
సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా కుడిభుజం నొప్పితో సతమతమవుతున్న సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు శనివారం కాంటినెంటల్ ఆస్పత్రిలో విజయవంతంగా చికిత్స చేశారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్‌లో ఆయన కుడిచేతికి గాయమైంది. అప్పటి నుంచి ఆయన రొటేటర్ కఫ్ టియర్స్ ఆఫ్ షోల్డర్ పెయిన్’తో సతమతమవుతున్నారు. అప్పట్లో ఆయన ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు.
జైసింహా చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల సర్జరీని వాయిదా వేసుకున్నారు. రోజురోజుకూ నొప్పి ఎక్కువవుతుండటంతో వైద్యులను సంప్రదించగా సర్జరీ తప్పనిసరి అని తేల్చి చెప్పారు. దీంతో ఆయన శనివారం ఉదయం 8 గంటలకు ఆస్పత్రిలో చేరగా, ఆ వెంటనే కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దీప్తి నందన్ రెడ్డి, డాక్టర్ ఆశిష్ బాబుల్కర్ ఆయన కుడిచేతికి సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఒకటి, రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశముందని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి.