సైన్స్‌ డిగ్రీనా.. సెటిలైనట్లే..!

Employable Talent Increase In Science Students  - Sakshi

బీఎస్సీలో పెరుగుతున్న ‘ఎంప్లాయబుల్‌ టాలెంట్‌’ 

ఇంజనీరింగ్‌ కోర్సులు చేసిన వారితో సమానంగా పెరుగుదల నమోదు 

సామర్థ్యాల్లో ‘ఇంజనీరింగ్‌’తో పోటీ పడుతున్న సైన్స్‌ డిగ్రీ విద్యార్థులు 

ఇండియా స్కిల్‌ రిపోర్టు–19 వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌లో మాత్రమే కాదు.. బీఎస్సీ వంటి సైన్స్‌ కోర్సులు చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ఉద్యోగానికి కావాల్సిన ప్రతిభ (ఎంప్లాయబుల్‌ టాలెంట్‌) కలిగిన విద్యార్థుల సంఖ్య బీఎస్సీ కోర్సుల్లో భారీగా పెరుగుతోంది. ఈ విషయాన్ని ఇండియా స్కిల్‌ రిపోర్టు–2019 వెల్లడించింది. వీబాక్స్, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే నివేదికను ఇటీవల విడుదల చేసింది. అందులో దేశంలో వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల స్థితిగతులపై అంచనా వేసింది. ఈ సర్వేలో భాగంగా దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 100కు పైగా కంపెనీలు, 3.10 లక్షల మంది విద్యార్థులను కలిసింది. వారి అభిప్రాయాలు, పరిస్థితులను సమగ్రంగా విశ్లేషించి నివేదికను వెల్లడించింది. 2017 సంవత్సరంలో ఉద్యోగానికి కావాల్సిన సమర్థత కలిగిన బీఎస్సీ విద్యార్థులు 31.76% ఉంటే అది 2018లో 33.62 శాతానికి పెరిగింది. ఇక 2019 నాటికి ఇది 47.37 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. 

ఇంజనీరింగ్‌లో పెరగనున్న అవకాశాలు.. 
వచ్చే సంవత్సరం ఇంజనీరింగ్‌ చదివే విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయని అంచనా వేసింది. 2014లో 51.74 శాతం మందికి ఎంప్లాయబిలిటీ టాలెంట్‌ ఉంటే అది 2015లో 54 శాతానికి పెరిగింది. తరువాత మూడేళ్లలో అది క్రమంగా తగ్గుతూ వచ్చింది. కానీ 2019 నాటికి మాత్రం ఇలా టాలెంట్‌ కలిగిన విద్యార్థులు 57.09 శాతానికి చేరుకుంటారని వీబాక్స్‌ అంచనా వేసింది. బీఎస్సీలోనూ అదే పరిస్థితి. 2014లో బీఎస్సీలో 41.66 శాతం మంది ఉద్యోగ సామర్థ్యాలు కలిగిన విద్యార్థులు ఉంటే అది 2017 వరకు ఏటా తగ్గుతూ వచ్చింది. అయితే 2018లో మాత్రం పెరిగింది. ఇక 2019లో భారీగా పెరుగుదల నమోదు కానుందని వెల్లడించింది. దేశంలో ఐటీ, ఎంబీఏ విద్యార్థుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఆ కోర్సులు చేసిన విద్యార్థుల్లో ఉద్యోగ సామర్థ్యాలు కలిగిన వారి సంఖ్య 2014 నుంచి ఇప్పటివరకు క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2014లో ఉద్యోగ సామర్థ్యాలు కలిగిన ఎంబీఏ విద్యార్థులు 41.02 శాతం ఉంటే 2018లో 39.4 శాతానికి తగ్గింది. ఇక 2019లో ఈ సంఖ్య 36.44 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఒకప్పుడు ఉద్యోగ సామర్థ్యాలు కలిగిన ఐటీఐ విద్యార్థులు 46.92 శాతం ఉంటే 2018 నాటికి అది 29.46 శాతానికి పడిపోయింది. 2019లో ఎలా ఉంటుందన్న అంచనా కూడా వీబాక్స్‌ వేయలేదు. పాలిటెక్నిక్‌లో సామర్థ్యాలు కలిగిన వారు 2018లో 32.67 శాతం ఉంటే వచ్చే సంవత్సరానికి 18.05 శాతానికి తగ్గిపోతుందని అంచనా వేసింది. 

ఎనిమిదవ స్థానంలో తెలంగాణ... 
రాష్ట్రాల వారీగా చూస్తే ఎంప్లాయబిలిటీ స్కిల్స్‌ కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. గతంలో టాప్‌ 10లో కూడా లేని తెలంగాణ ఈసారి తమ విద్యా సంస్థల్లో నాణ్యత ప్రమాణాలకు ప్రాధాన్యం ఇచ్చి గత రెండేళ్లుగా చర్యలు చేపట్టిన కారణంగా ఈసారి 8వ స్థానంలో నిలువగలిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. 2018లో ఎంప్లాయబిలిటీ స్కిల్స్‌ కలిగిన మొదటి పది స్థానాల్లో ఉన్న దిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈసారి కూడా మొదటి పది స్థానాల్లో ఉన్నాయని ఇండియా స్కిల్‌ రిపోర్టు–2019 పేర్కొంది. ఈసారి కొత్తగా తెలంగాణ, రాజస్థాన్, హరియాణా టాప్‌–10 రాష్ట్రాల జాబితాలో చేరాయి. 2018 నివేదికలో టాప్‌–10 రాష్ట్రాల్లో ఉన్న మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్‌ రాష్ట్రాలకు ఈసారి లేకుండాపోయాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top