నేను అలా ఎప్పుడూ నటించను..! | Sakshi
Sakshi News home page

నేను అలా ఎప్పుడూ నటించను..!

Published Sat, Oct 21 2017 9:56 AM

keerthy Suresh Special Interview

వాళ్లే నాపై విమర్శలు చేస్తున్నారు అంటోంది నటి కీర్తీసురేశ్‌. కోలీవుడ్, టాలీవుడ్‌లలో మోస్ట్‌వాంటెడ్‌ హీరోయిన్ గా అనతికాలంలోనే పేరు తెచ్చుకున్న నటి ఈ బ్యూటీ. తొలి దశలోనే మహానటి సావిత్రిగా నటించే అదృష్టాన్ని అందుకున్న కీర్తీసురేశ్‌ ఈ మధ్య టాలీవుడ్‌ పై ప్రత్యేక శ్రద్ధ, కోలీవుడ్‌పై సీతకన్నేసిందనే నింద పడుతున్న సమయంలోనే వరుసగా విక్రమ్, విశాల్‌లతో జోడీ కడుతూ ఆ అపవాదును తుడిచేసుకుంది. ఆ సంగతులేంటో కీర్తీసురేశ్‌ భేటీలో చూద్దాం...

ఈ మధ్య చెన్నైకి దూరం అయినట్టున్నారు?
అలాంటిదేమీ లేదు. తమిళ చిత్రాలతో పాటు తెలుగులోనూ నటించడంతో మీకలా అనిపిస్తుండవచ్చు. షూటింగ్‌ల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లడంతో చెన్నైలో ఉండే రోజులు తక్కువయ్యాయి. అందుకే మీకలా అనిపించి ఉండవచ్చు.

సండైకోళి–2, సామి–2 చిత్రాలలో నటించడం గురించి?
దర్శకుడు లింగుస్వామి సండైకోళి–2 చిత్ర కథ చెప్పినప్పుడు నటి మీరాజాస్మిన్ నటించిన పాత్రలో తాను నటించగలనా అన్న భయం కలిగింది. అయితే దర్శకుడు ధైర్యం చెప్పడంతో నటించడానికి అంగీకరించాను. ఇందులో గ్రామీణ యువతిగా నటిస్తున్నాను. సామి2 చిత్రం లో త్రిషతో కలిసి నటిస్తున్నాను. విక్రమ్‌తో జంటగా నటించే అవకాశం రావడం మంచి అనుభవం.

కుటుంబం మొత్తం సినిమాల్లో బిజీగా ఉన్నట్టున్నారు?
నిజమే. ఇప్పుడు మా ఇంట్లో పెద్ద పోటీనే నెలకొందనే చెప్పాలి. మా నాన్న సమీపకాలంలో దిలీప్‌ హీరోగా నటించిన చిత్రంలో రాజకీయవాదిగా ఒక ముఖ్యపాత్రను పోషించారు. ఆయన నటనకు కేరళలో మంచి ప్రశంసలు లభించాయి. బామ్మ సరోజ రెమో చిత్రంలో నటించారు. ప్రస్తుతం చారుహాసన్ తో కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నారు. అక్క రేవతి దర్శకుడు ప్రియదర్శన్ వద్ద నిమిర్‌ చిత్రానికి సహాయదర్శకురాలిగా పని చేస్తోంది. త్వరలో తను దర్శకురాలు అవుతుంది.

తెలుగు చిత్రాల్లో గ్లామరస్‌గా నటించాల్సి ఉంటుందంటారే?
నేను మాత్రం కచ్చితంగా గ్లామరస్‌గా నటించేది లేదు. ఎన్ని ఏళ్లు అయినా అలా నటించను.

మీపై వస్తున్న విమర్శల గురించి?
ప్రేక్షకులకు నచ్చే విధంగా నటించడానికి కృషి చేస్తున్నాను. తొడరి చిత్రంలో  నా నటన కొందరికి నచ్చలేదు. అలాంటి వారే ఆట పట్టిస్తున్నారు.

నటి సావిత్రి పాత్రలో నటించడం ఛాలెంజింగ్‌గా లేదూ?
చాలా ఛాలెంజింగ్‌గా ఉందనే చెప్పాలి. అయితే ఆమె కూతురు విజయచాముండేశ్వరితో పాటు అందరూ ప్రోత్సహించి ఉత్సాహపరచడంతో ధైర్యం చేసి నటించడానికి సిద్ధమయ్యాను. సావిత్రి నటించిన తిరువిడైయాడల్, మాయాబజార్, పాశలర్‌ చిత్రాలను సమయం దొరికినప్పుడల్లా చూస్తున్నాను. అలాంటి మహానటి పాత్రలో నటించడం గర్వంగా భావిస్తున్నాను.

Advertisement
Advertisement