ఆ జాబితాలో 60 లక్షల నకిలీ ఓటర్లు..

Congress Submits Proof Of 60 Lakh Fake Voters To Election Commission - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌ ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో దాదాపు 60 లక్షల నకిలీ ఓటర్లు నమోదయ్యారని పేర్కొంది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై తమ వద్ద తగిన ఆధారాలున్నాయని ఎన్నికల కమిషన్‌(ఈసీ)కు ఇచ్చిన మెమొరాండంలో కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అక్రమాలకు పాల్పడిందని...ఇది అధికారుల నిర్లక్ష్యం కాదని, అధికార దుర్వినియోగమని ఆ పార్టీ ఆరోపించింది.

ఓటర్ల జాబితాలో 60 లక్షల నకిలీ ఓటర్లున్నారని, ఉద్దేశపూర్వకంగానే వీరిని ఓటర్ల జాబితాలో చేర్చారని కాంగ్రెస్‌ నేత కమల్‌ నాథ్‌ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో పాలక బీజేపీ ఈ కుట్రకు పాల్పడిందని ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా ఆరోపించారు. పదేళ్లలో రాష్ట్ర జనాభా 24 శాతం పెరిగితే ఓటర్ల సంఖ్య 40 శాతం పెరగడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

ఒక ఓటరు పేరు వేర్వేరు ప్రాంతాల్లోని 26 జాబితాల్లో ఉందని, ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయని ఆరోపించారు. అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాను తాము పరిశీలించామని జాబితా మొత్తం తప్పులతడకగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top