నాటకం నుండి సినిమానా? సినిమా నుండి నాటకమా?

నాటకం నుండి సినిమానా? సినిమా నుండి నాటకమా?


 (జూన్ 20 నాటి ‘తొలి తెలుగు సినీకవి’ చర్చకు కొనసాగింపు)

 1. శ్రీకృష్ణతులాభారం నాటకానికి చందాల కేశవదాసు 22 పాటలు రాశారు. ఈ పాటలతో నాటకాన్ని ‘మైలవరం బాలభారతి నాటక సమాజం’ వారు చాలాసార్లు ప్రదర్శించారు. ఈ పాటల్లో బలే మంచి చౌక బేరము, మునివరా, కొట్టు కొట్టండిరా అనే మూడు పాటలే సినిమాల్లోకి ఎక్కాయి. (పైడిపాల రాసినట్లుగా) 1935, 55, 66 సంవత్సరాల్లో తీసిన మూడు సినిమాల్లోనూ ఈ మూడు పాటలున్నాయి. కేశవదాసు కుమారులు కృష్ణమూర్తి... రామానాయుడు మీద ఖమ్మం కోర్టులో కేసు గెలిచిన ఫలితంగా 1966లో సురేశ్ ప్రొడక్షన్స్ వారు తీసిన ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమా టైటిల్స్‌లో కేశవదాసు పేరు చేర్చడం జరిగింది. 2. పానుగంటి లక్ష్మీనరసింహారావు రాసిన ‘రాధాకృష్ణ’ నాటకానికి కేశవదాసు 21 పాటలు రాశారు. అయితే, మొదట కవిగారు పాటలు చేర్చడానికి ఒప్పుకోలేదు. కాని మైలవరం బాలభారతి నాటక సమాజం పెద్దలు ఆయన్ని ఒప్పించారు. భక్తిగీతాలు మాత్రమే రాయాలని కవిగారు షరతు పెట్టి కేశవదాసుగారి పాటలతో నాటకాన్ని ప్రదర్శించడానికి ఒప్పుకున్నారు. ఈ పాటలను 1929లో కురుకూరి సుబ్బారావు అచ్చువేశారు.

 

 ఈ పాటల ప్రతి ఇప్పటికీ ఉన్నది.

 3. సురభి నాటకంలోని మూడు పాటల్ని సినిమాలోకి ఎక్కించారని ‘ముక్తకంఠం’తో చెప్పిన పెద్దలు గౌరవనీయులు- వారి మాట శిరోధార్యమే. కాని నాటకం నుండి సినిమాకెక్కాయా? సినిమా నుండి నాటకంలోకి దిగినాయా? అనే సందేహానిక్కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే మా తండ్రిగారు వెంకట నరసింహాచార్యులు దాసుగారి సమకాలికులు. జగ్గయ్యపేటలో ఒక హరికథాగానంలో ఉండగా హెచ్.ఎం.రెడ్డిగారి నుండి పిలుపు వచ్చిందనీ, తాను వెళ్లి ‘ప్రహ్లాద’ సినిమాకు పాటలు రాసి వచ్చాననీ దాసుగారు చెప్పినట్లు నాన్నగారు నాతో అన్నారు. అయితే ఇది రికార్డు చేయలేకపోయిన పరిస్థితులలో ‘రుజువు’ చెయ్యలేకపోవచ్చు. కాని మా నాన్న చెప్పడం ద్వారా నేను విన్న విషయమది. దీని రుజువుల కోసం ప్రయత్నిస్తున్నాను. అంతవరకు ఇవే సంగతులు. పైడిపాలగారికి అభినందనలు.

డా॥ఎం.పురుషోత్తమాచార్య

 9396611905

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top