నెలవంకపై నారీమణి

Women Into The Moon - Sakshi

మనిషి చంద్రున్ని చేరుకున్న50 ఏళ్ల తర్వాత మహిళకు అవకాశం

2024కి చంద్రుడిపైకి మహిళను పంపించేందుకు నాసా ప్రయత్నం.. 

ఆమె ముఖం చంద్రబింబంలా ఉందని అమ్మాయిల అందాన్ని ఆకాశానికెత్తేస్తారు. వెన్నెల సోయ గాల సొగసుందని వర్ణిస్తుంటారు. చంద్రుడిలో ఉండే చల్లదనం ఆమె మనసులో ఉందని ముచ్చటపడిపోతారు. కానీ ఆ చంద్రుడి అందాలు, ఆ వెన్నెల సోయగాలు దగ్గరుండి చూసే భాగ్యం ఇన్నేళైనా అతివలకు అందలేదు. చంద్రుడిపైకి మనిషి చేరుకున్న 50 ఏళ్ల తర్వాతే ఒక మహిళకు అంతటి మహత్తర అవకాశం దక్కబోతోంది. 2024కల్లా చంద్రుడిపైకి ఒక మహిళను పంపడానికి నాసా ప్రయత్నిస్తోంది. నాసా అపోలో11 మిషన్‌ ద్వారా మొదటిసారి 1969 జూలై 20న చంద్రుడి మీద మనిషి కాలు మోపాడు. అపోలో మిషన్‌ తర్వాత 50 ఏళ్లకి ఆర్టిమిస్‌ మిషన్‌ ద్వారా మళ్లీ చంద్రుడిపై పంపే వ్యోమగాముల్లో మొదటిసారి మహిళకు చోటు కల్పించాలని నాసా యోచిస్తోంది.  

అదనపు బడ్జెట్‌ కేటాయించిన అమెరికా 
ఇందుకోసం ఇటీవలే ట్రంప్‌ 1.6 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ను నాసాకు కేటాయించారు. చంద్రుడి మీదకు మరోసారి వెళ్దాం నా ఆధ్వర్యంలో, తర్వాత మార్స్‌కి కూడా అంటూ ట్వీట్‌ చేశారు నాసా అడ్మినిస్ట్రేటర్‌ జిమ్‌ బ్రిడెన్‌స్టిన్‌. దీంతో నాసా కొత్త మిషన్‌ గురించిన ఆసక్తి నెలకొంది. మళ్లీ చంద్రయాత్ర చేపడదాం అంటున్న అమెరికా ప్రభుత్వం. ఆ దిశగా బడ్జెట్‌ కేటాయింపులు కూడా ప్రకటించింది. చంద్రుడిపై మనిషి ని పంపేందుకుగాను స్పేస్‌ పాలసీ డైరెక్టివ్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల సంతకం చేశారు. 1972 తర్వాత నాసా మళ్లీ మనిషిని చంద్రుడి మీదకు పంపే ఏర్పాట్లు చేస్తోంది. ఈ మిషన్‌కి ఆర్టెమిస్‌ అని గ్రీకు చంద్రదేవత పేరు పెట్టినట్లు తెలిపారు.  

మగాళ్లే కానీ మహిళలు లేరు.. 
ఇప్పటికి 12 మంది చంద్రుడి మీద సంచారం చేశా రు. వారంతా అమెరికన్‌ మగవారే.  భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌ వ్యోమగాములుగా పేరుగడించారు.  ప్రపంచంలో 50 మందికి పైగా మహిళావ్యోమగాములున్నా ఇప్పటివ రకు చంద్రతలం మీద అడుగుపెట్టలేదు.  చంద్రయాత్రలో తొలిసారి మహిళలకు స్థానం కల్పించాలని నాసా ప్రయత్నాలు చేపట్టడంపట్ల  మహిళలు ఆనం దం వ్యక్తం చేస్తున్నారు.  2022లో భారత్‌ చేపట్టనున్న గగన్‌యాన్‌లోనూ మహిళలుంటారని 2018 ఆగస్టు, 15న ప్రధాని మోదీ ప్రకటించారు. ఇదే నిజమైతే నాసా కంటే ముందు ఇస్రోనే మహిళలను చంద్ర మండలానికి పంపిన ఘనత దక్కించుకుంటుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top