నాదో బ్రేకప్ స్టోరీ..

RX 100 Movie Hero Karthikeya Special Chit Chat With Sakshi

‘నాకు డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లో ఫుల్‌ ఫాలోయింగ్‌ ఉండేది. చిన్న లవ్‌ స్టోరీ కూడా ఉంది. కానీ బ్రేకప్‌ భయ్యా..’ అంటూ చెప్పారు ఆర్‌ఎక్స్‌ 100 మూవీతో యూత్‌ను ఆకట్టుకున్న కార్తికేయరెడ్డి గుమ్మకొండ. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అనేక కష్టాలు ఎదుర్కొన్న కార్తికేయ.. తన సినీ, పర్సనల్‌ లైఫ్‌ గురించి ‘సాక్షి’తో పంచుకున్నవిశేషాలు ఆయన మాటల్లోనే....

శ్రీనగర్‌కాలనీ: హైదరాబాద్‌లోని వనస్థలిపురం నా అడ్డా. అమ్మానాన్నలు విద్యావంతులు. మాకు వనస్థలిపురంలో నాగార్జున గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌ ఉన్నాయి. నేను ఐఏఎస్‌ లేదా ఐపీఎస్‌ కావాలని ఇంట్లో వాళ్ల కోరిక. కానీ నాకేమో డ్యాన్స్‌ అంటే పిచ్చి. స్కూలింగ్‌ సమయంలో పొట్టిగా 93 కిలోలు ఉండేవాణ్ని. అయినా కల్చరల్‌ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొనేవాణ్ని. ఇంటర్‌ హైదరాబాద్‌లో, బీటెక్‌ వరంగల్‌ ఎన్‌ఐటీలో పూర్తి చేశాను. 

ఐటమ్‌ అనేవారు...  
ఇంటర్‌ తర్వాత బాగా హైట్‌ పెరిగాను. బాడీ బిల్డింగ్‌పై దృష్టిసారించాను. మంచి ఫిజిక్‌ సాధించాను. ఇక అమ్మాయిల్లో ఎక్కువగా ఫాలోయింగ్‌ ఉండేది. కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటూ అమ్మాయిలతో ఉండే సరికి కాలేజీలో ఐటమ్‌ అని పిలిచేవారు. నేను కల్చరల్‌ సెక్రటరీగా డ్యాన్స్‌ ప్రోగ్రామ్స్‌ చేసేవాడిని. కళాశాలలో గొడవలు జరుగుతుండేవి. అందరూ నన్ను ఐటమ్‌ అంటుంటే... రెచ్చిపోయి డ్యాన్స్‌ చేసేవాడిని. అమ్మాయిల నుంచి ఫుల్‌ సపోర్ట్‌ ఉండేది.  

అమ్మ వద్దంది...  
బీటెక్‌ అయిపోయాక యాక్టర్‌ అవుతానంటే అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. కానీ ఒప్పించి సినీ రంగంలోకి దిగాను. నాకు ఎవరూ తెలియదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. బేసిక్‌గా నాకు నటన, డ్యాన్స్‌ తప్ప ఇంకేమీ తెలియదు. సన్నిహితుల సలహా మేరకు సుబ్బారావు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాను. తర్వాత ఆడిషన్స్‌కు వెళ్లాను. ‘బాడీతో పాటు మంచి హైట్‌ ఉన్నావు. కానీ బడ్జెట్‌ లేదు. నీ సహకారం కావాలి’ అని అడిగేవారు. నాకు తెలియక ఇద్దరి దగ్గర ఇరుక్కుపోయి డబ్బులు పోగొట్టుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా అనుభవం వచ్చింది. కొన్ని రోజులకు ఓ సినిమా ప్రారంభమై పూర్తయింది. కానీ రిలీజ్‌ కాలేదు. చాలా బాధపడ్డాను. నాకే ఎందుకిలా జరుగుతోందని అనుకున్నాను. ఆ తర్వాత ‘ప్రేమలో మీ కార్తీక్‌’ అనే సినిమా చేశాను. అయితే అది రిలీజ్‌ అయిందని ఎవరికీ తెలియదు. అలా సినిమా కష్టాలు ఎదుర్కొన్నాక ఇంట్లో ప్రెజర్‌ పెట్టారు. కానీ ఒక్క అవకాశం ఇవ్వండని చెప్పాను. 

