కేంద్రాన్ని ప్రశ్నించిన రాహుల్‌ గాంధీ

Rahul Gandhi On Ladakh Why Is China Praising PM - Sakshi

న్యూఢిల్లీ: గల్వాన్‌ లోయలో భారత్‌-చైనాల మధ్య జరిగిన ఘర్షణలపై కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ.. కేంద్రంపై విమర్శల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని ‘సరెండర్‌ మోదీ’ అంటూ విమర్శించిన రాహుల్‌ గాంధీ తాజాగా.. మరిన్ని విమర్శలు చేశారు. లడాఖ్‌ వివాదంపై చైనా.. ప్రధానిని ఎందుకు ప్రశంసిస్తుందని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. ఈ క్రమంలో చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌లో‌ ‘లడాఖ్‌ అంశంలో మోదీ తీసుకున్న చర్యలను ప్రశంసించింది’ అంటూ చెన్నై డేట్‌లైన్‌తో భారత్‌కు చెందిన ఓ ఆంగ్ల మీడియా కథనాన్ని వెలువరించింది. ఈ క్రమంలో రాహుల్‌ గాంధీ సదరు పత్రికలో వచ్చిన వార్తను ట్వీట్‌ చేస్తూ.. ‘చైనా మన సైనిలకులను చంపేసింది. మన భూభాగాన్ని ఆక్రమించింది. ఇప్పుడు ఈ వివాదంలో చైనా మన ప్రధానిని ప్రశంసిస్తుంది ఎందుకు’ అని ఆయన ప్రశ్నించారు. అఖిలపక్ష భేటీ జరిగిన నాటి నుంచి రాహుల్‌ గాంధీ, ప్రధాని పై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. (ఆయన ‘సరెండర్‌’ మోదీ: రాహుల్‌) 

సోమవారం చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌లో ‘చైనాతో యుద్ధం చేయలేమని భారత్‌కు తెలుసు. అందుకే నరేంద్ర మోదీ పరిస్థితి తీవ్రతరం కాకుండా మాటలతో మభ్యపెడుతున్నారు. సైనిక పరంగానే కాకుండా.. మొత్తం అంతర్జాతీయ సమాజంలో చైనా సామర్థ్యం భారత్‌ కన్నా అధికం’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాక ‘చైనాతో సరిహద్దు వివాదం అంశంలో.. మోదీ భారత సైన్యం అవసరమైన అన్ని చర్యలు తీసుకోగలదని తెలపడం కేవలం ఆ దేశ ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి, భారత దళాల ధైర్యాన్ని పెంచడానికి మాత్రమే’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top