కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లైన తర్వాత తొలిసారిగా భారీ మార్పులతో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగబోతోంది.
- పలువురి శాఖల మార్పు
- కేబినెట్ పునర్వ్యస్థీకరణపై కసరత్తు
న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లైన తర్వాత తొలిసారిగా భారీ మార్పులతో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగబోతోంది. జూలై 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందే మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా గురువారమే పునర్వ్యవస్థీకరణ ఉంటుందని ప్రచారం జరుగుతున్నా.. జూలై 6న ప్రధాని ఆఫ్రికా పర్యటనకు ముందు కార్యక్రమం నిర్వహించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలంటున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేయనున్నారు.
ఇందుకోసం ప్రధాని మోదీతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ చీఫ్ అమిత్ షా బుధవారం రాత్రి అత్యవసరంగా భేటీ అయ్యారు. రెండేళ్లలో మంత్రుల పనితీరు ఆధారంగా శాఖల్లో మార్పులు జరగనున్నట్లు తెలిసింది. స్వయం ప్రతిపత్తి శాఖల్లో ఉన్న విద్యుత్ మంత్రి పీయూశ్ గోయల్, పెట్రోలియం మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌లకు కేబినెట్ ర్యాంకు ఇవ్వటంతోపాటు ప్రాధాన్యమున్న శాఖలను అప్పగించే అవకాశం ఉంది.
కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా ఉండి అస్సాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సర్బానంద్ సోనోవాల్ స్థానాన్ని, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా ఉండి మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌గా వెళ్లిపోయిన రావ్‌సాహెబ్ పాటిల్ దాన్వే స్థానాలను కూడా భర్తీ చేయనున్నారు. మోదీ మంత్రివర్గంలో 82 మందికి అవకాశం ఉండగా.. ప్రస్తుతానికి ప్రధానితో కలిపి 70 మంది మాత్రమే ఉన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌నుంచి కనీసం 12 మంది మంత్రి వర్గంలో ఉండేలా చూస్తున్నట్లు తెలిసింది. చాలా మంత్రిత్వ శాఖల్లో మార్పులు జరగనున్నట్లు సమాచారం. న్యాయశాఖ మంత్రిగా ఉన్న సదానంద గౌడ పనితీరు అనుకున్న స్థాయిలో లేదని.. అందువల్ల ఈయనకు సహాయ మంత్రిని ఇవ్వాలనే ఆలోచనలో మోదీ ఉన్నట్లు సమాచారం.