
‘సాహో’ హీరోయిన్ ఎవరంటే?
భారతీయ సినీ ప్రేక్షకులు ఇప్పట్లో బాహుబలి చిత్రాన్ని, అందులోని ప్రధాన పాత్రలైన అమరేంద్ర బాహుబలి, దేవసేనలను మరచిపోలేరు.
చెన్నై: భారతీయ సినీ ప్రేక్షకులు ఇప్పట్లో బాహుబలి చిత్రాన్ని, అందులోని ప్రధాన పాత్రలైన అమరేంద్ర బాహుబలి, దేవసేనలను మరచిపోలేరు. ఆ పాత్రధారులు ప్రభాస్, అనుష్కలు మరోసారి జత కట్టనున్నారా..? ఈ ప్రశ్నకు సినీ వర్గాల నుంచి అవుననే సమధానం వస్తోంది. ప్రభాస్, అనూష్కలది హిట్ జంట అనే చెప్పొచ్చు. ఇంతకు ముందు బిల్లా, మిర్చి వంటి విజయవంతమైన చిత్రాలలో నటించారు. ఇక బాహుబలి సిరీస్‌లో ఈ జంట గురించి చెప్పనక్కర్లేదు.
కాగా, బాహుబలి -2 తరువాత ప్రభాస్ తాజా చిత్రం సాహోకు సిద్ధం అయ్యారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జంటగా ముందు నటి తమన్న, లేదా రష్మిక మండన్నాలలో ఒకరిని భావించారు. బాహుబలి -2 చిత్రం చారిత్రక విజయం సాధించడంతో చిత్ర యూనిట్ బాలీవుడ్ బ్యూటీలను తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారట.
దీంతో బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్‌ను సంప్రదించగా ఆ అమ్మడు నటించడానికి తాను ఓకే అంది. కానీ పారితోషికం ఎనిమిది కోట్లు ఇవ్వమని అనడంతో మరో బాలీవుడ్ బ్యూటీ దిశ పటానీని సంప్రదించారు. ఈ జాణ కథ కూడా వినకుండా తనకు ఐదు కోట్లు పారితోషికం కావాలంటూ తన మేనేజర్ ద్వారా చెప్పి పంపించిందట. దీంతో సాహో చిత్రంలో నటించే అవకాశం అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ స్వీటీ అనూష్కకే వచ్చినట్లు తాజా సమాచారం. కాగా, నటి పూజాహెగ్డే, కీర్తీసనాన్‌ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సాహోలో కథానాయకి ఎవరన్నది క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.