
కాశీలో... టైగర్
యువతరం కథానాయకుల్లో సందీప్ కిషన్‌ది ప్రత్యేకమైన శైలి. మాస్ మసాలా చిత్రాలకన్నా వైవిధ్యభరితమైన కథాంశం ఉన్న సినిమాలకే సందీప్ ప్రథమ ప్రాధాన్యమిస్తారు.
యువతరం కథానాయకుల్లో సందీప్ కిషన్‌ది ప్రత్యేకమైన శైలి. మాస్ మసాలా చిత్రాలకన్నా వైవిధ్యభరితమైన కథాంశం ఉన్న సినిమాలకే సందీప్ ప్రథమ ప్రాధాన్యమిస్తారు. అందుకే కొత్త దర్శకులు సందీప్ కోసం కథలల్లడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాతలు సైతం సందీప్‌తో సినిమా చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. తాజాగా ఇద్దరు అగ్ర నిర్మాతలు ఎన్.వి. ప్రసాద్, ‘ఠాగూర్’ మధు సంయుక్తంగా, సందీప్ కిషన్ హీరోగా ‘టైగర్’ పేరుతో ఓ చిత్రం నిర్మిస్తున్నారు.
ఈ సినిమా మంగళవారం కాశీలో మొదలైంది. దర్శకుడు ఏ.ఆర్ మురుగదాస్ శిష్యుడు వి.ఐ. ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. ఎన్.వి.ఆర్. సినిమా పతాకంపై ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్.వి. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్.వి. ప్రసాద్ మాట్లాడుతూ -‘‘ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు, సంగీత దర్శకుడు తమన్, మాటల రచయిత అబ్బూరి రవి లాంటి హేమాహేమీలంతా ఈ సినిమాకు పని చేస్తున్నారు. గంగానది నేపథ్యంలో సాగే విభిన్న కథాంశమిది. కాశీ, అలహాబాద్, రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్ లాంటి లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుతాం.
కాశీలో పది రోజులు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్. సందీప్ కిషన్‌ను హీరోగా మరో స్థాయికి తీసుకు వెళ్లే సినిమా అవుతుంది’’ అని తెలిపారు. సీరత్ కపూర్ కథానాయిక. రాహుల్ రవీంద్ర, సప్తగిరి, సుప్రీత్, తనికెళ్ల భరణి, పృథ్వీరాజ్, ప్రవీణ్, కాశీ విశ్వనాథ్ ఇందులో ముఖ్యతారలు.