46 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి‌! | Sachin Pilot To Contest From Tonk | Sakshi
Sakshi News home page

46 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి‌ పలికిన కాంగ్రెస్‌!

Nov 17 2018 3:46 PM | Updated on Mar 18 2019 9:02 PM

Sachin Pilot To Contest From Tonk - Sakshi

జైపూర్‌ : రాజస్థాన్‌లోని చారిత్రక టోంక్‌ నియోజకవర్గంలో ఏళ్లుగా పాటిస్తూ వస్తున్న సంప్రదాయానికి కాంగ్రెస్‌ పార్టీ స్వస్తి పలికింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ప్రదేశ్‌ కమిటీ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌ను ఆ స్థానంలో తమ అభ్యర్థిగా రంగంలోకి దించనుంది. తద్వారా గత 46 ఏళ్లుగా టాంక్‌ సీటును మైనార్టీలకు కేటాయిం‍చే సంప్రదాయాన్ని బ్రేక్‌ చేసింది.

ఈ విషయమై సచిన్‌ పైలట్‌ మాట్లాడుతూ.. తనకు తానుగా ఈ స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పలేదని పేర్కొన్నారు. పార్టీ అధినాయత్వం ఆదేశాల మేరకే టోంక్‌ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నానని తెలిపారు. తనను ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా టోంక్‌ ప్రజలను కోరారు. కాగా ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే అజిత్‌ సింగ్‌ మెహతా సచిన్‌పై పోటీ చేయనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిగా సచిన్‌ పైలట్‌ను ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ.. ఔట్‌సైడర్లకు టోంక్‌లో చోటు లేదని పేర్కొన్నారు. అయినా సచిన్‌ పైలట్‌ ఎన్ని నియోజక వర్గాలు మారుతారని ప్రశ్నించారు. ఇక శుక్రవారం 152 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అక్కడ సగానికి సగం ముస్లిం ఓటర్లే
నవాబులు పాలించిన ప్రాంతంగా ప్రసిద్ధికెక్కిన టోంక్‌ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,22,000. వీరిలో సగానికి సగం అంటే 40 నుంచి 50 వేల వరకు ముస్లిం ఓటర్లే ఉన్నారు. ఈ కారణంగానే కాంగ్రెస్‌ గత 46 ఏళ్లుగా అక్కడ మైనార్టీలనే నిలబెడుతోంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ప్రాబల్యం కలిగి ఉన్న సైదీ అనే ముస్లిం కుటుంబం కాంగ్రెస్‌కు ప్రధాన బలంగా ఉంది. అయితే జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన సాద్‌ సైదీ 2008, 2013లో ఇక్కడి టికెట్‌ ఆశించి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో మరో మైనార్టీ నేత, కాంగ్రెస్‌ అభ్యర్థి జకియాపై రెబల్‌గా పోటీ చేసి ఓడిపోయారు.

కాగా 1985 నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేస్తున్న జకియా 1985, 98, 2008 ఎన్నికల్లో విజయం సాధించి ఆ ప్రాంతంపై తనకున్న పట్టును నిరూపించుకున్నారు. అయితే ప్రస్తుతం టాంక్‌ నుంచి సచిన్‌ పైలట్‌ పోటీ చేయనుండటంపై జకియా ఇంతవరకు స్పందించలేదు. సద్‌ సైదీ మాత్రం సచిన్‌ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. అభ్యర్థి ఎవరైనా సరే కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలంతా గెలుపు కోసం కృషి చేస్తారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బీజేపీ మాత్రం ఈ స్థానంలో ఆరెస్సెస్‌కు చెందిన బలమైన నాయకులను నిలబెడుతోంది.

టోంక్‌’ చారిత్రక నేపథ్యం
రాజస్థాన్‌లోని టోంక్‌ సంస్థానాన్ని పరిపాలించిన నవాబులది ప్రత్యేక వ్యక్తిత్వం. మిగతా రాజవంశీకులందరూ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటే.. వీరు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాగా బ్రిటీషర్లకు, అఫ్గాన్లకు కుదిరిన ఒప్పందం కింద 1808లో టోంక్‌ సంస్థానం ఆవిర్భవించింది. 19వ శతాబ్దిలో ఈ రాజవంశం బలమైన మిలటరీ శక్తిగా పేరొందింది. అయితే ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చి రాజభరణాల రద్దు, లాండ్‌ సీలింగ్‌ చట్టం తెచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. నవాబు వంశ మూల ఆర్థిక వనరులపై ఈ రెండు అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి.

ఈ మార్పు తర్వాత ప్రధాన పార్టీల తరఫు అభ్యర్ధులకు మద్దతు ఇవ్వడానికే నవాబులు పరిమితం అయ్యారు. బైరాన్‌సింగ్‌ షెకావత్‌కు వీరి మద్దతు ఉండేది. ప్రస్తుత నవాబు ఢిల్లీలో నివసిస్తుండగా, కుటుంబంలోని వారంతా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చూసుకుంటూ ఉన్నారు. ఈ వంశానికి చెందిన దాదాపు 615 మంది ప్రస్తుతం టోంక్‌ స్టేట్‌ ఖాందాన్‌ నిబంధనలు–1944 కింద నెలకు వెయ్యిరూపాయల పింఛను అందుకుంటున్నారు. జైపూర్, అల్వార్, భరత్‌పూర్, జోధ్‌పూర్, బికనీర్, జైసల్మేర్, పాలి తదితర సంస్థానాధీశులంతా నేతలవుతున్నా టోంక్‌ నవాబులు మాత్రం రాజకీయాలపై ఆసక్తి కనబరచలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement