కేంద్రం, సుప్రీంల మధ్య మరో రచ్చ

Another fate between the Center and the Supreme court - Sakshi

జడ్జీల పనితీరు మదింపు రద్దును ఒప్పుకోబోమన్న కేంద్రం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు మధ్య మరోసారి వివాదం నెలకొనే పరిస్థితులు తాజాగా ఏర్పడ్డాయి. హైకోర్టుల్లో పనిచేసే అదనపు న్యాయమూర్తులను పదోన్నతి కింద శాశ్వత జడ్జీలుగా నియమించే ముందు చేపట్టే ‘పనితీరు మదింపు’ రద్దుకు తాము వ్యతిరేకమని కేంద్రం సుప్రీం కొలీజియంకు తెలిపింది. పనితీరు మదింపును రద్దు చేయాలన్న కొలీజియం నిర్ణయంపై తాము సుముఖంగా లేమని, ఈ ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కోరింది. ఈ మేరకు కేంద్రం తన అభిప్రాయాన్ని సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సుప్రీం న్యాయమూర్తుల కొలీజియంకు తెలియజేసినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘తీర్పుల మదింపు కమిటీలు’ అదనపు జడ్జీల పనితీరును అంచనా వేస్తున్నాయి. మార్చిలో సీజేఐ జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ ఈ మదింపు వ్యవస్థను సుప్రీం కొలీజియం రద్దు చేయాలని నిర్ణయించినట్లు అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు తెలిపారు. అదనపు జడ్జీల పనితీరును మదింపు చేయడం 1981లో సుప్రీం ఇచ్చిన తీర్పుకు విరుద్ధమని గుర్తుచేశారు. ఈ వివరాలను న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు కూడా ఆయన అందజేశారు. మాజీ సీజేఐ జస్టిస్‌ ఎస్‌హెచ్‌ కపాడియా 2010 నవంబర్‌లో జారీచేసిన మార్గదర్శకాల మేరకు అదనపు జడ్జీల పనితీరును మదింపు చేపట్టడం ప్రారంభించారు.

రాష్ట్రాల్లో మహిళా కమిషన్లు ఉన్నాయా?
అన్ని రాష్ట్రాల్లోనూ మహిళా కమిషన్లు ఉన్నాయా అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ఉత్తర ప్రదేశ్‌లోని బృందావనంలో ఉంటున్న అనేక మంది వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ కేసును న్యాయస్థానం విచారించింది. ఏ రాష్ట్రంలోనైనా మహిళా కమిషన్లు లేకపోతే వెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా ఆయా ప్రభుత్వాలను ఆదేశించాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. మరో కేసును విచారిస్తూ హరియాణా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ల్లోని పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని వారికి ఆశ్రయం కల్పించడానికి ఉద్దేశించిన నిధులు నిరుపయోగంగా మారడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top