‘వార్‌ హీరో’ కుల్దీప్‌సింగ్‌ కన్నుమూత

Brigadier Kuldip Singh Chandpuri dies at 78 - Sakshi

1971 యుద్ధంలో పాక్‌ బలగాలను నిలువరించిన కుల్దీప్‌

మహావీర్‌ చక్ర అవార్డుతో సత్కరించిన సైన్యం

సోమవారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు  

చండీగఢ్‌: 1971 భారత్‌–పాక్‌ యుద్ధం సందర్భంగా కేవలం 120 మందితో పాకిస్తాన్‌ సైనిక పటాలాన్ని నిలువరించిన బ్రిగేడియర్‌ కుల్దీప్‌ సింగ్‌ చంద్‌పురి(78) కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న కుల్దీప్‌ మొహాలీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. కుల్దీప్‌ నేతృత్వంలో భారత సైన్యం రాజస్తాన్‌లోని లాంగేవాలా ఆర్మీ పోస్ట్‌వద్ద ప్రదర్శించిన ధైర్య సాహసాలపై 1997లో ‘బోర్డర్‌’ అనే సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది.

‘బ్యాటిల్‌ ఆఫ్‌ లాంగేవాలా’గా పేరుగాంచిన ఈ ఘటన 1971, డిసెంబర్‌ 4న చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌ స్వతంత్ర పోరాటం నేపథ్యంలో భారత్‌పై మెరుపుదాడి చేయాలని పాక్‌ ఆర్మీ ప్రణాళిక రచించింది. 2,000 మంది జవాన్లతో పాటు భారీగా యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలతో పాక్‌ ఆర్మీ భారత సరిహద్దువైపు కదలడం ప్రారంభించింది. అప్పటి లాంగేవాలా పోస్ట్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న మేజర్‌ కుల్దీప్‌ సింగ్‌ చంద్‌పురి ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు.

అయితే మరో 6 గంటలవరకూ అదనపు బలగాలు అక్కడకు చేరుకోలేవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అక్కడే ఉండి ఆరు గంటలపాటు పాక్‌ సైన్యాన్ని నిలువరించడమా? లేక వ్యూహాత్మ కంగా వెనక్కితగ్గడమా? అన్న విషయాన్ని కుల్దీప్‌కు విడిచిపెట్టారు. దీంతో పాక్‌ బలగాలను నిలువరించేందుకే ఆయన నిర్ణయించుకున్నారు. కేవలం 120 మంది సైనికులు, మెషీన్‌ గన్లు, చిన్నస్థాయి శతఘ్నులతో పాక్‌ సైన్యానికి ఉచ్చుపన్నారు.

అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో భారత భూభాగంలోకి అడుగుపెట్టిన పాక్‌ ఆర్మీపై గుళ్ల వర్షం కురిపించారు. భారత ఆర్మీ మోహరింపుపై సరైన నిఘా సమాచారం లేకపోవడంతో ఈ మెరుపుదాడిలో పాక్‌ సైన్యం కకావికలమైంది. ఈ పోస్ట్‌ను గస్తీకాస్తున్న పంజాబ్‌ రెజిమెంట్‌లోని 23వ బెటాలియన్‌ వ్యూహాత్మకంగా అమర్చిన ల్యాండ్‌మైన్లు పేలడంతో పలు యుద్ధ ట్యాంకర్లు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. కేవలం 120 మంది భారత సైనికులు ఏకంగా 2 వేల మంది పాక్‌ ఆర్మీని, యుద్ధ ట్యాంకులను ఎదుర్కొన్నారు.

మరుసటిరోజు ఉదయం అదనపు బలగాలతో పాటు భారత వాయుసేన రంగంలోకి దిగడంతో పాక్‌ తోకముడిచింది. ‘బ్యాటిల్‌ ఆఫ్‌ లాంగేవాలా’గా పిలిచే ఈ ఘటనలో ఇద్దరు భారత జవాన్లు అమరులయ్యారు. పాక్‌ మాత్రం 200 మంది సైనికులను, 36 యుద్ధ ట్యాంకులు, 500కుపైగా వాహనాలను నష్టపోయింది. ఈ యుద్ధంలో కుల్దీప్‌ చూపిన ధైర్యసాహసాలకుగానూ రెండో అత్యున్నత సైనిక పురస్కారమైన మహావీర్‌ చక్ర ఆయనకు లభించింది. కుల్దీప్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుల్దీప్‌సింగ్‌ అంత్యక్రియలను సోమవారం సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.

పంజాబ్‌లో పుట్టి...
అవిభక్త భారత్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో 1940, నవంబర్‌ 22న కుల్దీప్‌సింగ్‌ చంద్‌పురి జన్మించారు. చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ నుంచి 1963లో ఉత్తీర్ణులయ్యారు. అనంతరం పంజాబ్‌ రెజిమెంట్లోని 23వ బెటాలియన్‌లో చేరారు. ఆయన 1965 భారత్‌–పాక్‌ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి అత్యవసర దళం (యూఎన్‌ఈఎఫ్‌)లో ఏడాదిపాటు పనిచేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇన్‌ఫాంట్రీ స్కూల్‌లో శిక్షకుడిగా రెండుసార్లు పనిచేశారు.

ఆర్మీ నుంచి రిటైర్‌ అయ్యాక 2006–11 మధ్యకాలంలో చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సభ్యుడిగానూ పనిచేశారు. యువత డ్రగ్స్‌ మత్తు నుంచి బయటపడేందుకు ఆటలపై దృష్టి సారించాలనీ, ఇందుకోసం మైదానాలు నిర్మించాలని గట్టిగా వాదించారు. కాగా, కుల్దీప్‌ మృతిపై పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుల్దీప్‌ వీరోచిత పోరాటం ఆర్మీలో చేరే యువ అధికారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top