ఆ క్షణంలో ఏడవాలనిపించింది!

ఆ క్షణంలో ఏడవాలనిపించింది!


‘‘నా జీవితంలో ఇదొక ప్రత్యేకమైన అనుభూతి. ఓ పాతికేళ్ల తర్వాత తల్చుకున్నా ఆనందపడిపోయేంత మధురానుభూతి’’ అంటున్నారు సన్నీ లియోన్‌. ఇంత ఉద్వేగంగా చెబుతున్నారంటే కచ్చితంగా అది ఆమెకు చాలా చాలా స్పెషల్‌ అని అర్థమవుతోంది కదూ. మరేం లేదు.. బాలీవుడ్‌ బాద్షా షారూక్‌ ఖాన్‌ సరసన ‘రాయీస్‌’ చిత్రంలో ప్రత్యేక పాటకు నర్తించే అవకాశం దక్కించుకున్నారు సన్నీ లియోన్‌. ఇటీవల ఈ పాట చిత్రీకరణ జరిగింది. ఈ సినిమాకి అడిగినప్పటి నుంచి పాట చిత్రీకరణ పూర్తయ్యే వరకూ తనకు కలిగిన అనుభూతిని సన్నీ ఈ విధంగా పంచుకున్నారు.



► ‘రాయీస్‌’ దర్శకుడు రాహూల్‌ డోలాకియా ఈ చిత్రంలోని ‘లైలా మై లైలా’ పాటకు నన్ను అడిగినప్పుడు, ‘నిజంగానే మనల్నే అడగాలనుకున్నారా? లేక వేరే ఎవరో దగ్గరకు వెళ్లబోయి మన దగ్గరకు వచ్చారా?’ అనే సందేహం కలిగింది. కాస్ట్యూమ్‌ ట్రైల్స్‌ జరిగినప్పుడు కూడా అపనమ్మకంగానే ఉన్నాను. రిహార్సల్స్‌ చేస్తున్నప్పుడూ కచ్చితంగా మన స్థానంలో వేరే ఆర్టిస్ట్‌ని తీసుకుంటారనుకున్నా. ఎందుకంటే షారూక్‌ ఖాన్‌ లాంటి స్టార్‌ పక్కన నేనా? అనిపించింది. పైగా ‘ఖుర్బానీ’ చిత్రంలో జీనత్‌ అమన్‌ చేసిన ‘లైలా ఓ లైలా..’ సాంగ్‌ తరహాలో ఈ చిత్రంలోని పాట ఉంటుందన్నారు. ఆవిడ ఎక్కడ? నేనెక్కడ? అందుకని కొంచెం నెర్వస్‌గా అనిపించింది. ఎక్కువగా ఆలోచిస్తే, పాట చేయలేమనిపించి, జీనత్‌ అమన్‌ చేసిన డ్యాన్స్‌ని మరచిపోవడానికి ట్రై చేశా. అయితే లక్కీగా ఆ సాంగ్‌లా ఈ పాట ఉండదు. ఇది వేరేలా ఉంటుంది.



► షారుక్‌ ఖాన్‌ సరసన నటించడం గొప్ప అనుభూతి. పాట చిత్రీకరణ మొదలుపెట్టిన మొదటి రోజున షారుక్‌ని చూసి, ఎమోషన్‌ అయ్యా. కానీ, అది బయటకు కనిపించకుండా జాగ్రత్తపడ్డా. ఏడవాలనిపించింది. ఎందుకంటే షారుక్‌ను నేను దగ్గరగా చూడటం అదే మొదటిసారి. పైగా ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నాం. ఎక్కడినుంచో ముంబైకి వచ్చాను. మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. షారుక్‌తో నటించగలిగాను. నా కల నెరవేరింది. ఈ సందర్భంగా అమ్మాయిలకూ, అబ్బాయిలకూ నేను ఒకటి చెబుతా. కలలు కనండి. వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి. కష్టపడితే ఫలితం తప్పకుండా దక్కుతుంది. అందుకు నేనే ఒక ఉదాహరణ.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top