కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వస్తుసేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లు ఈ వారమే రాజ్యసభ ముందుకు రానుంది.
ఈ వారమే రాజ్యసభలో వస్తుసేవల పన్ను బిల్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వస్తుసేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లు ఈ వారమే రాజ్యసభ ముందుకు రానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1నుంచి దీన్ని అమలు చేయాలనుకుంటున్న కేంద్రం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే దీనికి ఆమోదముద్ర పడేలా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. రాజ్యాంగంపై జరిగిన చర్చ తప్ప మిగిలిన అన్ని రోజులూ కేంద్ర మంత్రి వీకే సింగ్ రాజీనామా డిమాండ్‌తో రాజ్యసభలో విపక్షాల ఆందోళనలతో సభా కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలంటే పెద్దలసభలో జీఎస్‌టీ బిల్లును గట్టెక్కించటం బీజేపీకి చాలా కీలకం.
అయితే కాంగ్రెస్ మాత్రం తాము సూచించినట్లుగా 18శాతం క్యాప్ విధించటంతోపాటు మరో రెండు అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని పట్టుబడుతోంది. ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలకు లాభం చేకూర్చేందుకు ఆదనంగా ఒకశాతం లెవీ విధించటాన్ని కేంద్రం రద్దుచేయటంపైనా కాంగ్రెస్ మండిపడుతోంది. సాధారణ మెజారిటీతో ఈ బిల్లులో మార్పులకు అనుమతించకూడదని డిమాండ్ చేస్తోంది. అయితే.. బీజేడీ, ఎన్సీపీ, జేడీయూ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు (32 పార్టీల్లో 30 పార్టీలు) ఏకగ్రీవంగా జీఎస్‌టీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించాయి. సమస్య పరిష్కారానికి ప్రధాని చొరవతీసుకుని సోనియా, మన్మోహన్‌తో సమావేశమైనా ప్రధాన ప్రతిపక్షం తీరులో ఎలాంటి మార్పు కనిపించటం లేదు.
అవినీతి దర్యాప్తులన్నీ లోక్‌పాల్ కిందకు!
అవినీతి ఆరోపణలతో ప్రభుత్వాధికారులపై నమోదయ్యే కేసులను సీబీఐ, చీఫ్‌విజిలెన్స్‌కమిషన్, పోలీసులు ఇలా వేర్వేరు సంస్థలు చేస్తున్న దర్యాప్తులన్నింటినీ లోక్‌పాల్ కిందకు తేవాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసే అవకాశముంది. ఈ చట్టంపై కమిటీ రూపొందించిన నివేదికను సోమవారం లోక్‌సభ, రాజ్యసభలలో ప్రవేశపెడతామని కమిటీ ఛైర్మన్ సుదర్శన తెలిపారు.