ఆ వైద్యుడుఆమె పాలిట దేవుడు

Blood donated by the doctor - Sakshi

ప్రాణం పోసే వాడు దేవుడైతే..ఆ ప్రాణాలు నిలిపే వాడు వైద్యుడంటారు. అందుకు వైద్యులను వైద్యో నారాయణో హరి అని పిలుస్తారు. అచ్చంగా ఆ నానుడికి ప్రతిరూపంగా నిలిచారు జయపురం సబ్‌డివిజన్‌ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ జెన.

రక్తహీనతతో నీరసించి పోయి కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఓ ఆదివాసీ మహిళకు తన రక్తాన్ని ఇచ్చి ఆమె ప్రాణాలు కాపాడిన డాక్టర్‌ జెన భగవంతుడికి ప్రతిరూపమంటూ ఆదివాసీ దంపతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జయపురం(ఒరిస్సా) : రక్తహీనతతో చావు బతుకుల మధ్య  కొట్టుమిట్టాడుతున్న ఓ నిరుపేద ఆదివాసీ మహిళా రోగికి తన రక్తాన్ని దానం చేసి ప్రాణాలు కాపాడాడో వైద్యుడు.   సాధారణంగా నేటి డాక్టర్లలో అనేక మంది రోగులనుంచి ఎలా డబ్బు రాబట్టాలా? అని చూసేవారే కానీ  రోగులకు సహాయం అందించే వారు అరుదు. అందుచేతనే అనేక సమయాల్లో   రోగుల బంధువుల  ఆందోళనలతో పలువురు డాక్టర్లకు దేహశుద్ధి జరిగిన   ఉదంతాలు కూడా ఉన్నాయి.

అయితే అందరూ అలాంటి వారుండరని జయపురం సబ్‌డివిజన్‌ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు ఒకరు నిరూపించి ప్రజల మన్ననలను అందుకుంటున్నారు. రక్తం లేక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ రోగికి రక్తాన్ని ఇచ్చి కాపాడిన ఆయనే డాక్టర్‌ భిభూతి భూషణ్‌ జెన. ఆ డాక్టర్‌ రక్తం దానం చేయడంతో ఆమె బతికి బట్టకట్టింది.

కొరాపుట్‌ జిల్లా బొయిపరిగుడ సమితి చంద్రపడ గ్రామ పంచాయతీ దొరాగుడ గ్రామానికి చెందిన మదన గొలారీ భార్య మణి గొలారి రక్తహీనత కారణంగా 15 రోజులుగా బాగా నీరసించి పోయింది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో భర్త  మదన గొలారి గత శుక్రవారం బొయిపరిగుడ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తీసుకు వచ్చాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు అసలు రక్తం లేదని రక్త హీనత వల్ల నీరసించి పోతోందని   వెంటనే రక్తం ఎక్కించక పోతే ప్రాణహాని అని స్పష్టం చేశారు.

వెంటనే రక్తం తీసుకురమ్మని మదన గొలారికి తెలియజేశారు. అయితే తన వద్ద డబ్బు లేదని తాను ఎక్కడి  నుంచి రక్తం తేగలనని భర్త వాపోయాడు. వారి నిస్సహాయతను తెలుసుకున్న బొయిపరిగుడ డాక్టర్లు జయపురం సబ్‌డివిజనల్‌ ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకు వెళ్లమని సూచించారు.  దీంతో మణి గొలారిని ప్రభుత్వ అంబులెన్స్‌లో మంగళవారం రాత్రి   జయపురం సబ్‌డివిజన్‌  ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.

ఆమెను పరీక్షించిన జయపురం డాక్టర్లు రక్తం లేదని అందుచేతనే  బలహీనురాలవుతోందని వెంటనే రక్తం ఎక్కించకపోతే ప్రాణహాని తప్పదని స్పష్టం చేశారు. అయితే నేను పేదవాడిని. మీరే రక్షించండని మదన గొలారి డాక్టర్లను వేడుకున్నాడు. ఆమెను బతికించాలంటే వెంటనే రక్తం అవసరమని తెలిసిన డాక్టర్‌ బి.డి.జెన స్వయంగా ముందుకు వచ్చి ఆమెకు తన రక్తాన్ని ఇచ్చారు.

అవసరమైన రక్తం ఎక్కించడంతో మణి గొలారి శక్తిని పొంది బతికి బట్టకట్టింది.  ఈ నేపథ్యంలో బుధవారం ఆమె తనను కలిసిన పాత్రికేయులతో మాట్లాడుతూ డాక్టర్‌ జెన బాబు దేవుడిలా  రక్తం ఇచ్చి తనను కాపాడారని తెలిపింది. ఆమెకు ఏడాదిన్నర బిడ్డ ఉంది.  డాక్టర్‌ ఉదారతను ఆదివాసీ దంపతులతో పాటు గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top