లైంగిక నేరస్తుల రిజిస్టర్‌

India Launches First molestation Offenders Register - Sakshi

వివరాలు, వేలిముద్రలతో మృగాళ్ల డేటాబేస్‌

ప్రారంభించిన కేంద్ర  స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనక  

క్షణానికో లైంగిక దాడి, నిముషానికో అత్యాచారం, గంటకో గ్యాంగ్‌రేప్‌ భారత్‌లో ఎటు చూసినా మహిళల ఆక్రందనలే వినిపిస్తున్నాయి. కళ్లు మూసుకుపోయిన కామాంధులు పసిమొగ్గల్ని కూడా నిర్దయగా చిదిమేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు, చిన్నారులపై నేరాలను అరికట్టడానికి, లైంగిక నేరాల విచారణ చురుగ్గా సాగడానికి కేంద్ర ప్రభుత్వం లైంగిక నేరస్తుల జాతీయ రిజిస్టర్‌ను (ఎన్‌ఆర్‌ఎస్‌ఒ) ప్రారంభించింది. దేశంలో లైంగిక నేరస్తుల వివరాలన్నీ ఇలా ఒక్కచోటకి చేర్చడం ఇదే ప్రథమం. నేరస్తుడికి సంబంధించిన పేరు, చిరునామా, వేలిముద్రలు సహా ప్రతీ చిన్న వివరాన్నీ అందులో పొందుపరుస్తారు. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లను సంప్రదించి నేరస్తుల వివరాలు సేకరించింది. తొలి దశలో 4లక్షల 40 వేల మంది వివరాలతో ఈ రిజిస్టర్‌ను ప్రారంభించారు. 2012లో నిర్భయ అత్యాచార ఘటన తర్వాత ఇలాంటి రిజిస్టర్‌ను తీసుకురావాలన్న ప్రతిపాదన యూపీఏ హయాంలోనే వచ్చింది.

ఈ మధ్య కాలంలో చిన్నారులపై కూడా అత్యంత హేయమైన నేరాలకు పాల్పడుతూ ఉండడంతో ఎన్టీయే ప్రభుత్వం ఈ రిజస్టర్‌ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ రిజిస్టర్‌ను ప్రారంభించిన కేంద్ర మహిళా శిశు శాఖా మంత్రి మేనకా గాంధీ లైంగిక నేరాల్లో విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని పోలీసుల్ని ఆదేశించారు. నేరాలు జరిగిన సమయాల్లో ఆధారాలను సేకరించడానికి ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన 79 లక్షల ఫోరెన్సిక్‌ కిట్స్‌ను దేశవ్యాప్తంగా  పోలీసు యంత్రాంగానికి పంపిణీ చేయనున్నారు. ఇక మహిళలు, చిన్నారులపై ఆన్‌లైన్‌  నేరాలకు  సంబంధించి ఫిర్యాదుల స్వీకరణకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ cybercrime.gov.in అనే వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించారు. చిన్నపిల్లల పోర్నోగ్రఫీ , వారి ఫోటోలను అభ్యంతరకరంగా చిత్రీకరించడం వంటి నేరాలకు సంబంధించి ఎవరైనా ఈ వెబ్‌సైట్‌ ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు. 

భారత్‌ వంటి దేశాలకు సరిపోదు
ఇలాంటి రిజిస్టర్‌ల వల్ల నేరస్తుల వివరాలన్నీ పోలీసులకు క్షుణ్ణంగా తెలియడమే కాదు, ఫలానా ప్రాంతంలో నేరస్తుల జాడ ఉందని తల్లిదండ్రుల్ని హెచ్చరిక చేయవచ్చు. దాని ద్వారా నేరాల్ని అరికట్టే అవకాశం ఉంటుంది. అయితే భారత్‌ వంటి దేశాల్లో ఇలాంటి రిజిస్టర్‌ వల్ల పెద్దగా ఉపయోగాలు ఉండవని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ భారత్‌ విభాగానికి చెందిన అధ్యయనవేత్త లేహ్‌ వెర్గీస్‌ అంటున్నారు. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు సంబంధించిన 94% కేసుల్లో కుట్రదారులు వారికి బాగా తెలిసినవారే అయి ఉంటున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.అలాంటప్పుడు ఇలాంటి రిజిస్టర్‌ వల్ల రక్షణ ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు.

డేటా బేస్‌ ముఖ్యాంశాలివీ... 

డేటాబేస్‌ను ఎవరు నిర్వహిస్తారు 
జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ)ఈ డేటాని భద్రపరుస్తుంది. చట్ట సంస్థలకు చెందిన అధికారులెవరైనా ఈ డేటాబేస్‌లో అంశాలన్నీ చూడొచ్చు. తమ విచారణకు వినియోగించుకోవచ్చు. సాధారణ పౌరులు వీటిని చూడడానికి వీలులేదు. నేరస్తులైనప్పటికీ వారి వ్యక్తిగత గోప్యతను కేంద్రం పాటిస్తుంది. 

ఏయే దేశాల్లో ఈ తరహా డేటాబేస్‌ ఉంది 
అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్, టొబాగో

ఏయే అంశాలుంటాయి 
లైంగిక నేరస్తుడి పేరు, చిరునామా, ఫోటో, వేలిముద్రలు, ఆధార్, పాన్‌ కార్డు నెంబర్లు, డీఎన్‌ఏ నమూనాలు, దోషిగా తేలిన లైంగిక దాడి కేసుల వివరాలు

ఎన్నాళ్లు ఈ డేటా భద్రంగా ఉంటుంది 
తక్కువ ప్రమాదం ఉన్న నేరాలు చేసిన వారి వివరాలు 15 ఏళ్లు,  ఇంకాస్త ప్రమాదం ఉన్న  నేరాలు చేసిన వారి వివరాలు 25 ఏళ్లు, గ్యాంగ్‌ రేప్‌లు, అత్యాచారం సమయంలో హింసకు పాల్పడడం వంటి అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడిన వారి వివరాలు జీవితకాలం పాటు ఉంటాయి. 

ఎంతమంది నేరస్తుల వివరాలు ఉన్నాయి 
ఇప్పటివరకు 4.4 లక్షల మంది నేరస్తుల సమగ్ర వివరాలు ఈ డేటాబేస్‌లో పొందుపరిచారు. 2005 నుంచి లైంగిక నేరాల్లో శిక్ష పడిన వారి వివరాలన్నీ ఇందులో లభిస్తాయి. బాల నేరస్తుల వివరాలు తర్వాత దశలో చేర్చుతారు. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top