వెటకారమే నా సక్సెస్ కారణం | Sakshi
Sakshi News home page

వెటకారమే నా సక్సెస్ కారణం

Published Thu, Mar 10 2016 1:51 AM

Interview With Director Veerabhadram

 దర్శకుడు వీరభద్రమ్
 కడియం : ‘‘వెటకారంతో కూడిన హాస్యమే తన సక్సెస్‌కు కారణమని, అదే తనను సినీ ఇండస్ట్రీలో నిలిపింది’’ అని అన్నారు ప్రముఖ సినీదర్శకుడు ముళ్లపూడి వీరభద్రం. చుట్టాలబ్బాయ్ చిత్రం షూటింగ్ నిమిత్తం బుధవారం పల్లవెంకన్న నర్సరీకి వచ్చిన ఆయన షూటింగ్ విరామంలో ‘సాక్షి’కి పలు విషయాలు వెల్లడించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే.. ‘‘డిగ్రీ పూర్తయ్యాక ఎంసీఏ చేద్దామనిహైదారాబాద్ వచ్చిన నాకు ఈవీవీ దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి నా సినీజీవితం మొదలైంది.
 
 ఈవీవీ, తేజలతోపాటు పలువురు సక్సెస్‌ఫుల్ డెరైక్టర్ల వద్ద కో డెరైక్టర్‌గా చేశాను. అహనా పెళ్లంట, పూలరంగడు చిత్రాలు నాకు మంచి గుర్తింపునిచ్చాయి. ట్రెండ్‌కు అనుగుణంగా అప్‌గ్రేడ్ కావడంలో గోదావరి పరిసరప్రాంత ప్రజలు ముందుంటారు. అందుకే అన్ని రంగాల్లోనూ ముఖ్యంగా సినీ రంగంలో ఇక్కడి వారు బాగా రాణిస్తున్నారు.
 
 హాస్యనటుడు సునీల్‌ను సిక్స్‌ప్యాక్ బ్యాడీతో హీరోగా చూపించిన పూలరంగడు చిత్రాన్ని ఉభయగోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కడియం నర్సరీ ప్రాంతంలో ప్లాన్ చేశాం. కానీ ఔట్ డోర్ షూటింగ్‌లో సునీల్ సిక్స్‌ప్యాక్ కసరత్తులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో స్టూడియోలో చేయాల్సి వచ్చింది’’ అని చెప్పుకొచ్చారు.
 
 గోదావరివాసుల ఆదరణ నచ్చింది : ఆది
 ఉభయగోదావరి జిల్లా వాసుల ఆదరణ తనకెంతో నచ్చిందని యు వ హీరో ఆది అన్నారు. షూటింగ్ విరామంలో ఆయన స్థానిక విలేకరుల తో మాట్లాడారు. తన అత్తారిల్లు రాజమహేంద్రమైనా కడియం నర్సరీల్లోకి రావడం ఇదే మొదటిశారన్నారు. ఇప్పటి వరకు ఏడు సినిమాల్లో హీ రోగా నటించానని, అన్నింటికంటే భిన్నమైన కథతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా విజయవంతమవుతుందన్నారు. ఇక్కడి వారి ఆదరాభిమానాలు ఎన్నటి మరువలేనన్నారు.  
 
 ఇక్కడే బాగుంది : నమిత
 మళయాళంలో పలువురు అగ్రహీరోల సరసన 18 సినిమాల్లో హీరోయిన్‌గా నటించానని హీరోయిన్ నమిత అన్నారు. తెలుగులో చుట్టాలబ్బాయ్ తన తొలి చిత్రమన్నారు. షూటింగ్‌లో భాగంగా అనేక ప్రాంతాలు చూశానని, అయితే వాటన్నికంటే కడియం నర్సరీలు బాగున్నాయన్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే సినిరంగంలోకొచ్చిన తాను ప్రస్తుతం బీఏ లిటరేచర్ చేస్తున్నట్టు చెప్పారు.
 

Advertisement
Advertisement