‘శ్రీదేవి బంగ్లా’ చిత్రంపై అభ్యంతరం

Boney Kapoor Sends Legal Notice To Priya Prakash Varrier - Sakshi

ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ మరోసారి వార్తల్లోకెక్కారు. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌, ప్రియా ప్రకాశ్‌కు లీగల్‌ నోటీసులు పంపారు. విషయం ఏంటంటే.. ప్రియా ప్రకాశ్‌ ప్రస్తుతం ‘శ్రీదేవి బంగ్లా’ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. మలయాళ దర్శకుడు ప్రశాంత్‌ మాంబుల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ కొన్ని రోజుల క్రితం విడుదలైంది. ఈ చిత్రంలో ప్రియ.. శ్రీదేవి అనే టాప్‌ హీరోయిన్‌ పాత్రలో నటిస్తున్నారు. అయితే ట్రైలర్‌, టైటిల్‌ని బట్టి చూస్తే ఇది దివంగత నటి శ్రీదేవి జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రమా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

అదీ కాకుండా ట్రైలర్‌లో శ్రీదేవి బాత్‌టబ్‌లో పడి చనిపోయిన సీన్‌ కూడా ఉండటంతో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. దాంతో నిర్మాత బోనీ కపూర్‌.. ప్రియతో పాటు చిత్రబృందానికి కూడా లీగల్‌ నోటీసులు పంపించారు. ఈ విషయం గురించి చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ మాంబుల్లి మాట్లాడుతూ.. ‘గత వారం బోనీ కపూర్‌ నుంచి మాకు నోటీసులు వచ్చాయి. మేం ఈ సమస్యను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం. శ్రీదేవి అన్నది సాధారణంగా అమ్మాయిలు పెట్టుకునే పేరేనని బోనీకి నచ్చజెప్పాను. నా సినిమాలో కథానాయిక పాత్ర పేరు శ్రీదేవి. మేం దీన్ని ఎదుర్కొంటాం’ అని తెలిపారు.

ఈ విషయం గురించి ప్రియ మాట్లాడుతూ.. ‘ఇది శ్రీదేవి సినిమానా కాదా అనే విషయం తెలుసుకోవాలంటే ముందు మీరు సినిమా చూడాలి. ఇందులో నేను శ్రీదేవి అనే సూపర్‌స్టార్‌ పాత్రలో నటిస్తున్నాను’ అంటూ అసలు విషయం చెప్పకుండా మాట దాటేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top