‘సూపర్‌ యాప్‌’ల కోసం పడరాని పాట్లు!

Super App Wechat Special Story - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, పేటీఎం, పేపాల్, బుక్‌మైషో, మేక్‌మైట్రిప్, గోఐబీబో, స్విగ్గీ, యెల్ప్, ఉబర్, కిండిల్‌.. తదితర యాప్‌లన్నీ ఒకే యాప్‌ పరిధిలోకి వస్తే దాన్ని ఏమంటామ్‌ ? సూపర్‌ యాప్‌ అంటాం. చైనాలో ప్రసిద్ధి చెందిన ‘వియ్‌చాట్‌’ అలాంటిదే. వివిధ యాప్‌లు చేసే పని ఆ ఒక్క యాప్‌ చేస్తోంది. ఆ తరహాలోనే భారత్‌లో కూడా సూపర్‌ యాప్‌ను సృష్టించేందుకు డిజిటల్‌ చెల్లింపుల యాప్‌ ‘పేటీఎం’, క్యాబ్‌ సర్వీసుల బుకింగ్‌ యాప్‌ ‘ఓలా’ నుంచి టెలికాం సర్వీసుల దిగ్గజం ‘రిలయెన్స్‌ జియో’ వరకు పలు సంస్థలు 2019 సంవత్సరంలో తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే ఏ కంపెనీ కూడా ఇంతవరకు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయాయి ? ఎందుకు ?

వియ్‌చాట్‌ ఆవిర్భావం
చైనాకు చెందిన ‘టెన్సెంట్‌’ కంపెనీ 2011లో ‘వియ్‌చాట్‌’ పేరిట సోషల్‌ మీడియాను ప్రవేశపెట్టింది. ఏడాది తిరక్కుండానే అందులో పది కోట్ల మంది యూజర్లు చేరారు. ఈ లక్ష్యాన్ని చేరడానికి ‘ఫేస్‌బుక్‌’కు నాలుగేళ్లు, ట్విట్టర్‌కు ఐదేళ్లు పట్టింది. ప్రస్తుతం ‘వియ్‌చాట్‌’కు నెలవారి యూజర్లు వంద కోట్లు దాటారు. సందేశ సర్వీసుతో ప్రారంభమైన వియ్‌చాట్‌లో 2013లో ‘డిజిటల్‌ వాలెట్‌’ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వరుసగా అన్ని ఫీచర్లను ప్రవేశ పెడుతూ వచ్చారు. ఇప్పుడందులో ఆన్‌లైన్‌ సినిమా బుకింగ్‌లతోపాటు ఆన్‌లైన్‌ షాపింగ్, రైలు, బస్సు, విమాన సర్వీసులు, క్యాబ్‌ సర్వీసుల బుకింగ్, ఫుడ్‌ ఆర్డర్లతోపాటు డాక్టర్ల అప్పాయింట్‌మెంట్స్‌ నుంచి విదేశాల వీసాల వరకు వివిధ సేవలను అందిస్తోంది. చైనా నుంచి గూగుల్‌ సేవలను తప్పించిన తొలినాళ్లలోనే ‘వియ్‌చాట్‌’ రావడం ఎంతో కలిసి వచ్చింది.

వియ్‌చాట్‌తోపాటు చైనాకు చెందిన ఆన్‌లైన్‌ ఆర్థిక వ్యవహారాల దిగ్గజ సంస్థ ‘యాంట్‌ ఫైనాన్సియల్‌’కు చెందిన ‘అలీపే’ కూడా సూపర్‌ యాప్‌ తరహాలో పలు సేవలను అందిస్తోంది. దీనికి ఒక్క చైనాలోనే 90 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. దీంతోపాటు చైనాలో ఒకటి, రెండు చిన్న సూపర్‌ యాప్‌లు కూడా పనిచేస్తున్నాయి. చైనాకు వెలుపల ఇండోనేసియాకు చెందిన ‘గో జెక్‌’ యాప్‌ మొదట క్యాబ్‌ సర్వీసులకే పరిమితంకాగా, తర్వాత డెలివరీ సర్వీసులను కూడా ప్రవేశపెట్టింది. దీనికి ‘గో పే’ పేరిట చెల్లింపుల యాప్‌ కూడా ఉంది. దీనికి పోటీగా ఆసియాకు చెందిన ‘గ్రాబ్‌’ క్యాబ్‌ సర్వీసుల నుంచి బ్యాంకింగ్‌ రంగంలోకి ప్రవేశించింది. 

