
ధ్యానేశ్వర్.. శాంతి యాత్రికుడు
కుర్రకారంతా ఫేస్‌బుక్కుల్లో, ట్వీటర్‌లో మునిగి తేలుతున్నారు. కాస్త అవకాశం దొరికితే బైకుపై షికార్లు చేస్తూ, సినిమాలు, క్రికెట్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
కుర్రకారంతా ఫేస్‌బుక్కుల్లో, ట్వీటర్‌లో మునిగి తేలుతున్నారు. కాస్త అవకాశం దొరికితే బైకుపై షికార్లు చేస్తూ, సినిమాలు, క్రికెట్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. వీరంతా ఓ రకమయితే, శ్రద్ధగా చదివి, ర్యాంకులు సాధించి, మంచి ఉద్యోగం సంపాదించి లక్షల్లో సంపాదిస్తూ ఎంజాయ్ చేసేవారు మరోరకం. కానీ ఈ రెండు రకాల యువతకు భిన్నంగా, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా, శాంతి స్థాపనే ధ్యేయంగా సైకిల్‌పై ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు ధ్యానేశ్వర్ యావత్కర్.
సైకిల్ యాత్ర అంటే ఏదో ఒకట్రెండు రోజులో, వారం పదిరోజులో కాదు.. ఏకంగా మూడేళ్లుగా పాదాలను పెడల్‌పై అరగదీస్తున్నాడు. ఎక్కడైనా స్కూల్ కనిపించినా, చిన్నపిల్లల సమూహం కనిపించినా ఆ సైకిల్ అక్కడే ఆగిపోతుంది. వారందరికి గాంధీ మార్గం ఎంత గొప్పదో, అహింస ద్వారా ఏం సాధించవచ్చో చెబుతాడు. గ్రామ పెద్దలను కలుస్తాడు. గాంధీ కోరుకున్న భారతదేశం కోసం చేయాల్సిన పనులేవో వివరిస్తాడు.
70,000 కిలోమీటర్లు ప్రయాణించాలనే లక్ష్యంతో తన సైకిల్ యాత్ర ప్రారంభించిన ఈ కుర్రోడు ఇప్పటిదాకా 8,642 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తిచేశాడు. 2019, అక్టోబర్ 2 నాటికి అంటే మహాత్మాగాంధీ 150వ జయంతి నాటికి పాకిస్తాన్ చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు ఈ మరాఠా యువకుడు. మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన యావత్కర్.. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన సేవాగ్రామ్ నుంచి తన యాత్రను ప్రారంభించాడు.