మోడీవన్నీ ఆరెస్సెస్ మూలాలు | rahul gandhi fires on narendra modi | Sakshi
Sakshi News home page

మోడీవన్నీ ఆరెస్సెస్ మూలాలు

Feb 9 2014 2:57 AM | Updated on Oct 8 2018 7:53 PM

మోడీవన్నీ ఆరెస్సెస్ మూలాలు - Sakshi

మోడీవన్నీ ఆరెస్సెస్ మూలాలు

మహాత్మాగాంధీ హత్యకు కారణమైన ఆరెస్సెస్ భావజాలంతోనే బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ జీవితమంతా ముడిపడిఉందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన ప్రత్యర్థిపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు

 గుజరాత్ సీఎంపై రాహుల్ ధ్వజం
 ఆ సంస్థ భావజాలమే మహాత్ముడ్ని చంపింది
 పటేల్ గురించి తెలుసుకోకుండానే ఐక్యతా చిహ్నం
 పేదల్నే తొలగించాలని బీజేపీ చూస్తోంది
 
 బర్దోలీ (గుజరాత్): మహాత్మాగాంధీ హత్యకు కారణమైన ఆరెస్సెస్ భావజాలంతోనే బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ జీవితమంతా ముడిపడిఉందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన ప్రత్యర్థిపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. గుజరాత్ అభివృద్ధి అంతా తానే చేశానంటూ మోడీ చెప్పుకోవడాన్ని శనివారం ఇక్కడ జరిగిన బహిరంగ సభలో తప్పుబట్టారు. మోడీ ఎప్పుడూ మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్ ఆదర్శాలను పాటించలేదని, ఆయనవన్నీ ఆరెస్సెస్ మూలాలని రాహుల్ విమర్శించారు. మహాత్ముడి హత్య తర్వాత ఆ సంస్థపై నిషేధం విధించాలని పటేల్ ప్రతిపాదించారని పేర్కొన్నారు. ఆరెస్సెస్ భావజాలంతో దేశానిని ముప్పు అని పటేల్ చెప్పారన్నారు. పటేల్ జీవితం గురించి ఏమీ తెలుసుకోకుండానే ఇప్పుడు ‘ఐక్యతా చిహ్నం’ పేరుతో విగ్రహం నిర్మించి ఆయన వారసులమని చెప్పుకోవడానికి కమలనాథులు తహతహలాడుతున్నారని ధ్వజమెత్తారు. పటేల్ జీవితాన్ని మొత్తం కాంగ్రెస్‌కు, పేదలకు అంకితం చేశారని పునరుద్ఘాటించారు. 1928లో రైతులకు బాసటగా బర్దోలీ సత్యాగ్రహాన్ని పటేల్ ముందుండి నడిపారని గుర్తుచేశారు.
 
 ప్రచార ఆర్భాటమే..
 ప్రచారంలో ముందున్నా.. మోడీ పాలనలో మాత్రం పారదర్శకతలేదని రాహుల్‌గాంధీ  విరుచుకుపడ్డారు. అక్కడ అవినీతి ఉంది, ఇక్కడ అవినీతి ఉందనే మోడీ మంత్రివర్గంలో ఎంతమంది దోషులన్నారని సభికుల్ని ప్రశ్నించారు. వారు ముగ్గురు అని బదులివ్వడంతో.. అది మాత్రం బీజేపీ నేతలకు కనబడటం లేదంటూ ఎద్దేవా చేశారు. అంతకుముందు గుజరాత్ యూత్ కాంగ్రెస్ నిర్వహిస్తున్న వికాస్ ఖోజ్ యాత్రలో రాహుల్ గాంధీ ఐదు కిలోమీటర్లకుపైగా నడిచారు. పటేల్ గడిపిన స్వరాజ్ ఆశ్రమాన్ని సందర్శించే ముందు రోడ్డుకు ఇరువైపులా నిలబడిన ప్రజలతో కరచాలనం చేస్తూ నడిచారు.
 
 రాహుల్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
     ఆర్టీఐ, లోక్‌పాల్ బిల్లులు తీసుకొచ్చాం. కానీ మరో ఆరు అవినీతినిరోధక బిల్లులు తేవడానికి ప్రతిపక్షం సహకరించట్లేదు.
 
     పేదరిక నిర్మూలనకు మేము కట్టుబడితే.. ఆ పేదల్నే తొలగించాలని బీజేపీ తలపోస్తోంది.
     గుజరాత్‌లో 38 లక్షల కుటుంబాలు పేదరికంలో మగ్గిపోతున్నా.. రాష్ట్రం వెలిగిపోతోందంటూ బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.
     గుజరాత్ అభివృద్ధి ప్రజల స్వేధంతోనే జరిగింది తప్ప ఏ ఒక్కరి ప్రతిభవల్లో కాదు.
 
 ఫూల్స్‌ను చేసేవాళ్లకి ఆ అర్హతలేదు
 ‘చాయ్‌వాలా’నంటూ ప్రచారం చేసుకోవడంపై మోడీకి రాహుల్ పరోక్షంగా చురకలంటించారు. అన్ని వృత్తులూ గౌరవింపదగ్గవేనని, అయితే ఎదుటవారిని ఫూల్స్ చేసేవాళ్లకి మాత్రం ఆ అర్హత లేదన్నారు. ‘కొంతమంది టీలమ్ముతారు. మరి కొందరు ట్యాక్సీ నడుపుతూనో, వ్యవసాయం చేస్తూనో జీవిస్తారు. వాళ్లందరినీ గౌరవిస్తాం. ఎదుటవాళ్లను ఫూల్స్‌ను చేసేవాళ్లని గౌరవించాల్సిన పనిలేదు’ అని రాహుల్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement