బ్రాహ్మణేతర మహిళా పూజారులు!

Women Priests Belong To Mohpada Village In Maharashtra - Sakshi

సంస్కృతంతో రాణిస్తున్న బ్రాహ్మణేతర మహిళలు

సాక్షి, ముంబాయి: అవకాశాలను అందిపుచ్చుకుని మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. వివక్ష, అవమానాలను ఎదుర్కొని తాము ఎంచుకున్న రంగంలో నిలదొక్కుకుంటున్నారు. ఓ విశ్రాంత ఉపాధ్యాయుడి సాయంతో సంస్కృతం నేర్చుకుని వైదిక కర్మకాండలు నిర్వహిస్తూ అందరి మెప్పు పొందుతున్నారు  మెహపెడా గ్రామానికి చెందిన బ్రాహ్మణేతర మహిళలు.

విశ్రాంత ఉపాధ్యాయుడి కృషి
ముంబైకి 60 కిలోమీటర్ల దూరంలో ఈ మెహపెడా గ్రామం ఉంది. అలియాబాగ్‌కు చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు రామేశ్వర్‌ కార్వే(101) ఓ రోజు ఈ గ్రామానికి సమీపంలో ఉన్న జిల్లా పరిషత్‌ పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉపన్యాసం ఇచ్చాడు. అది విన్న మెహపడా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తమ గ్రామంలోని వారికి సంస్కృత పాఠాలు నేర్పాలని కోరాడు. అలా 18 ఏళ్ల క్రితం సంస్కృత శిక్షణ ప్రారంభమైంది. ఆ గ్రామంలోని బ్రహ్మణేతర కుటుంబాలకు చెందిన 150 మంది మహిళలు సంస్కృతం చదువుకుని పట్టాలు సాధించడం, అర్చకత్వ శిక్షణ పొందడం వెనుక రామేశ్వర్‌ కృషి, పట్టుదల ఎంతో ఉంది. ‘వీరసావర్కర్‌ జైలులో ఉన్నప్పుడు మా నాన్న వెళ్లి కలిసేవారు..సంస్కృతాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన మా నాన్నకు చెప్పేవారు... అలా  మా నాన్నగారు రాయ్‌గఢ్‌ జిల్లాలో ఐదు విద్యాసంస్థలను ప్రారంభించారు. సంస్కృతాన్ని బ్రాహ్మణేతర ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది మా నాన్న ప్రధాన లక్ష్యంగా ఉండేద’ని కార్వే కుమార్తె వసంతి డియో చెప్పారు.

అయితే మొదట్లో సంస్కృతం నేర్చుకునేందుకు ఆ గ్రామానికి చెందిన మహిళలు ఆసక్తి చూపలేదు. వారిని క్లాసులకు రప్పించడమే కార్వేకు పెద్ద సవాలు. ‘ హోం వర్క్‌ ఇవ్వడం వల్ల  ఇంట్లో పనులకు ఇబ్బంది కలుగుతోంది..దీంతో చదువుకోవడానికి రావడం మానేస్తారని..హోం వర్క్‌ ఇచ్చేవారు కాదు...చిన్న పిల్లలను స్కూలుకు రప్పించేందుకు ఉపాధ్యాయులు ఎంత కష్టపడతారో తమ గురూజీ కూడా తమ పట్ల అంతే శ్రద్ధ తీసుకునేవారు’  అని మొదటి బ్యాచ్‌కు చెందిన సురేఖా పాటిల్‌ తెలిపారు.

అన్ని రకాల పూజలు
పూజాధిక కార్యక్రమాలను మహిళలు నిర్వహించడాన్ని మొదట చాలా మంది అంగీకరించలేదు. క్రమంగా వారికి ఆహ్వానాలు అందుతున్నాయి. ముంబై మహానగరంతో పాటు థానే, నవీ ముంబాయిలోనూ ఈ మహిళా పూజారులు వివిధ క్రతువులు నిర్వహిస్తున్నారు. పెళ్ళిళ్లు, దశదిన కర్మలు, ఒడుగు, సాధారణంగా పురుషులు మాత్రమే నిర్వహించే శని శాంతి పూజ వంటి వాటిని కూడా వీరు చేయడం గమనార్హం. ఈ మహిళంతా ఆరు నెలల కరస్పాండెన్స్‌ కోర్సు  ‘సంస్కృత భారతి’ని పూర్తి చేశారు. వీరిలో ఎక్కువ మంది నూటికి 80 నుంచి 90 మార్కులు సాధించడం విశేషం.

అయితే, ఇప్పటికీ కొన్ని చోట్ల పూజలకు వెళ్లినపుడు వారి వారి బంధువులు తమను తక్కువ చేసి మాట్లాడటం, మంత్రాలు సరిగా చదువుతారా? పూజలు సక్రమంగా చేస్తారా అంటూ వ్యంగ్యగా మాట్లాడుతుంటారు...వాటిని విని నవ్వుకుంటూ తమ పని తాము చేసుకు పోతామని దాల్వీ అనే మహిళా పూజారి పేర్కొన్నారు. ఓ చోట సత్యనారాయణస్వామి వ్రతం చేయడానికి వెళ్లాం..సాధారణంగా పూజ అనంతరం పూజారి కాళ్లకు నమస్కరించి ప్రసాదం తీసుకోవడం అనవాయితీ.. కానీ తాము పూజ చేసిన అనంతరం కాళ్లకు మొక్కకుండానే ప్రసాదాన్ని తీసుకుంటారని చెప్పుకొచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top