‘అవన్నీ వదంతులే.. ఆమె బాగున్నారు’

Lata Mangeshkar Representative Says She Is Recovering Steadily - Sakshi

దిగ్గజ గాయని లతా మంగేష్కర్‌ (90) అనారోగ్యం గురించి వస్తున్న వదంతులపై ఆమె వ్యక్తిగత సిబ్బంది స్పందించారు. లతాజీ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆమె కోలుకుంటున్నారని శనివారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా లతా ఇకలేరు అంటూ వస్తున్న వార్తలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వదంతులు ప్రచారం చేసి లతాజీ అభిమానులను, శ్రేయోభిలాషులను ఆందోళనకు గురిచేయవద్దని విఙ్ఞప్తి చేశారు. కాగా శ్వాసకోశ సంబంధిత సమస్యతో లతా మంగేష్కర్‌ సోమవారం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందారు. ఈ క్రమంలో లతా అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆకాంక్షించారు. అయితే ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు శోభా డే చేసిన ట్వీట్‌ లతా అభిమానులను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ‘ ఇది నిజం కాదని చెప్పండి. ఇండియా తన నైటింగేల్‌ను కోల్పోయిందా’అని ఆమె ట్విటర్‌లో పేర్కొనడం కలకలం రేపింది. శోభా డే తీరును పలువురు నెటిజన్లు తప్పుబట్టారు. 

ఈ క్రమంలో విమర్శలపై స్పందించిన శోభా డే... ‘ ఇప్పుడే లతా మంగేష్కర్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడాను. దేవుడి దయ వల్ల మన ప్రియమైన నైటింగేల్‌ ఆరోగ్యంగానే ఉన్నారట అని మరో ట్వీట్‌ చేశారు. ఇక దిగ్గజ గాయనిగా పేరొందిన మంగేష్కర్‌ వెయ్యికి పైగా చిత్రాల్లో పాటలు పాడిన సంగతి తెలిసిందే. దాదాపు 70 ఏళ్లపాటు ఆమె గాయనిగా కొనసాగారు. చివరగా 75 ఏళ్ల వయసులో ఉండగా వీర్‌ జారా సినిమా కోసం గాత్ర దానం చేశారు. సంగీత రంగంలో ఆమె సేవలకు గుర్తింపుగా... 1989లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు, 2001లో దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఆమెను వరించాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top