భిక్షానికి గురై ఉండగా... ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరులో దాని దాఖలాలే లేవు. అలాగే ముంబైలో పయనిస్తుంటే, గత రెండేళ్లుగా ఆ రాష్ట్రం తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న సూచ నలు ఏ మాత్రం కనిపించలేదు. నగరాలలో నివసిస్తున్న ప్రజలకు తమ పెరట్లోనే ఉన్న  గ్రామాల్లో నెలకొన్న దయనీయమైన పరిస్థితుల గురించి ఊహామాత్రం గానైనా తెలియదు. వార్తా పత్రికల్లో చదివే దుర్భిక్షం గురించిన వార్తా కథనాలను వారు ఏ ఇథియోపియా ప్రజల ఇక్కట్ల గాథలో అన్నట్టుగా వారు చూస్తారు.



దేశం అండగా నిలవాలి

ఈ తీవ్ర కష్ట కాలంలో దేశం, ఒక్క నీటి బొట్టు కోసం ఆక్రందిస్తున్న పెద్ద సంఖ్యలోని ప్రజలకు సంఘీభావంగా నిలిచి తీరాలి. ముంబై రెస్టారెంట్లలాగే, ఫైవ్ స్టార్ హోటళ్లు సహా దేశంలోని హోటళ్లన్నీ నీటి వినియోగాన్ని తగ్గించే తక్షణ చర్యలను చేపట్టాలి. కనీసం, అవి కస్టమర్లను టబ్బు స్నానాలకు బదులు షవర్ స్నానాలకు పరిమితం కావాలని కోరాలి. గోల్ఫ్ క్లబ్బులు సైతం వారానికి మూడు రోజులు మూసేసుకోవచ్చు. వాటి నిర్వాహకులు గోల్ఫ్ కోర్సులన్నీ తమకు కావాల్సిన నీటి కోసం వాటర్ హార్వెస్టర్లను ఏర్పాటు చేసుకోవాలని ప్రకటించాలి. ఈ సంక్షోభ సమయంలో స్విమ్మింగ్ పూల్స్‌ను మూసి ఉంచాలి. కార్లను కడగడం, తోటలకు నీటిని పెట్టడంలో నియంత్రణను పాటించాలి.



పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సంస్థలు మొదలైనవి సాధ్యమైనంతగా నీటిని పొదుపు చేయడం కోసం పలు ఇతర చర్యలను చేపట్టడం కూడా అవసరం. దుర్భిక్షం ఒక ప్రకృతి విపత్తు. ఆ విపత్తుకు గురైనవారికి మద్దతుగా దేశం నిలవాలి. విచ్చలవిడి నీటి వినియోగాన్ని ఏదిఏమైనా అరికట్టాల్సిందే. లాల్ బహదూర్ శాస్త్రి జీవించి ఉండి ఉంటే... దేశం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటుండగా దాని పట్ల పట్టింపును చూపలేని జాతిని చూసి, సాటివారిపట్ల సహానుభూతిని రేకెత్తించడానికి ఏమి చేసి ఉండేవారా? అని నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది.



దేవిందర్‌శర్మ,

 వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు  hunger55@gmail.com



 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top