భారత సంస్థల ప్రయత్నాలు
భారత్‌లో అతిపెద్ద డిజిటల్‌ చెల్లింపుల సంస్థ అయిన ‘పేటీఎం’ సినిమా టిక్కెట్ల బుకింగ్‌లతోపాటు విమాన టిక్కెట్ల బుక్కింగ్‌లను ప్రవేశపెట్టింది. రెండేళ్ల క్రితం మెస్సేజ్‌ సర్వీసులను ప్రవేశపెట్టిన ఈ యాప్‌ ఇప్పుడు ఆహార పదార్థాలను కూడా డెలివరి చేస్తోంది. సూపర్‌ యాప్‌గా దీన్ని తీర్చిదిద్దే సామర్థ్యం కంపెనీ యజామాని విజయ్‌ శేఖర్‌ శర్మకు ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు తెలియజేస్తున్నాయి. 
టెలికామ్‌ దిగ్గజ సంస్థ ‘రిలయెన్స్‌ జియో’ 2018లో మ్యూజిక్‌ యాప్‌ ‘సావన్‌’ను కొనుగోలు చేసి దాన్ని తన సొంత యాప్‌ ‘జియో మ్యూజిక్‌’తో అనుసంధానించింది. అదనంగా జియో టీవీ, జియో న్యూస్‌ కలిగిన ఈ సంస్థ ఇటీవలనే ఈ కామర్స్‌ యాప్‌ ‘ఫిండ్‌’ను కొనుగోలు చేసింది. మంచి టెక్నికల్‌ టీమ్‌తోపాటు మంచి సరఫరా చైన్, ఇంటెర్నెట్‌ యూజర్లను కలిగిన ఈ సంస్థకు సూపర్‌ యాప్‌ను అభివృద్ధి చేసే సామర్థ్యం, అవకాశాలు కూడా ఉన్నాయి. ఓలా, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలు కూడా సూపర్‌ యాప్‌ దిశగా ప్రయత్నాలు చేశాయి. కవిన్‌ భారతి మిట్టల్‌ ‘హైక్‌ మెస్సెంజర్‌’ ద్వారా అలాంటి ప్రయత్నం చేసి విఫలమయ్యారు. 

ఆశించినా ఫలితాల ఎందుకు రాలేదు?
సూపర్‌ యాప్‌ దిశగా దేశంలో భారతీయ సంస్థలు చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు సాధించకపోవడానికి ప్రధాన కారణం నైసర్గికంగా, సంస్కృతిపరంగా, భాషాపరంగా భిన్నత్వం ఉండడం. దేశంలో పలు మతాలు, భాషలతోపాటు పలు సంస్కృతులు ఉన్నాయి. చైనాలో ఒకే జాతి, ఒకే భాషా వారికి ప్రధానంగా కలిసి వచ్చిన అవకాశం. పైగా చైనా దేశస్థుల్లో 85 శాతం మంది నాస్తికులు. అక్కడ దేశ ప్రజలందరిని కలుపుకొని ఒక్క చైనా భాషలోనే ‘వియ్‌చాట్‌’ను రూపొందించారు. భారత్‌లో పలు భాషల్లో, పలు వర్షన్లను తీసుకరావడం అన్ని విధాల భారం అవుతుంది. స్మార్ట్‌ ఫోన్లలో ఎక్కువ ‘జీబీ’ సామర్థ్యం అవసరం అవుతుంది. 8 నుంచి 16 జీబీ, 2జీ రామ్‌ సామర్థ్యం కలిగి దాదాపు ఏడు వేల రూపాయలకు దొరికే స్మార్ట్‌ఫోన్లనే సగటు భారతీయులు ఎక్కువగా ఉపయోగిస్తారు.

యాప్‌ చూసి కొనుగోలు చేయకుండా ఆచితూచి, పలువురిని అడిగి కొనుగోలు చేసే మనస్థత్వం భారతీయులది. అపరిచితులను అంత త్వరగా విశ్వసించరు. చైనా దేశస్థులు అపరిచితులను కూడా అట్టే నమ్మేస్తారనడానికి ‘వియ్‌చాట్‌’లో ప్రవేశ పెట్టిన ‘షేక్‌’ ఫీచర్‌ సాక్ష్యం. అపరిచితులతో స్నేహం చేయాలనుకునే వారు మొబైల్‌ ఫోన్‌ను ‘షేక్‌’ చేస్తే చాలు. వారిమధ్య పరిచయం, ఆ తర్వాత స్నేహ బంధం బలపడుతుంది. దీనికి చైనాలో అంతులేని ఆదరణ ఉన్నది. పైగా భారతీయుల డేటాకు చట్టపరమైన రక్షణ ఇంకా సమకూరలేదు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top