ఊహకి అందని కథ

falaknuma das movie press meet - Sakshi

‘‘మంచి ఫిల్మ్‌మేకర్‌ అవ్వాలని యానిమేషన్‌ నేర్చుకున్నా. డైరెక్షన్, యాక్టింగ్‌ రెండిటిలోనూ ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా. నటించడం, దర్శకత్వం చేయడం కష్టం అనిపించలేదు కానీ, ప్రొడక్షన్‌ చాలా కష్టం’’ అని విశ్వక్‌ సేన్‌ అన్నారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్‌’. డి.సురేశ్‌బాబు సమర్పణలో విశ్వక్‌ సేన్‌ సినిమాస్, టెర్రనోవా పిక్చర్స్‌ బ్యానర్స్‌పై వాజ్ఞ్మయి క్రియేషన్స్‌ కరాటే రాజు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ– ‘‘నేను జర్నలిజం స్టూడెంట్‌ని. రెండు సబ్జెక్టులు బ్యాలెన్స్‌ ఉన్నాయి. ఫిల్మ్‌ మేకర్‌ అవ్వాలని ఉందని మూడో తరగతిలోనే మా అమ్మానాన్నలకు చెప్పాను. వారు నన్ను ప్రోత్సహించడంతో ఎక్కువ మురిపెం చేస్తున్నారంటూ మా బంధువులు తిట్టారు. అయినా నా నిర్ణయాన్ని మార్చుకోలేదు. ‘వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైంది’ సినిమాల్లో నటించాను. ‘ఫలక్‌నుమా దాస్‌’ నా మూడో చిత్రం. ఈ సినిమాకి నేనే డైలాగులు రాశాను. ఇందులోని భావోద్వేగాలను నాకంటే బాగా ఎవరూ పండించలేరనిపించి నేనే హీరోగా నటించాను.

ఇది పక్కా ఎమోషనల్‌ ఫిల్మ్‌. కుటుంబం, స్నేహం నేపథ్యంలో ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుంది? అన్నది ఎంతో మేధాశక్తి ఉన్నవారు కూడా ఊహించలేరు. ఎందుకంటే ఇది రెగ్యులర్‌ సినిమా కాదు. సాధారణంగా ఫలక్‌నుమా అనగానే అందరికీ అందమైన ప్యాలెస్‌ గుర్తుకొస్తుంది. కానీ, దాని వెనక ఉన్న బస్తీ గుర్తుకురాదు. ఆ బస్తీలోని ఎన్నో అందమైన ప్రదేశాలను మా సినిమాలో చూపించాం. 2005–2009 నేపథ్యంలో సినిమా ఉంటుంది. ఈ కథతో కొందరు నిర్మాతలను కలిస్తే చేయడం కుదరదన్నారు.. మరికొందరు డైలాగులు మార్చమన్నారు.

తీరా టీజర్‌ రిలీజ్‌ అయ్యాక సినిమా మేమే కొంటామని ముందుకొచ్చారు. తెలుగులో అంతర్జాతీయ స్థాయి సినిమాలు రావాలన్న ఆలోచన సురేశ్‌బాబుగారిది. ‘ఫలక్‌నుమా దాస్‌’ సినిమా చూడకుండా కేవలం టీజర్‌ చూసి మాపై నమ్మకంతో ఈ చిత్రం విడుదల చేస్తున్నారాయన. ప్రస్తుతం నేను ‘కార్టూన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా చేస్తున్నా. ఆ తర్వాత నాని నిర్మాతగా కొత్త దర్శకుడు శైలేష్‌తో ఓ సినిమాలో నటించబోతున్నా. డైరెక్షన్‌కి ఓ ఏడాది గ్యాప్‌ ఇస్తున్నా. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషల్లో ఓ సినిమా తెరకెక్కిస్తా’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top