
తమిళసినిమా: పోలీసుల ముందుకు రావలసిందే. వివరణ ఇవ్వాల్సిందే. ఏమిటీ గొడవ అనుకుంటున్నారా? గొడవ కాదిది అమలాపాల్ రగడ. పాపం ఈ సంచలన నటిని కేసు కొత్త సంవత్సరంలోనూ వెంటాడుతోంది. వివాహానికి ముందు వివాహరద్దు తరువాత కూడా కథానాయకిగా బిజీగా ఉన్న అరుదైన నటీమణుల్లో ఒకరు అమలాపాల్. ఇప్పటికీ తమిళం, తెలుగు, మలయాళం అంటూ బహుబాషా నటిగా రాణిస్తున్న అమలాపాల్ నటించిన తాజా చిత్రం భాస్కర్ ఒరు రాస్కెల్ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెలలోనే విడుదలకు రెడీ అవుతోంది. ఈమెను పోలీస్ కేసు వ్యవహారం మాత్రం చిక్కుల్లో పడేసింది. ఈ అమ్మడు ఆ మధ్య ఖరీదైన కారును కొనుగోలు చేసి తాను పుదుచ్చేరిలో నివశిస్తున్నట్లు నకిలీ ఆధారాలతో పుదుచ్చేరిలో రిజిస్టర్ చేసుకున్నారు. అక్కడ ట్యాక్స్ తక్కువ కావడంతో అమలాపాల్ కక్కుర్తిపడ్డారనే ఆరోపణలు వెల్వువెత్తాయి. అలా కేరళా ప్రభుత్వ రవాణా శాఖకు ఈ అమ్మడు లక్షల్లో పన్నుకు కుచ్చు టోపి పెట్టేశారు.
ఈ విషయాన్ని అప్పట్టోనే పుదుచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడీ వెలుగులోకి తీసుకొచ్చారు. దీంతో మేలుకున్న కేరళా పోలీసులు అమలాపాల్‌పై పన్ను ఎగవేత కేసును నమోదు చేశారు. ఈ వ్యవహారంలో పలుమార్లు వివరణ కోరుతూ పోలీసులు సమన్లు జారీ చేసినా అమలాపాల్ పట్టించుకోలేదు. దీంతో పోలీసులు కేరళా హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో అమలాపాల్ ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారించిన న్యాయస్థానం అమలాపాల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో పాటు ఈ నెల 15వ తేదీ ఆమె పోలీసుల ముందు హాజరై కారు కొనుగోలు, నకిలీ ఆధారాలతో రవాణా శాఖ ఆదాయానికి గండికొట్టే ప్రయత్నం చేసిన వ్యవహారం గురించి వివరణ ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.దీంతో అమలపాల్‌కు పోలీసుల ముందుహాజరుకాక తప్పనిసరి అయ్యింది.