విజయ్‌సేతుపతి ఇంటి ముట్టడికి చిరువ్యాపారులు సిద్ధం

Business Mans Plan To Protest Against Vijay Sethupathi - Sakshi

సాక్షి, చెన్నై: నటుడు విజయ్‌సేతుపతి ఇంటిని ముట్టడించేందుకు చిరు వ్యాపారులు సిద్ధం అవుతున్నారు. నటుడిగా మంచి ఫామ్‌లో ఉన్న విజయ్‌ సేతుపతి ఇప్పుడు చిరువ్యాపారుల ఆగ్రహానికి గురవుతున్నారు. అందుకు కారణం ఇటీవల ఆయన ఆన్‌లైన్‌ వ్యాపారం కోసం ఒక వ్యాపార సంస్థ రూపొందించిన మండి యాప్‌లో నటించడమే. ఆ యాప్‌లో చిరు వ్యాపారులకు నష్టం కలిగేలా కూరగాయల నుంచి అన్ని రకాల వస్తువులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకోవచ్చనే విధంగా విజయ్‌సేతుపతి నటించారు. దీంతో చిరువ్యాపారులు ఆయన ఆ యాప్‌లో నటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విషయంలో చిరు వ్యాపార సంఘాలు నటుడు విజయ్‌సేతుపతి ఇంటిని ముట్టడించి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా దీనిపై స్పందించిన తమిళనాడు వ్యాపారసంఘల నిర్వాహకులు.. చిరు వ్యాపారులకు నష్టం కలిగించే ఏ విషయాన్ని తాము అనుమతించమన్నారు.

అన్‌లైన్‌ వ్యాపారంతో చిరు వ్యాపారులకు చాలా నష్టం ఏర్పడుతుందన్నారు. ఆన్‌లైన్‌ వ్యాపారం పేరుతో బడా సంస్థలు చేస్తున్న వ్యాపారం ప్రజలకు చేటుచేస్తుందన్నారు. ఉదాహరణకు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నామని చెప్పే వ్యాపార సంస్థలు ఆ వస్తువులను శీతలీయం పరచి విక్రయిస్తున్నారని చెప్పారు. అలా వంకాయలు, టమాటాలు  కూరగాయలు సహజంగా ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ నిలవ ఉండవన్నారు. అలాంటి వాటిని శీతలీయం పరిచి విక్రయించడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. మరో విషయం ఏమిటంటే రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్న బడా వ్యాపారులు స్థానిక కోయంబేడు మార్కెట్‌ నుంచి కొనుగోలు చేస్తున్న విషయం వెలుగు చూసిందన్నారు. వారిని అడ్డగించి మార్కెట్‌ వ్యాపారులు ఆందోళన చేసినట్లు తెలిపారు.

స్టార్స్‌ ఆలోచించాలి 
కాగా ఇలాంటి ప్రజలకు బాధింపు కలిగించే వ్యాపార ప్రకటనల్లో నటించే ముందు నటీనటులు ఆలోచించాలన్నారు. నటుడు విజయ్‌సేతుపతి అంటే నటుడిగా తమకు గౌరవం ఉందని, అయితే ఆయన చిరు వ్యాపారులను బాధించే ఇలాంటి ఆన్‌లైన్‌ వ్యాపారానికి ప్రచార ప్రకటనల్లో నటించడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈ తరహా ఆన్‌లైన్‌ వ్యాపారాలను నిషేధించాలని త్వరలో ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు.

అంతలోతుగా ఆలోచించలేదు 
ఈ వ్యవహారంపై నటుడు విజయ్‌సేతుపతి వర్గం స్పందిస్తూ చిరు వ్యాపారులకు నష్టం వాటిల్లే ఏ విషయాన్ని విజయ్‌సేతుపతి చేయరన్నారు. ప్రజల ఆదరణతో ఈ స్థాయికి చేరుకున్న ఆయన ఎవరి వ్యాపారాలకు బాధింపు కలిగించే ఆలోచనలేదన్నారు. ఈ యాప్‌లో నటించే ముందు నటుడు విజయ్‌సేతుపతి పర్యావసనం గురించి అంతలోతుగా ఆలోచించలేదని పేర్కొన్నారు. కాగా ఈ విషయమై సంబంధిత వ్యాపార సంస్థనే త్వరలో వివరణ ఇస్తుందన్నారు.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top