మోదీ ట్వీట్‌ తర్వాత కోహ్లి ట్వీటే..

Narendra Modi Wins Indias Golden Tweet Of 2019 - Sakshi

హైదరాబాద్‌: ‘సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌.. సబ్‌కా విశ్వాస్‌.. విజయీ భారత్‌. మళ్లీ గెలిచాం అందరం కలిసి దృఢమైన సమగ్రమైన భారతావనిని నిర్మిద్దాం’ 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్‌ ఇది. ఈ ట్వీట్‌ బుల్లెట్‌ కంటే వేగంగా ప్రజల్లోకి, ముఖ్యంగా యూత్‌లోకి దూసుకెళ్లి తెగ వైరలయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మోదీ చేసిన ట్వీట్‌కు ఊహించని రీతిలో రీట్వీట్‌లు, లైక్‌లు వచ్చి పడటంతో ట్విటర్‌ హోరెత్తిపోయింది.

మోదీ చేసిన ఈ ట్వీట్‌ ‘గోల్డెన్‌ ట్వీట్‌ ఆఫ్‌ 2019’గా నిలిచింది. ఈ విషయాన్ని ట్విటర్‌ అధికారికంగా ప్రకటించింది. ఇక సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉండే ప్రధాని మోదీ యువతను చైతన్య పరిచే విధంగా పలు ట్వీట్లు చేస్తుంటారు. అందుకే ఆయనకు ప్రపంచంలోనే ఏ నాయకుడికి లేనంత సోషల్‌ మీడియా ఫాలోయింగ్‌ ఏర్పడిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

ఇక మోదీ ట్వీట్‌ అనంతరం నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన మరో ట్వీట్‌ ఎంఎస్‌ ధోని బర్త్‌డే సందర్భంగా విరాట్‌ కోహ్లి చేసిన ట్వీట్‌. ‘హ్యాపీ బర్త్‌డే మహి భాయ్. నమ్మకం, గౌరవం అనే పదాలకు అర్థం చాలా కొంత మందికి మాత్రమే తెలుస్తుంది. నాకు అలాంటి ఫ్రెండ్‌షిప్ దొరికినందుకు, నీతో ఎన్నో ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. మా అందరికి నువ్వొక పెద్దన్నయ్యవు. నేను గతంలో చెప్పినట్లుగా, నువ్వు ఎప్పటికీ నా కెప్టెన్‌వే’ అని కోహ్లి తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌లో ధోనిపై కోహ్లికున్న ప్రేమాభిమానాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. అంతేకాకుండా కోహ్లిలోని అంతరంగ భావాలను ఈ ట్వీట్‌లో వ్యక్తపరిచాడంటూ నెటిజన్లు ప్రశంసించారు. దీంతో కోహ్లి ట్వీట్‌కు ఊహించని రీతిలో రీ ట్వీట్‌, లైక్‌లు వచ్చిపడ్డాయి. దీంతో మోదీ తర్వాత రెండో గోల్టెన్‌ ట్వీట్‌గా ఇది నిలిచింది. ఇక ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా క్రీడా విభాగంలో అత్యధికమంది లైక్‌, రీట్వీట్‌ చేసింది కోహ్లి ట్వీట్‌నే కావడం విశేషం. 
 

ఆ తర్వాత ఎక్కువమంది ప్రజానీకం చంద్రయాన్‌-2పై ఎక్కువగా ఆసక్తి కనబర్చారు. దీంతో చంద్రయాన్‌-2కు సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం ఇస్రో, నాసా ట్విటర్‌లను ఎక్కువగా ఫాలో అయ్యారు. ఇక ఈ ట్వీట్‌లతో పాటు ఈ ఏడాది బాగా ట్రెండ్‌ అయిన హ్యాష్‌ ట్యాగ్‌లను కూడా ట్విటర్‌ పేర్కొంది. ఈ ఏడాది ముఖ్యంగా భారత్‌లో ట్రెండ్‌ అయిన హ్యాష్‌ ట్యాగ్‌ ‘ #loksabhaelections2019’ అని ట్విటర్‌ పేర్కొంది. అనంతరం వరుసగా #chandrayaan2, #cwc19, #pulwama, #article370, #bigil, #diwali, #avengersendgame, #ayodhyaverdict, #eidmubarak హ్యాష్‌ ట్యాగ్‌లు ట్రెండ్‌ అయ్యాయని ప్రకటించింది. సినిమాల విషయంలో తమిళ అగ్ర హీరో విజయ్‌ నటించిన బిజిల్‌ చిత్రంపై నెటిజన్లు తెగ ఆసక్తి కనబర్చారు. దీంతో #bigil హ్యాష్‌ ట్యాగ్‌ బాగా ట్రెండ్‌ అయినట్లు ట్విటర్‌ తెలిపింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top