టిక్‌టాక్‌పై నిషేధం

Indian Government Bans China Apps Including Tiktok - Sakshi

మరో 58 చైనా యాప్‌లపై కూడా.. కేంద్రం సంచలన నిర్ణయం

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. చైనా వస్తువులు, మొబైల్‌ అప్లికేషన్లు(యాప్స్‌) నిషేధించాలన్న డిమాండ్‌ దేశవ్యాప్తంగా పెరుగుతూ వచ్చింది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, ప్రజాభద్రత దృష్ట్యా మొత్తం 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర సర్కారు ప్రకటించింది. ఈ ప్రకటనలో చైనా పేరు ఎక్కడా ప్రస్తావించకపోయినా.. దాదాపు ఈ యాప్‌లన్నీ చైనాకు చెందినవే. బాగా పాపులర్‌ అయిన టిక్‌టాక్, హెలో, యూసీ బ్రౌజర్, న్యూస్‌ డాగ్‌ వంటి యాప్‌లు సహా మొత్తం 59 యాప్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.

భద్రతాపరమైన కారణాల దృష్ట్యా వీట న్నింటిపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ సోమవారం రాత్రి ప్రకటించింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్‌ 69ఏ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ నిబంధనలు–2009ని అనుసరించి భద్రతాపరంగా పొంచి ఉన్న ముప్పు ఆధారంగా 59 యాప్‌లను నిషేధిస్తున్నట్టు తెలిపింది. ఇవి దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, దేశరక్షణ, ప్రజా భద్రతకు హాని కలిగించే కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నట్టు సమాచారం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. 130 కోట్ల మంది భారతీయుల గోప్యతను కాపాడాల్సి ఉందని అభిప్రాయపడింది.

నిషేధిత యాప్‌లు ఇవే..
 

భారతీయుల ప్రయోజనాల పరిరక్షణకే..
ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ ప్లాట్‌ఫామ్‌లలో లభ్యమయ్యే కొన్ని మొబైల్‌ యాప్‌లు భారతదేశం వెలుపల ఉన్న సర్వర్లకు మన దేశ వినియోగదారుల డేటాను అనధికారికంగా చేరవేస్తున్నట్లు, రహస్యంగా, దొంగతనంగా డేటాను పంపిస్తున్నట్టు ఐటీ శాఖకు అనేక ఫిర్యాదులు అందాయి. ఇది చాలా ఆందోళన కలి గించే విషయమైనందున అత్యవసర చర్యలు చేపట్టినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ హానికరమైన యాప్‌లను నిరోధించడానికి భారత సైబర్‌ క్రైమ్‌ కో–ఆర్డినేషన్‌ సెంటర్, హోం మంత్రిత్వ శాఖ కూడా సమగ్ర సిఫార్సులను పం పాయి.

డేటా సెక్యూరిటీ, గోప్యతకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు అందినట్టు ఐటీ శాఖ తెలిపింది. కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌కు కూడా డేటా భద్రత, గోప్యతలకు సంబం ధించి ఫిర్యాదులు అందాయి. దేశ సార్వభౌమత్వానికి, పౌరుల గోప్యతకు హాని కలిగించే మొబైల్‌ యాప్స్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయని కేంద్రం పేర్కొంది. వీటిని ప్రాతిపదికగా తీసుకోవడంతోపాటు, దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు ఇలాంటి యాప్స్‌ ముప్పు కలిగిస్తున్నాయన్న విశ్వసనీయమైన సమాచారాన్ని స్వీకరించి ఇకపై ఈ యాప్స్‌ను వినియోగించేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్టు తేల్చిచెప్పింది. మొబైల్, నాన్‌ మొబైల్‌ ఇంటర్నెట్‌ ఆధారిత డివైజెస్‌లలోనూ వీటి వినియోగాన్ని నిషేధిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ చర్య కోట్లాది మంది భారతీయ మొబైల్, ఇంటర్నెట్‌ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తుందని తెలిపింది. ఈ నిర్ణయం భారత సైబర్‌ స్పేస్‌ భద్రత, సార్వభౌమత్వాన్ని పటిష్టం చేసుకునే దిశగా తీసుకున్న చర్యగా అభివర్ణించింది.

చైనాకు ఘాటైన హెచ్చరిక 
యాప్‌లపై నిషేధం విధించడం చైనా ఎగుమతులు, దిగుమతులపై ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చని సమాచారం. ఆయా యాప్‌లు వాణిజ్య ప్రకటనల ద్వారా భారత్‌లో రూ.వేల కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నాయి. టిక్‌టాక్‌ మొత్తం వినియోగదారుల్లో 30 శాతం మంది మన దేశం నుంచే ఉన్నట్టు అంచనా. ప్రస్తుతం భారత ప్రభుత్వం తీసుకున్న చర్య వల్ల ఆయా కంపెనీల ఆదాయం గణనీయంగా పడిపోవడమే కాకుండా వాటి విలువ తగ్గుతుంది. చైనా యాప్‌ రెవెన్యూలో 2016 నుంచి ఏటా 140 శాతం వృద్ధిరేటు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

చైనా యాప్‌లపై నిషేధం విధించడంతో భారతీయ యాప్‌ మార్కెట్‌ విస్తరించే అవకాశం ఉంది. టిక్‌టాక్‌ వంటి యాప్‌లకు పోటీగా ఇప్పటికే చింగారీ వంటి స్వదేశీ యాప్‌ నిలదొక్కుకుంటోంది. అలాగే న్యూస్‌డాగ్, హెలో వంటి న్యూస్‌ అగ్రిగేటర్లకు దీటైన స్వదేశీ యాప్స్‌ నిలదొక్కుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. చైనా దుందుడుకు చర్యలకు తగిన సమాధానంగానే యాప్‌లపై నిషేధం విధించినట్లు అవగతమవుతోంది. 

మొబైళ్లలో వచ్చే యాప్‌ల పరిస్థితి ఏంటి? 
ఇప్పటికే చైనా తయారీ మొబైల్స్‌ భారత్‌లో అత్యధికంగా వినియోగంలో ఉన్నాయి. ఈ నిషేధిత యాప్‌ల్లో చాలా వరకు మొబైల్‌ ఫోన్లలోనే ఇన్‌బిల్ట్‌గా నిర్మితమై ఉన్నాయి. వాటిని తొలగించేందుకు అవకాశం లేదు. కేంద్రం నిషేధించినప్పటికీ కొత్తగా వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోకపోయినా పాత యాప్‌లు వినియోగంలో ఉంటాయని సంబంధిత కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top