పల్లె.. డిజిటల్‌!

Artificial intelligence into the public domain - Sakshi

ప్రభుత్వ రంగంలోకి కృత్రిమ మేథ

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ భారతాన్ని డిజిటల్‌ పుంతలు తొక్కించేందుకు ఎన్డీయే సర్కారు తన తుదిబడ్జెట్‌లో గట్టి ప్రయత్నమే మొదలు పెట్టింది. భారత్‌ నెట్‌ పథకం కింద అనుసంధా నించే 2.5లక్షల గ్రామ పంచాయతీల్లో కనీసం లక్ష గ్రామాలను డిజిటల్‌ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ఆర్థికశాఖ తాత్కాలిక మంత్రి పీయూష్‌ గోయల్‌ శుక్రవారం నాటి బడ్జెట్‌ ప్రసంగంలో తెలపడమే ఇందుకు తార్కాణం. అంతేకాదు..వేర్వేరు ప్రభుత్వ శాఖల్లోని సమాచారాన్ని విశ్లేషించి వనరులను మరింత సమర్థంగా వినియోగించు కునే లక్ష్యంతో ప్రభుత్వ శాఖల్లోనూ కృత్రిమ మేథను వాడేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. కృత్రిమ మేథ టెక్నాలజీలు మరింత కచ్చితంగా వాతావరణ అంచనాలు కట్టేందుకు మాత్రమే కాకుండా.. అనేక ఇతర రంగాల్లోనూ ఉపయోగపడతాయని వాహనాల్లో విద్యుత్‌ వ్యవస్థల సమర్థ నిర్వహణ, ఫొటోలు, వీడియోల విశ్లేషణ వంటివి వీటిల్లో ఉన్నాయని గోయల్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.

కామన్‌ సర్వీసెస్‌ సెంటర్లు కేంద్రంగా డిజిటల్‌ గ్రామాలు..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్‌ గ్రామాల వ్యవస్థ మొత్తం కామన్‌ సర్వీసెస్‌ సెంటర్లు కేంద్రంగా నడుస్తాయి. వచ్చే ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా లక్ష వరకూ గ్రామాల్లో ఈ కామన్‌ సర్వీసెస్‌ సెంటర్ల ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల చెంతకు చేర్చాలన్నది లక్ష్యం. గ్రామాల్లో డిజిటల్‌ టెక్నాల జీకి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించుకోవాల్సిన బాధ్యత కూడా ఈ కామన్‌ సర్వీసెస్‌ సెం టర్లపైనే ఉంచనున్నారు. దేశంలో ఇప్ప టికే దాదాపు మూడు లక్షల కామన్‌ సర్వీ సెస్‌ సెంటర్లు పని చేస్తున్నా యనీ, వీటి ద్వారా మరిన్ని ఎక్కువ సేవలు అందిం చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు.

గత ఐదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం అనేక ప్రభుత్వ సర్వీసులను, విధానాలను డిజిటల్‌ రూపంలోకి మార్చేసిందని.. వీటన్నింటి ఆధారంగా 2030 నాటి డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తామని వివరించారు. దేశ యువత సృష్టించే అనేక స్టార్టప్‌ కంపెనీలు సృష్టించే డిజిటల్‌ ఇండియా కారణంగా లక్షలాది కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో మొబైల్‌ డేటా 50 రెట్లు ఎక్కువైందని, ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల ఫలితమిదని మంత్రి వ్యాఖ్యానించారు. డిజిటల్‌ గ్రామాల వంటి వాటి వల్ల మధ్యవర్తుల ప్రమేయం అస్సలు లేకుండా ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతాయని చెప్పారు.

కృత్రిమ మేథతో అనేక లాభాలు..
ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కృత్రిమ మేథ వినియోగం సర్వత్రా పెరగనుందని.. ఇందుకు తగ్గట్టుగా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేథ సర్వీసుల కోసం ఓ జాతీయ పోర్టల్‌ను ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్లు, సేవలు, కేంద్రాలకు ఈ పోర్టల్‌ ద్వారా సేవలు అందిస్తామని.. ఆసక్తికర ప్రైవేట్‌ వ్యాపార సంస్థలు కూడా ఈ పోర్టల్‌ సేవలు వినియోగిం చుకోవచ్చునని మంత్రి వివరించారు. త్వరలో సిద్ధం కానున్న నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో ఈ కృత్రిమ మేథ సర్వీసులు చాలా కీలకం కానున్నాయని మంత్రి చెప్పారు. దేశం ఇప్పటికే స్టార్టప్‌ రంగంలో గణనీయమైన పురోగతి సాధించిందని.. దీంతోపాటు కృత్రిమ మేథ తాలూకూ లాభాలను ప్రజల చెంతకు చేర్చేందుకు జాతీయ స్థాయిలో ఓ విస్తృత స్థాయి కార్యక్రమం చేపట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ కేంద్రంగా.. ఇతర అత్యున్నత నైపుణ్య కేంద్రాలు కూడా ఏర్పాటు కావడం ద్వారా ఈ కార్యక్రమానికి ఊపు లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కృత్రిమ మేథ సర్వీసులను ఉపయోగించు కునేందుకు ఇప్పటికే తొమ్మిది రంగాలను గుర్తించామని మంత్రి అన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top