వాళ్ళే దేవుళ్లు : జగపతిబాబు

Jagapathi Babu Visit Patamata In Krishna - Sakshi

డాక్టర్‌ గోపాలకృష్ణ గోఖలేకు లైఫ్‌ టైమ్‌ ఎచివ్‌మెంట్‌ అవార్డు ప్రదానం

మొగల్రాజపురం (విజయవాడ తూర్పు) : మనిషి ప్రాణాలను నిలబెట్టే డాక్టర్లలోనే దేవుళ్లు ఉన్నారని తాను భావిస్తానని సినీనటుడు వి.జగపతిబాబు అన్నారు. రూట్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ 10వ వార్షికోత్సవం సందర్భంగా వైద్య, సామాజిక సేవల్లో విశేష సేవలందించిన వారికి అవార్డులను అందజేసే కార్యక్రమం ఆదివారం పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగింది. జగపతిబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని డాక్టర్‌ గోపాలకృష్ణ గోఖలేకు లైఫ్‌ టైమ్‌ ఎచివ్‌మెంట్‌ అవార్డు, డాక్టర్‌ ఎస్‌ఎస్‌వీ రమణ, డాక్టర్‌ కె.విజయ్‌శేఖర్, డాక్టర్‌ ఎస్‌.శ్రీరామచంద్రమూర్తి, డి.జోనికుమారికి రూట్స్‌ హెల్త్‌ సర్వీసెస్‌ అవార్డులను అందజేశారు. అనంతరం జగపతిబాబు మాట్లాడుతూ 30 ఏళ్లుగా హీరోగా, విలన్‌గా ఏ పాత్రలో నటించినా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

సమాజానికి తిరిగివ్వాల్సిందే :గోపాలకృష్ణ గోఖలే
సమాజం నుంచి ఎంతో పొందిన మనం తిరిగి సమాజానికి ఎంతోకొంత ఇవ్వాలని, అప్పుడే ఈ జన్మకు సార్థకతని లైఫ్‌ టైమ్‌ ఎచివ్‌మెంట్‌ అవార్డుగ్రహీత డాక్టర్‌ గోపాలకృష్ణ గోఖలే పేర్కొన్నారు. వివిధ వైద్య విభాగాల్లో నిపుణులైనవారు  (స్పెషలిష్టు డాక్టర్లు) ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలలో కొన్ని రోజులు సేవలు అందించే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించాలని సూచించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ క్యాన్సర్‌ రోగులకు సేవలందిస్తున్న ఫౌండేషన్‌ నిర్వాహకులను అభినందించారు. రూట్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ పీవీఎస్‌ విజయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ క్యాన్సర్‌ రాకుండా జాగ్రత్తలపై ప్రచారంతో పాటు  వైద్య పరీక్షలు నిర్వహించడం, క్యాన్సర్‌ను గుర్తిం చిన వారికి తమ ఫౌండేషన్‌ సేవలు అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ కన్వీనర్‌ మురళీకృష్ణ, కో–కన్వీనర్‌ టి.అర్జునరావు, అన్నే శివనాగేశ్వరరావు, ఐఎంఎ అధ్యక్షుడు బోస్, కార్యదర్శి రసిక్‌ సంఘ్వీ తదితరులు పాల్గొన్నారు. 

పటమటలో జగపతిబాబు సందడి  
పటమట : మరణానికి చేరువవుతున్న వారిని చేరదీయడం హర్షణీయమని సినీనటుడు జగపతిబాబు పేర్కొన్నారు. ఆదివారం రూట్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పటమటలోని ఫౌండేషన్‌ కార్యాలయం వద్ద క్యాన్సర్‌ రోగులతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రోజూ యోగా చేస్తానని, ఆరోగ్యంగా ఉండేందుకు ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించుకోవడం మన బాధ్యతని చెప్పారు. అనంతరం పలువురు క్యాన్సర్‌ బాధితులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ పి.విజయ్‌భాస్కర్, గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ పీవీ రమణమూర్తి, సలహాదారు డాక్టర్‌ ఎన్‌.మురళీకృష్ణ, ఐలా ప్రతినిధి అన్నే శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top