‘ప్రాణాంతక మందుల’ పై ఉదాసీనత

Central Government Neglect Of Dangerous Pesticides - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రైతుల ప్రాణాలను హరిస్తున్న 18 రకాల క్రిమిసంహారక మందులపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెల్సిందే. అయితే అందులో గతేడాది మధ్య భారత్‌లో పదుల సంఖ్యలో పత్తి రైతులను బలితీసుకున్న మోనోక్రోటోపాస్, మాంకోజెబ్‌ క్రిమి సంహారక మందులు లేకపోవడం ఆశ్చర్యకరం. దోమల సంహారానికి మున్సిపల్‌ సిబ్బంది, తెగుళ్ల నివారణకు రైతులు కొట్టే డీడీటీని కూడా నిషేధించక పోవడం గమనార్హం. మానవులు, జంతువుల ప్రాణాలకు హానికరమైన ఈ మూడు మందులను కూడా నిషేధించాలని వ్యవసాయ శాస్త్రవేత్త అనుపమ వర్మ నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. 

కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మొత్తం 18 క్రిమిసంహారక మందుల్లో 11 మందుల రిజిస్ట్రేషన్, ఉత్పత్తి, అమ్మకం, దిగుమతి, ఉపయోగాన్ని తక్షణమే నిషేధించగా, ఆరు క్రిమిసంహారక మందులను 2020, డిసెంబర్‌ నాటికి విడతల వారిగా నిషేధించాలని నిర్ణయించింది. హెర్బిసైడ్‌ ట్రిఫులారిన్‌ను కూడా కేంద్రం తక్షణమే నిషేధించినప్పటికీ ఒక్క గోధుమ పంటకు మాత్రం అనుమతించాలని నిర్ణయించింది. వాస్తవానికి దీన్ని కూడా సంపూర్ణంగా నిషేధించాలని వర్మ కమిటీ సిఫార్సు చేసింది. వాస్తవానికి ఈ క్రిమిసంహారక మందులను కేంద్రం ఎప్పుడో నిషేధించి ఉండాల్సిందీ, తాత్సారం చేస్తూ వచ్చింది. 

దేశంలో రైతులు ప్రాణాంతకమైన క్రిమిసంహారక మందులను ఉపయోగిస్తున్నారంటూ సామాజిక కార్యకర్తలు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ప్రాణాంతకమైన 66 మందుల ప్రభావాన్ని సమీక్షించి తగిన సిఫార్సులను చేయాల్సిందిగా కోరుతూ 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం వర్మ కమిటీని నియమించింది. ఆ కమిటీ 66 మందుల్లో 19 మందులను సంపూర్ణంగా నిషేధించాలని సిఫార్సు చేస్తూ 2015, డిసెంబర్‌ నెలలోనే నివేదికను మోదీ ప్రభుత్వానికి అందజేసింది. దాదాపు 20 నెలల అనంతరం ఆగస్టు 8వ తేదీన చర్యలు తీసుకుంది. 

ప్రపంచంలోని పలు దేశాల్లో నిషేధించిన క్రిమిసంహారక మందుల్లో 104 మందులను మన దేశంలో వాడుతున్నారని ఆరోగ్య కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వాటిల్లో 66 రకాల మందులను మాత్రమే వర్మ కమిటీ సమీక్షించిందని వారు చెప్పారు. అలాగే ప్రపంచంలో పలు దేశాలు నిషేధించిన ‘గ్లైఫోసేట్‌’ను వర్మ కమిటీ సమీక్షించినా దాన్ని నిషేధించాల్సిందిగా ఎలాంటి సిఫార్సు చేశారు. ప్రాణాంతక మందులను నిషేధించే అధికారం ఒక్క కేంద్రానికి మాత్రమే ఉంది. రాష్ట్రానికి వాటిపై 90 రోజులపాటు తాత్కాలికంగా నిషేధం విధించే అధికారం మాత్రం ఉంది. కాకపోతే వాటి ఉత్పత్తి యూనిట్లకు లైసెన్స్‌లు నిరాకరించే అధికారం ఉంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top