డైరెక్టర్‌ అజయ్‌ పిలుపు...
డైరెక్టర్‌ అజయ్‌ భూపతి ఓ లవ్‌ స్టోరీ స్క్రిప్ట్‌తో చాలామందిని కలిశారు. కానీ కుదరలేదు. నా సన్నిహితుడు రమేష్‌ ద్వారా ఆయనకు పరిచయమయ్యారు. నా గురించి తెలుసుకొని స్టోరీ చెప్పారు. తొలి భాగం విన్నాక ఈ సినిమా నాకు లైఫ్‌ ఇస్తుందని అనుకున్నాను. కానీ చాలా డౌట్స్‌ ఉండేవి. అయితే రెండో భాగం చెప్పాక తెలియని ఉద్వేగం ఏర్పడింది. కొత్తదనంతో ఎంతో డెడికేషన్‌ ఉన్న దర్శకుడు అజయ్‌భూపతిపై రెట్టింపు నమ్మకం ఏర్పడింది. ప్రొడ్యూసర్స్‌ కోసం వెతికాం.

నాలాంటి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేని వారికి ఎవరు నిర్మాతగా ముందుకొస్తారు. చివరికి అజయ్‌భూపతి, మా బాబా య్‌ అశోక్‌రెడ్డితో సినిమాను పట్టాలెక్కించాం. మొదట సినిమాకు ‘యమహా ఆర్‌ఎక్స్‌ 100’ అనుకున్నాం. తర్వాత ఆర్‌ఎక్స్‌ 100గా పెట్టాం. పోస్టర్స్‌తోనే సినిమా మీద హైప్‌ వచ్చింది. ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. ఇక రిలీజ్‌ అయ్యాక క్లాస్‌ కన్నా మాస్‌ ఆడియన్స్, యువత ఎక్కువగా కనెక్ట్‌ అయ్యారు. మేము అనుకున్న దానికన్నా మూడు రెట్లు రెట్టింపు విజయం లభించింది. దేవి థియేటర్‌లో ఆల్‌టైమ్‌ రికార్డ్‌ వచ్చిందంటే నాకే నమ్మబుద్ధి కాలేదు. అర్జున్‌రెడ్డిలా నువ్వు మరో విజయ్‌ దేవరకొండ అంటుంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది. హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ సినిమాకు కీలకం. చాలా అద్భుతంగా నటించింది.  చైతన్‌ భరద్వాజ్‌ మ్యూజిక్‌ యువత హృదయాలను రంజిపచేసింది. 

ఆ గుర్తింపు కావాలి...  
డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ అంటే చాలా ఇష్టం. ‘సాక్షి’, పూరి జగన్నాథ్‌ నిర్వహించిన షార్ట్‌ ఫిలిమ్‌ కాంటెస్ట్‌లో మా లఘు చిత్రానికి అవార్డు వచ్చింది. పెద్ద స్టార్‌ అవ్వాలని లేదు. ప్రేక్షకులకు బోర్‌ కొట్టకుండా విభిన్న పాత్రలు చేయాలని ఉంది. విభిన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే నా ధ్యేయం.

యాటీట్యూడ్‌ నచ్చి...
నాకో లవ్‌ స్టోరీ కూడా ఉంది. బీటెక్‌లో ఓ అమ్మాయికి చాలామంది ట్రై చేశారు. ఆమెను ఇంప్రెస్‌ చేయడానికి నేనూ ప్రయత్నించాను. పట్టించుకునేది కాదు. కానీ నా యాటీట్యూడ్‌ నచ్చి... చివరకు లవ్‌ యాక్సెప్ట్‌ చేసింది. అయితే కాలేజీ ముగిసిన తర్వాత కొద్దిగా గ్యాప్‌ ఏర్పడింది. కామన్‌ రీజన్స్‌తోనే మా లవ్‌ బ్రేకప్‌ అయింది. నిజం చెప్పాలంటే నా సినిమా పిచ్చితోనే గ్యాప్‌ ఏర్పడి దూరమయ్యాను. తర్వాత లవ్‌ ఫెయిల్యూర్‌ బాధను అనుభవించాను. సినిమా చేయాలనే కసితో సిక్స్‌ ప్యాక్‌ చేశాను. కాలేజీ డేస్‌లో ఓ సీనియర్‌తో కలిసి 7 షార్ట్‌ ఫిలిమ్స్‌ తీశాను. ఇంకో విషయం ఏమిటంటే కాలేజీల్లో పరీక్షలుంటే అందరూ చదివేవాళ్లు. కానీ నేను జిమ్‌కు వెళ్లి మరింతగా బిల్డ్‌ చేసేవాడిని. డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసేవాణ్ని. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top