భారత్‌ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం

Why Modi Govt Ignoring Alarm Bells From Economy - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత ప్రస్తుత ఆర్థిక పరిస్థితి చూసి నేను ఆందోళన చెందుతున్నానని చెప్పలేను. అలా అని ఆత్మ సంతృప్తిని కూడా వ్యక్తం చేయడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎదురు గాలులు వీస్తున్నప్పటికీ మునిగిపోకుండా నీటికి ఉపరితలంపైనే భారత తన తలను ఉంచగలుగుతోంది’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‘ఎకనమిక్స్‌ టైమ్స్‌’కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఎంత నర్మగర్భంగా ఆమె మాట్లాడిన దేశ ఆర్థిక పరిస్థితి సవ్యంగా లేదనే విషయం ఆమె మాటల్లోనే అర్థం అవుతోంది.

దేశంలోని ఎనిమిది కోట్ల పరిశ్రమల వృద్ధి రేటు 0.2 శాతం ఒక్క జూన్‌ నెలలోనే పడిపోయింది. అది 50 నెలల కనిష్టస్థాయి కావడం ఆందోళనకరం. 11 ఆటోమొబైల్‌ కంపెనీల్లో 9 కంపెనీల లాభాలు జూలై నెలలో రెండంకెల శాతం పడిపోవడం మరింత ఆందోళనకరం. ఆటోమొబైల్‌ అమ్మకాలు గత 9 నెలలుగా వరుసగా పడిపోతున్నాయి. మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న మారుతి కంపెనీ అమ్మకాలు 30 శాతానికి మించి పడిపోవడం అనూహ్య పరిణామం. గత 20 ఏళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా పలు ఆటోమొబైల్‌ కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తి నియంత్రణా చర్యలు చేపట్టాయి. ఈ కారణంగా పలు యూనిట్లలో ‘లేఆఫ్‌’లు ప్రకటించే ప్రమాదం ఉంది.

సరకుల అమ్మకాల్లో ఎప్పుడూ ముందుండే హిందుస్థాన్‌ యూనిలివర్, ఐటీసీ, గోద్రెజ్‌ లాంటి కంపెనీలు 2019, తొలి త్రైమాసికంలో కేవలం ఒక అంకె వృద్ధిని మాత్రమే సాధించాయి. ఈ తిరోగమన  పరిస్థితి ఇప్పట్లో మెరుగయ్యే అవకాశాలు లేవని ‘16 కీలక ఆర్థిక సూచికలు’ సూచిస్తున్నాయి. ‘ఓ పక్క డిమాండ్‌ లేదు, మరోపక్క ప్రైవేటు పెట్టుబడులు లేవు. ఇక అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి ఊడి పడుద్దా?’ అని బజాజ్‌ ఆటోస్‌ చైర్మన్‌ రాహుల్‌ బజాజ్‌ వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి. పొదుపు ఖాతాల సొమ్ము గత ఐదేళ్ల కాలంలో భారీగా పడిపోవడం కూడా ఆర్థిక ప్రమాద ఘంటికే. ఈ సొమ్ము 2013–14 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 22 శాతం ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 17 శాతానికి పడిపోయింది.

దేశంలో నిరుద్యోగ సమస్య క్రమంగా పెరుగుతుండడం వల్ల ఉద్యోగాలు చేసే యువత సంఖ్య తగ్గుతూ వారిపై ఆధారపడి బతికే వారి సంఖ్య పెరుగుతూ వస్తోందని, సహజంగా ఇలాంటి పరిస్థితుల్లోనే పొదుపు ఖాతా సొమ్ము పెరుగుతుంది. అలా జరగడం లేదంటే పరిస్థితి ఊహించిన దానికన్నా తీవ్రంగా ఉన్నట్లు లెక్క. మరోపక్క కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ అంచనాలు భారీగా పడిపోతుండడం కూడా ఆందోళనకరమే. ఈ ఏడాది పన్ను వసూళ్ల వృద్ధి 18.3 శాతం ఉంటాయని నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రతిపాదనల్లో అంచనా వేయగా, మొదటి ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.4 శాతం వృద్ధి మాత్రమే సాధ్యమైంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే మిగతా కాలంలో 22.3 శాతం వృద్ధి రేటును సాధించాలి. ఆర్థిక పరిస్థితి మందగించిందని ‘నీతి ఆయోగ్‌’ సీఈవో అమితాబ్‌ కాంత్‌ శుక్రవారం ఆందోళన వ్యక్తం చేయడం కూడా ఇక్కడ గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను ఐదు లక్షల కోట్ల డాలర్లకు తీసుకెళతామన్న ప్రధాని నరేంద్ర మోదీ సవాల్‌ నెరవేరడం ఏమోగానీ ప్రపంచంలోనే ఐదవ బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఆవిర్భవిస్తుందన్న ఆశ నెరవేరడం కూడా కనా కష్టమే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top