ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా?

India Asks Twitter To Curb communal Content - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వం ఆదేశాల మేరకు మత విద్వేషాలను రెచ్చగొట్టే సమాచారాన్ని లేదా వదంతులను తక్షణమే తొలగించడంలో సోషల్‌ మీడియా ట్విటర్‌ తాత్సారం చేస్తోందని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆరోపించింది. ఈ విషయంలో చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఖాతాదారులను పట్టుకునేందుకు వినియోగదారుల వ్యక్తిగత డేటాను, వారి ఫోన్‌ నెంబర్లను ఇవ్వాల్సిందిగా కూడా కేంద్రం కోరినట్లు వార్తలు వచ్చాయి.

దేశంలో పిల్లలను ఎత్తుకుపోయి వారి అవయవాలను అమ్ముకునే ముఠాలు తిరుగుతున్నాయంటూ 2017, జనవరి నెల నుంచి సోషల్‌ మీడియాలో వచ్చిన వదంతుల వల్ల దేశవ్యాప్తంగా జరిగిన మూక హత్యల్లో దాదాపు 33 మంది మరణించడం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే వదంతులు లేదా మత విద్వేషాలను రెచ్చగొట్టే సమాచారాన్ని పోస్ట్‌ చేసిన తక్షణమే తొలగించాల్సిందిగా కేంద్ర సమాచార శాఖ సోషల్‌ మీడియాను హెచ్చరించింది. ఈ ఉత్తర్వులను అమలు చేయడంలో ట్విట్టర్‌ తాత్సారం చేస్తున్నట్లు సోమవారం నాడు ఆరోపించింది.

డేటా రక్షణకే దేశంలో ఇప్పటి వరకు సరైన చట్టం లేదు. అలాంటప్పుడు ప్రజాభిప్రాయం లేకుండా యూజర్ల వ్యక్తిగత డేటాను, ఫోన్‌ నెంబర్లను ప్రభుత్వం అడగడం ఏమిటీ? వ్యక్తిగత డేటాను ఇవ్వడమంటే భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే అవుతుందని ట్విటర్‌ కేంద్రానికి సూచించింది. ఇప్పటికే విద్వేశ చట్టాలను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలే దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత డేటాలు ప్రభుత్వం చేతికందితే దుర్వినియోగం కావన్న గ్యారంటీ ఏముంది? పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారన్న కారణంగా మధ్యప్రదేశ్‌లో ఒక్క 2017లోనే 15 మందిపైన దేశ ద్రోహం కేసులను పోలీసులు బనాయించారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారన్న కారణంగా ఓ 18 ఏళ్ల యువకుడిని అరెస్ట్‌ చేశారు.

ఒడిశాలోని కోణార్క్‌ దేవాలయంపై బూతు విగ్రహాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించినందుకు గత సెప్టెంబర్‌ నెలలో ఓ రక్షణ శాఖ విశ్లేషకుడిని అరెస్ట్‌ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో మత ఘర్షణలను రెచ్చగొట్టేందుకు బీజేపీ మీడియా సెల్‌ ఉద్దేశపూర్వకంగా నకిలీ ఫొటోలను పోస్ట్‌ చేసినప్పటికీ ఎలాంటి చర్య తీసుకోని కేంద్ర ప్రభుత్వం, మత విద్వేషాలను రెచ్చగొట్టే సమాచారాన్ని తక్షణం తొలగించాలనడంలో ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top