నో డెరైక్షన్.. ఓన్లీ రైటింగ్..!
సంగీతదర్శకునిగా ఎ.ఆర్. రహమాన్ ఇన్నాళ్లూ కీబోర్డ్‌తో సహవాసం చేసిన ఈ సంగీత సంచలనం ఇప్పుడు కలంతో కూడా దోస్తీ.
సంగీతదర్శకునిగా ఎ.ఆర్. రహమాన్ సంపాదించిన పేరు, ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఇన్నాళ్లూ కీబోర్డ్‌తో సహవాసం చేసిన ఈ సంగీత సంచలనం ఇప్పుడు కలంతో కూడా దోస్తీ కట్టారు. ఓ హిందీ చిత్రం కోసం కథ రాస్తున్నారు. ఈ కథతో ఆయన ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారనే వార్త వినిపిస్తోంది. అయితే రహమాన్‌కి ఆ ఉద్దేశం లేదట. దీని గురించి ఆయన విపులంగా చెబుతూ -‘‘రికార్డింగ్స్, మ్యూజిక్ షోస్ కోసం నేను రకరకాల దేశాలు తిరుగుతాను. ఆ ప్రయాణాల్లో చాలా విషయాలు గమనిస్తుంటాను.
నాకు సమయం చిక్కినప్పుడల్లా వాటిని పేపర్ మీద పెడుతుంటాను. రాయడంలో నా ప్రతిభను చూసిన నా స్నేహితుల్లో ఒకరైన గబ్రియేల్, నన్ను రచనను సీరియస్‌గా తీసుకోమన్నాడు. ఎలా రాయాలనే విషయం మీద నాకు కొన్ని పాఠాలు నేర్పించాడు. ఆ తర్వాత రాయాలనే పురుగు నా బుర్రను తొలిచేయడం మొదలుపెట్టింది. గత మూడేళ్లుగా నేను రాస్తున్నాను. ప్రస్తుతం హిందీ చిత్రానికి కథ రాస్తున్నాను. ఈ చిత్రానికి దర్శకత్వం మాత్రం వహించను. అయితే ఈ సినిమాకి నిర్మాతగా చేస్తాను. పాటలు కూడా స్వరపరుస్తాను’’ అని స్పష్టం చేశారు రహమాన్.