పరిశోధనల ‘పాఠశాల’ | Budget for education sector is Rs 9485364 crore | Sakshi
Sakshi News home page

పరిశోధనల ‘పాఠశాల’

Jul 6 2019 4:20 AM | Updated on Jul 11 2019 5:12 PM

Budget for education sector is Rs 9485364 crore - Sakshi

న్యూఢిల్లీ: దేశ విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చదిద్దేందుకు నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ విధానంలో పాఠశాల విద్య, ఉన్నత విద్యలో భారీ మార్పులను ప్రతిపాదించారు. పరిశోధనలు, నవకల్పనలపై మరింత దృష్టిపెడతామన్నారు. పరిశోధనలను ప్రోత్సహించి సమన్వయపరిచేందుకు, వాటికి నిధులు అందించేందుకు జాతీయ పరిశోధన ఫౌండేషన్‌ (ఎన్‌ఆర్‌ఎఫ్‌)ను ఏర్పాటు చేస్తామన్నారు. ‘‘దేశ ప్రాధాన్యతలకు అనుగుణంగా పరిశోధనల రంగాన్ని బలోపేతం చేసేందుకు ఎన్‌ఆర్‌ఎఫ్‌ కృషి చేస్తుంది. వేర్వేరు శాఖల్లో పరిశోధనలకు కేటాయించే నిధులను ఎన్‌ఆర్‌ఎఫ్‌కు మళ్లించడంతోపాటు అదనపు కేటాయింపులు కూడా చేస్తాం’’అని నిర్మలా సీతారామన్‌ శుక్రవారం బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.

దేశంలో విద్యా రంగానికి తాజా బడ్జెట్‌లో రూ. 94,853.64 కోట్లను కేటాయించారు. 2018–19 సవరించిన బడ్జెట్‌ అంచనాలతో పొలిస్తే తాజా కేటాయింపులు 13 శాతం మేర పెరిగాయి. గత బడ్జెట్‌లో విద్యా రంగానికి నాటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ రూ. 85,010 కోట్లు కేటాయించగా ఆ కేటాయింపులను తర్వాత రూ. 83,625.86 కోట్లకు సవరించారు. ఈసారి కేటాయింపులను విభాగాలవారీగా చూస్తే పాఠశాల విద్యకు రూ. 56,536.63 కోట్లు, ఉన్నత విద్యకు రూ. 38,317.01 కోట్లు కేటాయించారు. అలాగే యూజీసీకి రూ. 4,600.66 కోట్లు (2018–19 సవరించిన అంచనాల్లో రూ. 4,687.23 కోట్లు), ఐఐటీలకు రూ. 6,409.95 కోట్ల మేర కేటాయింపులు చేశారు. ఇక ఐఐఎంలకు రూ. 445.53 కోట్లు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌కు రూ. 899.22 కోట్లు కేటాయించారు.

విద్యా రంగానికి సంబంధించి ముఖ్యాంశాలు ఇవీ...
- విద్యారంగంలో ప్రపంచ స్థాయి సంస్థలను ఏర్పాటు చేసేందుకు 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ. 400 కోట్లు కేటాయింపు. ఇది గతేడాది చేసిన సవరించిన అంచనాలకు మూడు రెట్లు అదనం. 
నూతన విద్యా విధానం–2019 ముసాయిదాలో పేర్కొన్న ప్రకారం ఎన్‌ఆర్‌ఎఫ్‌లో సైన్సెస్, టెక్నాలజీ, సోషల్‌ సైన్సెస్, ఆర్ట్స్‌–హ్యుమానిటీస్‌ విభాగాలు ఉండనున్నాయి. వ్యవసాయం, వైద్యం, ఫిజిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, నానో సైన్స్, సోషియాలజీ, ఆర్కియాలజీ, ఆర్ట్‌ హిస్టరీ, లిటరేచర్‌ వంటి పాఠ్యాంశాలకు సంబంధించిన అన్ని రకాల పరిశోధనలకు ఎన్‌ఆర్‌ఎఫ్‌ పూర్తిస్థాయిలో నిధులు అందించనుంది. 
దేశంలో క్రీడా సంస్కృతిని క్షేత్రస్థాయిలో తిరిగి పెంపొందించేందుకు ఉద్దేశించిన ఖేలో ఇండియా పథకాన్ని విస్తరించి అవసరమైన ఆర్థిక సహకారం అందించడం. 
అన్ని స్థాయిల్లో క్రీడలకు ఆదరణ కల్పించేందుకు, క్రీడాకారులను తయారు చేసేందుకు వీలుగా ఖేలో ఇండియా పథకం కింద జాతీయ క్రీడా విద్యా బోర్డు ఏర్పాటు. 
జాతిపిత మహాత్మాగాంధీ సిద్ధాంతాలపట్ల యువతకు అవగాహన కల్పించేలా ‘గాంధీ–పీడియా’ను అభివృద్ధి చేయనున్నారు. 
ప్రపంచంలోని 200 అత్యుత్తమ యూనివర్సిటీల్లో భారత్‌ నుంచి మూడు ఉన్నతవిద్యా సంస్థలు (రెండు ఐఐటీలు, ఒక ఐఐఎస్‌సీ–బెంగళూరు) నిలిచాయని సీతారామన్‌ వివరించారు.

దేశ ఉన్నత విద్యాసంస్థల్లోకి విదేశీ విద్యార్థుల చేరికలను ఆకర్షించేలా ‘స్టడీ ఇన్‌ ఇండియా’కు శ్రీకారం. ‘ప్రపంచ విద్యా కేంద్రంగా ఎదిగేందుకు భారత్‌కు ఎంతో సామర్థ్యం ఉంది’అని సీతారామన్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. 

విద్యాసంస్థల్లో వేర్వేరు దేశాలు, ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉంటే దానివల్ల ఆ సంస్థ విలువ పెరుగుతుంది. ‘స్టడీ ఇన్‌ ఇండియా’ కార్యక్రమం వల్ల విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి చెందుతారు. ఈ విషయంలో కేంద్రం ప్రభుత్వం చొరవ తీసుకుని, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం నిజంగా అభినందించదగ్గ విషయం.
– ప్రొ.మహేశ్‌ పంచజ్ఞుల, డీన్‌ (అంతర్జాతీయ విద్యార్థి  వ్యవహారాలు) ఐఐటీ మద్రాస్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement