అధికార పార్టీ అసంతృప్త నేతలపై.. కాంగ్రెస్‌ దృష్టి! 

congress focus on trs unsatisfied leaders - Sakshi

నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌పై పెరిగిన ఒత్తిడి

అన్నిచోట్లా బహుళ నాయకత్వమే..

పునర్విభజన లేకపోవడంతో అధికార పార్టీలో అలజడి

ఇప్పటికే కొందరు నేతలతో మంతనాలు జరిగాయని ప్రచారం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రసకందాయంలో రాజకీయం

అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి కొత్త తలనొప్పులు మొదలుకానున్నాయా..ఏదైనా దక్కుతుందన్న ‘ఆశ’తో గులాబీ కండువా కప్పుకునే ఇతర పార్టీల నేతలు పక్క చూపులు చూస్తున్నారా..దీనిని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నిశితంగా గమనిస్తూ మంతనాలు జరుపుతోందా..అన్న అనుమానాలకు ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది.  ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు నాయకులు ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పడుతుండడంతో ఆయా అసంతృప్తులను తమవైపు తిప్పుకునేందుకు హస్తం పార్టీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

సాక్షిప్రతినిధి, నల్లగొండ : వలసలతో కిక్కిరిసిపోయిన టీఆర్‌ఎస్‌లో కొత్త ఆందోళన మొదలైంది. ఏపీ పునర్విభజన చట్టం మేరకు జరగాల్సిన నియోజకవర్గాల పునర్విభజన అంశం కూడా ఈసారికి అటకెక్కినట్లే కనిపిస్తున్నందున అసెంబ్లీ స్థానాల పెంపునకు బ్రేక్‌ పడినట్లే. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కుతుందని ఆశపడిన పలువురు టీఆర్‌ఎస్‌ నేతలకు నిరాశే మిగిలేలా ఉంది. ఈ పరిణామాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ కాచుకుని  కూర్చుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

వివిధ కారణాలతో టీఆర్‌ఎస్‌లో అసంతృప్తితో రగిలిపోతున్న పలువురు నేతలకు గాలం వేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు షురూ చేసిందని చెబుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాపై తమ ఆధిపత్యాన్ని  నిలబెట్టుకునేందుకు నెమ్మదిగా పావులు కదుపుతోం దని,దీనిలో భాగంగా ఇప్పటికే కొందరు నేతలతో మం తనాలు కూడా జరిపిందని విశ్వసనీయ సమాచారం. 
నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ బహుళ నాయకత్వం !

ఉమ్మడి జిల్లా పరిధిలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగైదు చోట్ల మినహా మిగిలిన అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్‌ తరఫున ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయాలని, టికెట్‌ దక్కించుకోవాలని ఉవ్విళూరుతున్న నేతల సంఖ్య తక్కువేం కాదు. ఆలేరు, భువనగిరి, సూర్యాపేట, నకిరేకల్‌ నియోజకవర్గాలను మిన హాయిస్తే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలు సహా ఇతర చోట్ల కూడా ఒకరికి ఇద్దరు నేతలు టికెట్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్న వారే. కానీ, వివిధ సర్వేల ద్వారా ఇప్పటికే అటు ఎమ్మెల్యే పనితీరు, నియోజకవర్గాల్లో వారి పరిస్థితితోపాటు పార్టీ పరిస్థితిపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన పార్టీ అధినేత కేసీఆర్‌ ఎవరిపట్ల మొగ్గుచూపుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. 

నల్లగొండ అసెంబ్లీ స్థానానికి ఇన్‌చార్జ్‌గా కంచర్ల భూపాల్‌రెడ్డిని ప్రకటించడంతో మొన్నమొన్నటి దాకా ఇన్‌చార్జ్‌గా పనిచేసిన దుబ్బాక నర్సింహారెడ్డి ప్రస్తుతం పార్టీ కార్యాకలపాలకు కాస్తా దూరంగానే ఉన్నారు. మరో వైపు దేవరకొండలో సీపీఐ నుంచి పార్టీలో చేరిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, కాంగ్రెస్‌నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన జెడ్పీ చైర్మన్‌ బాలూనాయక్‌ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. నాగార్జునసాగర్‌లో అసెంబ్లీ ఇన్‌ఛార్జి నో ముల నర్సింహయ్య, మరో నేత ఎంసీ కోటిరెడ్డి వర్గాలు కలిసి పనిచేయడం లేదు. మిర్యాలగూడలో కాంగ్రెస్‌ నుంచి పార్టీలో చేరిన ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఇన్‌చా ర్జ్‌గా వ్యవహరిస్తున్న అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి వేర్వే రు గ్రూపులుగానే ఉన్నారు. 

కోదాడలో ఇన్‌చార్జ్‌ శశిధర్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు రెం డు గ్రూపులుగా ఉన్నారు. హుజూర్‌నగర్‌లో ఇన్‌చార్జి శంకరమ్మకు స్థానిక నాయకత్వం నుంచి సహకారమే లేదు. మునుగోడులో ఎమ్మెల్యే ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ల మధ్య ఆధిపత్య పోరు ఉంది.  ఇలా మొత్తంగా మెజారిటీ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉండడాన్ని కాంగ్రెస్‌ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తోందని సమాచారం.

కొందరు నేతలతో మంతనాలు ?
కాంగ్రెస్‌ ముఖ్య నేతలు కొందరు టీఆర్‌ఎస్‌లో అసంతృప్తితో ఉన్న ఇద్దరు ముగ్గురు నాయకులతో ఇప్పటికే మంతనాలు జరిపారని విశ్వసనీయంగా తెలిసింది. వీరు గతంలో కాంగ్రెస్‌కు చెందిన నేతలే కావడంతో తిరిగి మాతృ పార్టీలో చేరి అదృష్టాన్ని పరీక్షించుకోవా లన్న యోచనలో ఉన్నారని తెలుస్తోంది.  

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top