వలస కార్మికులపై చార్జీల భారమా!?

Coronavirus Lockdown: How Migrant Workers Pay for train tickets - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా మొదటి విడత లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి దేశంలో వలస కార్మికుల కష్టాలు మొదలై రెండవ విడత లాక్‌డౌన్‌తో మరింత తీవ్రమయ్యాయి. పలుచోట్ల వలస కార్మికులు ఆందోళన చేయడంతో వారిని ఇళ్లకు పంపించేందుకు కేంద్రం అనుమతించింది. వలస కార్మికుల కోసం అంతర్రాష్ట్రాల మధ్య ప్రత్యేకంగా బస్సులు నడపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన కేంద్రం, ప్రత్యేక రైళ్లను నడపాల్సిందిగా రైల్వే శాఖను కోరింది. (వలస కార్మికులు: సోనియా కీలక నిర్ణయం)

అయితే వలస కార్మికుల కోసం భారతీయ రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ కార్మికుల నుంచి వారి గమ్యస్థానాలకు పూర్తి చార్జీలను డిమాండ్‌ చేయడంతోపాటు అదనంగా 50 రూపాయలను సర్‌చార్జీగా వసూలు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఛార్జీల డబ్బులు కూడా లేని కారణంగా చాలా రాష్ట్రాల్లో వలస కార్మికులు రైళ్లు ఎక్కలేక రైల్వే స్టేషన్లలోనే చిక్కుకు పోయారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అయితే వలస కార్మికుల కోసం ఎయిర్‌ కండీషన్డ్‌ టాక్సీలను ఏర్పాటు చేసింది. అయితే బస్సు చార్జీలకన్నా నాలుగు రెట్లు చార్జీలను వసూలు చేస్తోంది. దీంతో డబ్బులున్న కొంతమంది కార్మికులు మాత్రమే తమ గమ్య స్థానాలకు చేరుకోగలిగారు. మిగతా వారంతా ఎక్కడి వారక్కడ చిక్కుకు పోయారు. (ఉండలేక.. ఊరెళ్లలేక..)

సరిగ్గా ఈ దశలోని కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ స్పందించి వలస కార్మికుల చార్జీలను తమ పార్టీ భరిస్తుందంటూ ముందుకు వచ్చారు. అన్ని రాష్ట్రాల పీసీసీలు తమ తమ ప్రాంతాలకు వచ్చే వలస కార్మికుల చార్జీలకు బాధ్యత వహించాలంటూ ఆమె పిలుపునిచ్చారు. నెలన్నర రోజులుగా ఉపాధిలేని వలస కార్మికులు చార్జీలు ఎలా చెల్లిస్తారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయో అర్థంకాని విషయం. వలస కార్మికులను తమ తమ గమ్యస్థానాలకు చేర్చడం కోసం అంతర్రాష్ట బస్సు సర్వీసులను నడపాల్సిందిగా రాష్ట్రాలను కేంద్రం ఆదేశించడమే కాకుండా ఆ బాధ్యతను వాటిమీదకే నెట్టింది. (లాక్డౌన్: టోలీచౌకీలో కార్మికుల ఆందోళన!)

నిజానికి అంతర్రాష్ట్ర కార్మికుల అంశం భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం జాబితాలోనిది. ఆ విషయాన్ని పక్కన పెడితే చైనా, జపాన్, ఇటలీ, ఇరాన్‌ దేశాల్లో చిక్కుకు పోయిన భారతీయులను ఎలాంటి చార్జీలను వసూలు చేయకుండా ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, పేదవారైనా వలస కార్మికుల విషయంలో అదే విధానం పాటించక పోవడం ఆశ్చర్యమే! దేశంలో వైద్య సిబ్బంది సేవలను ప్రశంసిస్తూ  దేశంలోని పలు ఆస్పత్రులపై గులాబీ రెక్కలను సాయుధ దళాల హెలికాప్టర్లతోని చల్లడం, వైద్య సిబ్బందికి అభినందనల సూచకంగా భారత వైమానిక దళం జెట్‌ విమానాలతో విన్యాసాలు చేయడానికి ‘కోవిడ్‌ నిధి’ని  అనవసరంగా ఖర్చు పెట్టే బదులు పేదలకు ఖర్చు పెట్టవచ్చుగదా! అన్నది మరో ప్రశ్న. పార్లమెంట్‌ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ‘కోవిడ్‌ నిధి’కి భారతీయ రైల్వే కూడా 151 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. విరాళాలు ఇచ్చిందీ సర్‌చార్జీ కింద వసూలు చేయడానికా! అన్నది ఇక్కడ అనుమానం. (వలస కూలీల్లో కరోనా కలకలం)

కరోనా వైరస్‌ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను అమలు చేయడంతోపాటు కరోనా నిర్ధారణ కిట్ల కొనుగోలు నుంచి కరోనా బాధితుల చికిత్స వరకు అన్ని ఖర్చులను భరిస్తున్నాయి. ఈ దశలో వలస కార్మికుల ప్రయాణ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై వేసే బదులు కేంద్రమే భరించి ఉంటే నేడు వలస కార్మికులకు తిప్పలు తప్పేవని ‘స్ట్రాండెడ్‌ ఇమ్మిగ్రెంట్‌ వర్కర్స్‌ నెట్‌వర్క్‌’ వ్యాఖ్యానించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top