మిథాలిరాజ్‌గా తాప్సీ

Taapsee in Mithali Raj Biopic - Sakshi

తమిళసినిమా: మహిళా క్రికెట్‌ క్రీడాకారిణిగా బహుళ ప్రాచుర్యం పొందిన మిథాలిరాజ్‌ గురించి క్రికెట్‌ క్రీడలో పరిచయం ఉన్న వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ కుటుంబానికి చెందిన ఈ క్రీడాకారిణి రాజస్థాన్‌లో పుట్టి హైదరాబాద్‌లో పెరిగింది. భారతదేశం తరఫున మహిళా క్రికెట్‌ క్రీడకు ప్రాతినిథ్యం వహించిన మిథాలిరాజ్‌ ఒన్‌డే క్రికెట్‌ క్రీడా పోటీల్లో అత్యధికంగా 114 పరుగులు సాధించింది. ఇక టెస్ట్‌ మ్యాచ్‌లో అత్యధికంగా 214 పరుగులు సాధించి రికార్డుకెక్కారు. కాగా బయోపిక్‌లు తెరకెక్కుతున్న ట్రెండ్‌ జోరుగా, లాభదాయకంగా సాగుతున్న సమయం ఇది. భారత క్రికెట్‌ క్రీడ కెప్టెన్‌ ఎంఎస్‌.ధోని బయోపిక్‌ తెరపైకి వచ్చి వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఆ తరువాత కుస్తీ పోటీల నేపథ్యంలో అమీర్‌ఖాన్‌ నటించిన దంగల్‌ సంచలన విజయాన్ని నమోదుచేసుకుంది. అంతకు ముందు సల్మాన్‌ఖాన్, నటి ప్రియాంకచోప్రా ఇలా క్రీడల ఇతివృత్తంగా తెరకెక్కిన పలు చిత్రాలు విశేష ప్రేక్షకాదరణను పొందాయి.

ప్రస్తుతం మిథాలిరాజ్‌ బయోపిక్‌ను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. మిథాలిరాజ్‌ చిన్న వయసు నుంచే క్రికెట్‌ క్రీడపై ఆసక్తిని పెంచుకుంది. ఆ రంగంలోనే తగిన శిక్షణ పొంది అంతర్జాతీయ క్రికెట్‌ క్రీడాపోటీల్లో రాణించింది. అయితే ఈమె భరతనాట్యం కూడా నేర్చుకుంది. మిథాలిరాజ్‌ తన బయోపిక్‌ను వెండితెరకెక్కించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే తన పాత్రలో నటి ప్రియాంకచోప్రా నటిస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డట్టు సమాచారం. నటి ప్రియాంక లైఫ్‌స్టైల్, తన లైఫ్‌స్టైల్‌ ఒకేలా ఉంటాయన్నది మిథాలిరాజ్‌ భావన. అయితే ఆమె బయోపిక్‌లో నటి తాప్సీ నటించనుంది. ఈ మధ్య బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న నటి తాప్సీ. నామ్‌ షబానా లాంటి హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల్లో రాణించిన విషయం తెలిసిందే. అయితే మిథాలిరాజ్‌ బయోపిక్‌లో నటించడం గురించి తాప్సీ స్పందిస్తూ క్రీడాకారిణి పాత్రలో నటించాలన్నది తన డ్రీమ్‌గా పేర్కొంది. ఇకపోతే మహిళా క్రికెట్‌ క్రీడాకారిణి మిథాలిరాజ్‌ జీవిత చరిత్రను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్న మాట వాస్తవమేనంది. అయితే ఆ చిత్రం గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను అని తాప్సీ అంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top