దీపికకు చేదు అనుభవం.. ట్విటర్‌లో ట్రెండింగ్‌!

Deepika Padukone Trolled Over Visiting JNU - Sakshi

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ దీపికా పదుకొనెపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమె నటించిన తాజా సినిమా ఛపాక్‌ను బాయ్‌కాట్‌ చేయాలంటూ అధిక సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో #boycottchhapak అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. కాగా దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ యూనివర్సిటీని దీపిక మంగళవారం సందర్శించిన విషయం తెలిసిందే. జేఎన్‌యూ విద్యార్థులు, ప్రొఫెసర్లపై ముసుగు దుండగుల దాడిని నిరసిస్తూ నలుపు రంగు దుస్తులు ధరించిన దీపిక.. విద్యార్థులతో భేటీ అయ్యారు. వారికి సంఘీభావం తెలుపుతూ క్యాంపస్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు దీపికను విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. తన సినిమా ప్రచారం కోసం దీపిక నీచానికి దిగజారిందని.. దేశ ద్రోహులపై ప్రేమ ఒలకబోస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. (వాళ్లను చూస్తే గర్వంగా ఉంది: దీపిక )

‘కన్హయ్య కుమార్‌, ఆయిషీ ఘోష్‌ వంటి వారికి దీపిక మద్దతు తెలిపింది. మరి దాడిలో గాయపడిన ఏబీవీపీ వాళ్ల సంగతేంటి. నకిలీ ఫెమినిజంతో దీపిక ఎన్నాళ్లు నెట్టుకువస్తావు. ఛీ.. సినిమా ప్రచారం కోసం ఇంతలా దిగజారాల్సిన అవసరం ఏముంది. దేశంలో ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. చదువుకోవాలని తపిస్తున్నారు. వాళ్ల కోసం నీ విలువైన సమయాన్ని కేటాయించవచ్చు కదా’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ఇక దీపిక అభిమానులు సైతం.. ‘నాకు దేశమే ముఖ్యం. ఆ తర్వాతే నా ఫేవరెట్‌ హీరోయిన్‌ అయినా.. మరెవరైనా. అయితే దీపిక లాంటి సినిమా హీరోయిన్‌ కోసం కాకపోయినా.. నిజమైన హీరో లక్ష్మీ అగర్వాల్‌ కోసం ఈ సినిమా చూడాలి’ అని ఆమె తీరును తప్పుబడుతున్నారు.(‘మాల్తీ’గా ముంబైలో దీపిక చక్కర్లు)

ఇంకొంత మంది మాత్రం...‘ దీపికా సినిమాలను అడ్డుకోవాలని చూసిన ప్రతీసారి... ఆమె రేంజ్‌ అంతకంతకూ పెరిగిపోయింది. ఆ సినిమాల వసూళ్లు బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాయి. ఇప్పుడు ఛపాక్‌ కూడా అదే స్థాయిలో రికార్డు వసూళ్లు సాధిస్తుంది. ఆమె నిజమైన హీరో’ అంటూ దీపికకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో #boycottchhapak ట్విటర్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. కాగా యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా ఛపాక్‌ తెరకెక్కిన సంగతి తెలిసిందే. దీపిక తొలిసారిగా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top