యూత్‌.. పారాహుషార్‌ 

Coronavirus Contact To Youth In Tamilnadu - Sakshi

  పురుషుల్లో అధికం

సాక్షి, చెన్నై : కరోనా వైరస్‌ యుక్తవయస్కులకే ఎక్కువగా సోకుతున్నట్లు తేలింది. దీన్ని నివారించేందుకు కొత్త వ్యూహాన్ని అమలుచేయాలని ఆరోగ్య, పోలీస్‌శాఖలు నిర్ణయించాయి. కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తిచెందడం ప్రారంభమైన తరువాత చెన్నైలో 64.91 శాతం పురుషులు, 35.9శాతం స్త్రీలు బాధితులయ్యారు. ముఖ్యంగా 20–30 మధ్య వయస్కులు ఎక్కువగా కరోనా బారినపడ్డారు. వీరిలోనూ వందలో 51 మంది పురుషులు, 29 మంది స్త్రీలు కావడం గమనార్హం. 30–40 మధ్య వయస్కులు కూడా వైరస్‌ బాధితుల జాబితాలో చేరిపోయారు. ఇందులోనూ 65 మంది పురుషులు, 23 మంది స్త్రీలు ఉంటున్నారు. 40–49 మధ్య వయస్కుల కేటగిరిలో 42 మంది పురుషులు, 24 మంది స్త్రీలు ఉంటున్నారు. 50–59 మధ్య వయస్కుల్లో 64 మంది పురుషులు, 24 మంది స్త్రీలు, 60–69 మధ్య వయస్కుల్లో 25 మంది పురుషులు, 10 మంది స్త్రీలు ఉంటున్నారు.

వైరస్‌ బాధితుల్లో యుక్తవయస్కులే ఎక్కువగా ఉండడం ద్వారా వారంతా సరిగా భౌతికదూరం పాటించడం లేదనే విషయం స్పష్టమైంది. అందులోనూ పురుషులే అధికంగా ఉండడం గమనార్హం. దీంతో లాక్‌డౌన్‌ ఆంక్షలను మరింత కఠినంగా అమలుచేసేందుకు ఆరోగ్య, పోలీస్‌ యంత్రాగం సిద్ధమైంది. పాజిటివ్‌ కేసు బయటపడగానే సదరు వ్యక్తికి సంబంధించిన వారందరికీ వైద్యపరీక్షలు చేసే చర్యలను తీవ్రతరం చేశారు. చెన్నైలోని అన్ని మండలాల్లోని ప్రధానరోడ్లను మూసి వేయడం, అనవసరంగా రోడ్లపై సంచరించేవారిని నియంత్రించడం, విధిగా మాస్క్‌లు, భౌతికదూరం పాటింపజేయడం వంటి అంక్షలను కఠినంగా అమలు చేయడం ద్వారా వైరస్‌ సామూహిక వ్యాప్తిగా మారకుండా నిరోధించవచ్చని భావిస్తున్నారు.

బొమ్మలను శుభ్రం చేయాలి
చిన్నారులు ఆడుకునే బొమ్మలు, వినియోగించే వస్తువులను తరచూ శుభ్రం చేయడం ఎంతో అవసరమని జాతీయ బాలబాలికల సంరక్షణ కమిషన్‌ సభ్యుడు డాక్టర్‌ ఆర్‌జీ ఆనంద్‌ చెబుతున్నారు. వైరస్‌ 55 ఏళ్లకు పైబడిన వారికే సోకుతుందని మొదట్లో భావించినా పెద్ద సంఖ్యలో పిల్లలు సైతం బాధితులుగా మారుతున్న వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. పెద్దలకు దగ్గు, జలుబు, తుమ్ములు ఉన్నట్లయితే పిల్లలతో మాట్లాడేటప్పుడు ఇళ్లలో మాస్క్‌ ధరించకతప్పదు. బయటకు పోయివచ్చిన తరువాత 20 సెకండ్లలోగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. పిల్లలు తరచూ చేతులుపెట్టే లైట్‌ స్విచ్‌లు, టేబుళ్లు, కుర్చీలు, లిఫ్ట్‌ బటన్లను తరచూ శానిటైజర్‌తో శుభ్రం చేయాలి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top