
నవీన్ పట్నాయక్‌పై మోదీ ఫైర్
భువనేశ్వర్ : ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలతో విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఒడిశాలో బీజేపీ కార్యకర్తలపై దాడులు పెచ్చుమీరడం పట్ల ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశా సీఎంగా 20 ఏళ్ల పాటు సేవలందించిన నవీన్ పట్నాయక్‌ను సాదరంగా సాగనంపాలనే ఉద్దేశంతో తాను ఇంతవరకూ ఆయనపై మెతక వైఖరి అవలంభించానని, కానీ బెంగాల్ తరహా హింస ఇక్కడ జరుగుతోందని, ఇక ఆయనను ఎవరూ కాపాడలేరని మోదీ పేర్కొన్నారు.
కేంద్రపారాలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ నవీన్ పట్నాయక్ కనుసన్నల్లో నడుస్తున్న అధికారుల తీరుతోనే ఒడిశాలో హింస చోటుచేసుకుంటోందని, నవీన్ పట్నాయక్‌ను ఆయన అధికారులు సైతం కాపాడలేరని చెప్పారు. ఒడిశా ప్రజలు నవీన్ పట్నాయక్‌ను సాగనంపుతారని అన్నారు.