పౌర రగడ : ఆరుగురు మృతి

Six Dead In Violence Across Uttar Pradesh - Sakshi

లక్నో : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తర్‌ ప్రదేశ్‌లో జరిగిన ఘర్షణల్లో ఆరుగురు మరణించారని రాష్ట్ర పోలీసులు శుక్రవారం నిర్ధారించారు. దీంతో పౌర చట్టంపై ఆందోళనల నేపథ్యంలో యూపీలో మరణించిన వారి సంఖ్య ఇప్పటివరకూ ఏడుకు చేరింది. మరణించిన వారిలో ఏ ఒక్కరూ పోలీసు కాల్పుల్లో మరణించలేదని యూపీ డీజీపీ ఓపీ సింగ్‌ పేర్కొన్నారు. తాము ఒక్క బుల్లెట్‌నుకూడా కాల్చలేదని చెప్పుకొచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిజ్నోర్‌లో ఇద్దరు నిరసనకారులు, సంభాల్‌, ఫిరోజాబాద్‌, మీరట్‌, కాన్పూర్‌లో ఒక్కరేసి చొప్పున మరణించారు. మరోవైపు పౌరచట్టంపై శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, అల్లర్లు కొనసాగాయి. ప్రార్ధనల అనంతరం వేలాది మంది నిషేధాజ్ఞలను ధిక్కరించి వీధుల్లోకి పోటెత్తడంతో దాదాపు 13 జిల్లాల్లో ఘర‍్షణలు చెలరేగాయి. నిరసనకారులు పెద్దసంఖ్యలో వీధుల్లోకి చేరడం, రాళ్లురువ్వడంతో పోలీసులు లాఠీచార్జ్‌, భాష్పవాయుగోళాలను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. శుక్రవారం ప్రార్ధనలను దృష్టిలో ఉంచుకుని పెద్దసంఖ్యలో భద్రతా చర్యలు చేపట్టినా అల్లర్లు చెలరేగాయి.

కారుకు నిప్పు

మరోవైపు దేశరాజధాని ఢిల్లీలోనూ శుక్రవారం హింసాత్మక నిరసనలు కొనసాగాయి. ఢిల్లీ గేట్‌ వద్ద ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పాత ఢిల్లీలో ఆందోళనకారులు పౌరచట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళన హింసకు దారితీసింది. నిలిపిఉంచిన కారును కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయుగోళాలు ప్రయోగించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top