
'నేను రేపిస్టునా.. ప్రతిరోజూ చస్తున్నా'
తాను ప్రతిరోజూ చస్తున్నానని వివాదాస్పద భారతీయ అమెరికన్ యోగా గురువు బిక్రమ్ చౌదరీ అన్నారు.
న్యూయార్క్: తాను ప్రతిరోజూ చస్తున్నానని వివాదాస్పద భారతీయ అమెరికన్ యోగా గురువు బిక్రమ్ చౌదరీ అన్నారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని చెప్పారు. వాటన్నింటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని, ఖండిస్తున్నాని చెప్పారు. అమెరికాలోని పలు ప్రాంతాల్లో హాట్ రూంలలో ప్రత్యేక యోగా క్లాసులు నిర్వహిస్తున్న బిక్రమ్ చౌదరీపై లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయి.
ఆయన వద్ద యోగా క్లాసులు నేర్చుకునేందుకు వచ్చే వాళ్లలో ఆరుగురు పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదులివ్వగా కోర్టు ఆయనకు సమన్లు కూడా పంపింది. ఈ సందర్భంగా ఆయనను ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేయగా స్పందించారు. కాస్తంతా బాధ తప్త హృదయంతో గద్గధ స్వరంతో మాట్లాడారు. తనను మహిళలు ఎంతగానో ప్రేమిస్తారని, ఇష్టపడతారని అయినంత మాత్రానా తాను దానిని అదునుగా చేసుకొని ఎలాంటి అకృత్యాలకు పాల్పడనని చెప్పారు. కొందరు న్యాయవాదులు కావాలని ఉసిగొల్పి ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా తానే తప్పుచేయలేదన్న నిజాన్ని ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నానని తెలిపారు.
తనను ఇంతమంది ప్రేమించేవాళ్లుండగా అలాంటి పనులు చేయాల్సిన అవసరమేమిటని చెప్పారు. తన భార్య, పిల్లలు తన ముఖం చూడటం లేదని, పేరు మసకబారిందని, ఇంటి పరువు పోయిందని చెప్పారు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు చావు వస్తుందని, రేపిస్టు అంటూ తనపై వచ్చిన ఆరోపణల కారణంగా తాను మాత్రం ప్రతి రోజూ చస్తున్నాని కంటతడితో అన్నారు. తన గుండెలో బాధను ఎలా చెప్పాలో అర్థంకావడం లేదని, 24గంటలపాటు మరెవ్వరూ కష్టపడనంతగా తాను కష్టపడతున్నాని, కానీ తనకు మాత్రం రేపిస్టు అని రివార్డు ఇచ్చారని చెప్పారు. నిజంగా తనపై ఇలాంటి నిందలు వేసిన పాశ్చాత్య సంస్కృతి సిగ్గుపడాలని అన్నారు.