పల్లెపై దొంగల పంజా

Fear of robbers in Raghavapur - Sakshi

 రాఘవాపూర్‌లో బీభత్సం

 ఏడు ఇళ్లలో చోరీ

బంగారం, వెండి, నగదు అపహరణ

క్లూస్‌ టీంతో పోలీసుల తనిఖీలు

ఓ జీపు, రెండు బైక్‌లపై వచ్చిన దొంగలు!

సిద్దిపేటఅర్బన్‌: ఓ జీపు.. రెండు బైక్‌లు..! వారి వద్ద ఇనుప రాడ్లు, గడ్డపారలతో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బీభత్సం సృష్టించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు ఇళ్లలో చోరీలకు పాల్పడి, దొరికినకాడికి దోచుకున్నారు. ఈ సంఘటన సిద్దిపేట రూరల్‌ మండలంలోని రాఘవాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ క్రమంలో అడిషనల్‌ సీపీ నర్సింహారెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్తుల, బాధితుల, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట రూరల్‌ మండలంలోని రాఘవాపూర్‌ గ్రామానికి చెందిన పెద్దమల లక్ష్మి, అబ్బుల పర్శరాములు తమ ఇంటికి తాళం వేసి రెండు రోజుల క్రితం ఊరికి వెళ్లారు. అలాగే అబ్బుల పద్మ, నాగరాజు, పిట్ల ఎంకవ్వ, నల్లనాగుల శాంతవ్వ, తాడెపు రమ్య కుటుంబీకులు తమ ఇంటికి తాళం వేసి మరో ఇంట్లో నిద్రిస్తున్నారు.

ఈ క్రమంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఓ జీపు, రెండు బైక్‌లపై వచ్చి ఆయా ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. అబ్బుల పద్మ–మహంకాళి ఇంట్లో 5.5తులాల బంగారం, 70తులాల వెండి, పెద్దమల లక్ష్మి ఇంట్లో అర్ధ తులం బంగారం, 20తులాల వెండితోపాటు రూ. 20వేల నగదు, నాగరాజు ఇంట్లో 5తులాల వెండి, రూ. 2వేల నగదు, పిట్ల ఎంకవ్వ ఇంట్లో రూ. వెయ్యి నగదు, నల్లనాగుల శాంతవ్వ ఇంట్లో 2తులాల బంగారం, రెండు పట్టుచీరలతోపాటు రూ. 5వేల నగదును ఎత్తుకెళ్లారు. అలాగే అబ్బుల పర్శరాములు, తాడెపు రమ్య ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో బీరువాను ధ్వంసం చేసి సామగ్రిని చిందరవందర పడేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్‌ సత్తయ్యగౌడ్‌ మొదట ఘటన స్థలానికి చేరుకుని, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

అర్ధరాత్రి వచ్చిన దొంగలు!
రాఘవాపూర్‌ గ్రామానికి అర్ధరాత్రి 2గంటల ప్రాంతం లో ఓ జీపు, రెండు బైక్‌లు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మెయిన్‌ రోడ్డు నుంచి వచ్చిన వారు గ్రామంలోకి ప్రవేశించారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా వరుసగా ఓ ఇంటి తర్వాత మరో ఇల్లును ఇలా.. తాళం వేసి న ఏడు ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. ఆయా ఇండ్లలో ఎంత దొరికితే అంత దోచుకెళ్లారు. దొంగతనానికి ఉపయోగించిన ఓ గడ్డపారను దుండగులు అక్కడే వదిలివెళ్లారు. గ్యాంగ్‌తో వచ్చిన దుండగులకు ఎవరైనా అడ్డం వెళ్లి ఉంటే వారిని కూడా చంపేసేవారని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. 

గొల్లుమన్న పల్లె...
వారంతా కూలీ, వ్యవసాయం చేసుకుని బతికే సగటు జీవులు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు.. ఆయా ఇండ్లలో దొంగలు పడడంతో బాధితులంతా గొల్లుమని రోదించారు.  చోరీలో మొత్తం 8తులాల బంగారం, 95తులాల వెండి ఆభరణాలతోపాటు రూ. 28 వేల నగదు ఎత్తుకెళ్లారు. 

ఘటన స్థలానికి అడిషనల్‌ సీపీ..
విషయం తెలుసుకున్న సిద్దిపేట అడిషనల్‌ సీపీ నర్సింహారెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. అంతర్‌ జిల్లాల దొంగల ముఠానే ఈ పని చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారిని తొందరగానే పట్టుకుంటామన్నారు. క్లూస్‌ టీంతో తనిఖీలు చేయిం చారు. అడిషనల్‌ సీపీ వెంట టూటౌన్‌ సీఐ ఆంజనేయులు, రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డిలు ఉన్నారు.

 

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top