గుజరాత్‌ హాట్‌స్పాట్‌

COVID-19: Coronavirus hotspots in Gujarat - Sakshi

విజృంభిస్తున్న కరోనా

కేసులు, మృతులు ఎక్కువే

కరోనా వచ్చిన చిట్టచివరి రాష్ట్రాలలో గుజరాత్‌ ఒకటి.  మార్చి 19న తొలి కేసు నమోదైంది.   ఆ తర్వాత వ్యాప్తి నెమ్మదిగా ఉంది.   500 కేసులు నమోదు కావడానికి 25 రోజులు పట్టింది.   అందరూ ఈ రాష్ట్రం సేఫ్‌ జోన్‌ అనుకున్నారు.   కానీ హఠాత్తుగా హాట్‌స్పాట్‌గా మారింది.   గత వారంలో కేసులు రోజురోజుకీ రెట్టింపవుతున్నాయి. కేసులతో పాటు మరణాలు పెరుగుతున్నాయి.   మహారాష్ట్ర తర్వాత గుజరాత్‌కే కరోనాతో ఊపిరాడడం లేదు.

పారామిలటరీ దళాలు మోహరించాయి. ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) చీఫ్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా హుటాహుటిన అహ్మదాబాద్‌ వెళ్లారు. కోవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రిని సందర్శించి పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. రోగులకు చికిత్స వ్యూహాత్మకంగా ఎలా అందించాలో అక్కడ వైద్యులకి వివరించారు. కరోనా కేసులతో పాటు మృతులు గుజరాత్‌లో ఎక్కువైపోవడం దడ పుట్టిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 60 వేల వరకు ఉంటే అందులో 60శాతం కేసులు ఎనిమిది నగరాల్లోనే నమోదయ్యాయి. అందులో 42 శాతానికిపైగా కేసులు ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్‌లో ఉన్నాయి.

ఎందుకిన్ని కేసులు?
1: గుజరాత్‌ వాణిజ్యానికి, పర్యాటకానికి పెట్టింది పేరు. జనవరి–మార్చి కాలంలో అమెరికా, కెనడా, యూరోపియన్‌ దేశాలు, చైనా, జపాన్, సింగపూర్, దుబాయ్‌ వంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చారు. వారికి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ నిర్వహించి 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచారు. కానీ స్క్రీనింగ్‌ లోపాలు, క్వారంటైన్‌ పకడ్బందీగా అమలు చేయడంలో ఆరోగ్య అధికారుల వైఫల్యంతో కేసులు పెరిగాయి.

2: ఢిల్లీలో మర్కజ్‌ నిజాముద్దీన్‌లో మత ప్రార్థనలకి గుజరాత్‌ నుంచి 1500 మంది వెళ్లారు. వీరంతా అహ్మదాబాద్, సూరత్, వడోదరావాసులే. ఇరుకు ప్రాంతాల్లోనే నివసించే జనాభా ఇక్కడ అధికం. ప్రస్తుతం ఈ మూడు నగరాలే రాష్ట్రంలో కోవిడ్‌ హాట్‌స్పాట్‌లుగా మారాయి. అహ్మదాబాద్‌ ఎప్పుడు చూసినా జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఒక చదరపు కిలోమీటర్‌కి 10 వేల మంది నివసిస్తూ ఉంటారు. అందుకే కరోనా నిరోధక చర్యలు పాటించడం కత్తి మీద సాములా మారింది.

3: ఆరోగ్య రంగానికి ఈ రాష్ట్రంలో ఖర్చు చేసేది చాలా తక్కువ. స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో ఆరోగ్యానికి 1 శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. వెనుకబడిన రాష్ట్రాలతో సమానంగా మహిళలు, శిశువుల్లో పౌష్టికాహార లోపాలున్నాయి. దేశంలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమని యూనిసెఫ్‌ వంటి సంస్థలు హెచ్చరికలు చేస్తూనే ఉన్నాయి. పోషకాహారం లోపాలతో రోగనిరోధక శక్తి లేక కరోనా వైరస్‌ సులభంగా దాడి చేస్తోంది. ప్రాణాలు కూడా ఎక్కువగానే తీస్తోంది.

4: అహ్మదాబాద్‌లో ఆర్థిక అసమానతలు, అభివృద్ధిలో తేడాలు ఎక్కువ. తూర్పు అహ్మదాబాద్‌లో జనసాంద్రత ఎక్కువ. తక్కువ ఆదాయం వచ్చే జనాభా అధికంగా నివసిస్తుంది. దరియాపూర్‌వంటి ప్రాంతాల్లో ఇళ్లలో ఒకేగది ఉంటుంది. అందులో 50శాతానికిపైగా ఇళ్లల్లో ఒకే గదిలో ఐదుగురు జీవిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించడం అసాధ్యం. అందుకే గుజరాత్‌ మొత్తమ్మీద నమోదైన కేసుల్లో 70శాతం (5వేలకు పైగా) అహ్మదాబాద్‌లోనే ఉన్నాయి.

5: దేశంలో కరోనా వ్యాపించిన రాష్ట్రాల్లో ఇంచుమించుగా చివరిది గుజరాత్‌. దేశవ్యాప్త లాక్‌డౌన్‌కి ఆరేడు రోజుల ముందు మాత్రమే ఇక్కడ తొలి కేసు నమోదైంది. అయినా కేసులన్నీ ఎగబాకి ఇప్పుడు మహారాష్ట్ర తర్వాత స్థానంలోకి చేరుకుంది. అయితే తొలినాళ్లలో ఇక్కడ కరోనా పరీక్షలు సరిగా నిర్వహించలేదు. గత వారం రోజులుగా పరీక్షలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. రోజుకి 3 వేలకి పైగా పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు లక్షకు పైగా పరీక్షలు చేశారు. అది కూడా కేసులు పెరగడానికి ఒక కారణమన్న వాదనలైతే ఉన్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top