లైంగిక స్కామ్‌కు నోబెల్‌ అవార్డుకు లింకేమిటీ?

Whait Is The Link Between Sexual Abuse And Nobel Award - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఈసారి అత్యంత ప్రపంచ ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ అవార్డును సాహిత్యానికి ప్రకటించలేదు. లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా ఈసారికి ఈ అవార్డును వాయిదా వేస్తున్నామని, వచ్చే ఏడాది 2018కి, 2019 సంవత్సరానికి నోబెల్‌ అవార్డులు ప్రకటిస్తామని స్వీడిష్‌ అకాడమి శుక్రవారం ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ అవార్డును వాయిదా వేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అంటే వాయిదా వేయడం ఇదే మొదటి సారి. ఇంతకు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎవరి మీద వచ్చాయి? ఎందుకొచ్చాయి? అవార్డు ఇవ్వకపోవడానికి లైంగిక వేధింపుల ఆరోపణలకు ఉన్న ప్రత్యక్ష సంబంధం ఏమిటీ? ఈప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే కాస్త లోతుగా అధ్యయనం చేయాల్సిందే. అలా చేస్తే ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత హార్వీ విన్‌స్టైన్‌ సెక్స్‌ స్కామ్‌కు, తద్వారా పుట్టిన ‘మీ టూ’ ఉద్యమానికి ప్రత్యక్ష సంబంధం, తెలుగు సినీ రంగంపై శ్రీరెడ్డి సాగిస్తున్న ప్రస్తుత పోరాటానికి పరోక్ష సంబంధం కనిపిస్తుంది. 

స్వీడిష్‌ భాష అభివృద్ధికి కృషి చేయడంతోపాటు వచనం, కవిత్వం సహా పలు భాషా ప్రక్రియలను ప్రోత్సహించడం కోసం 1786లో ఈ స్వీడిష్‌ అకాడమీ ఏర్పాటయింది. అప్పటి నుంచి ఈ అకాడమీ ఏటా స్వీడిష్‌ సాహిత్యంలో ఉత్తమ రచయిత లేదా కవికి అవార్డు ఇస్తూ వస్తోంది. ప్రధానంగా ఈ అకాడమిలో 18 మంది సభ్యులు ఉంటారు. వారిలో శాశ్వత సెక్రటరీ ఒకరు ఉంటారు. సాహిత్యంలో నిపుణులైన వారిని మాత్రమే సాధారణంగా సభ్యులుగా తీసుకుంటారు. వీరిలో ఒకరు స్వీడిష్‌ అకాడమీకి శాశ్వత కార్యదర్శిగా ఉంటారు. దాదాపు 230 సంవత్సరాల అకాడమీ చరిత్రలో తొలిసారిగా శాశ్వత కార్యదర్శి సారా డేనియస్‌ (మహిళ) ఏప్రిల్‌ 12వ తేదీన తన పదవికి రాజీనామా చేయడంలో అకాడమీలో సంక్షోభం మొదలైంది.

అకాడమీ నియమ నిబంధనల ప్రకారం సభ్యులు మరణిస్తే లేదా తీవ్ర అనారోగ్యానికి గురైయితేనే వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకుంటారు. సభ్యులు అవినీతికి పాల్పడినప్పుడు వారిపై అభిశంసన తీర్మానం పెట్టి మెజారిటీ నిర్ణయంతో వారిని తొలగించవచ్చు. కానీ సభ్యులు తమంతట తాము ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయడానికి వీల్లేదు. కాకపోతే అకాడమీ కార్యకలాపాలకు స్వచ్ఛందంగా దూరంగా ఉండొచ్చు.  కొత్త సభ్యులను ఎన్నుకోవాలంటే కనీసం 12 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనాలి. 1895 ప్రముఖ సైంటిస్ట్‌ ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ రాసిన వీలునామా వల్ల ఈ స్వీడిష్‌ అకాడమీ జాతకమే మారిపోయింది. కావాల్సినంత ధనం వచ్చి పడింది. నోబెల్‌ పేరిట సాహిత్యంలో మొట్టమొదటి అవార్డును 1901లో ఫ్రెంచ్‌ కవికి ఇచ్చారు. అప్పటి నుంచి ఈ అవార్డుకు ఎంతో విలువ పెరిగింది. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెడిసిన్‌ రంగాలతోపాటు శాంతి నోబెల్‌ అవార్డులను వేర్వేరు అకాడమీలు ఎంపిక చేసినట్లే  సాహిత్య నోబెల్‌ అవార్డును  ఈ స్వీడిష్‌ అకాడమీ ఎంపిక చేస్తోంది. 

స్వీడిష్‌ అకాడమీలో ప్రస్తుత సంక్షోభ పరిస్థితులకు మూలాలు 1989 పరిణామాల్లోనే ఉన్నాయి. ప్రముఖ ప్రవాస భారతీయ రచయిత సల్మాన్‌ రష్దీ ‘శటానిక్‌ వర్సెస్‌’ రాసినందుకు ఆయనపై ఇరాన్‌ ప్రభుత్వం ఫత్వా జారీ చేసింది. ఆ ఫత్వాకు వ్యతిరేకంగా పోరాడలంటూ స్వీడిష్‌ ప్రభుత్వానికి ఓ మెమోరాండం సమర్పించాలని అకాడమీ మెజారిటీ సభ్యులు నిర్ణయించారు. అందుకు నిరసనగా కెరిస్టిన్‌ ఎక్మన్, లార్స్‌ జిల్లెస్టైన్‌లు తమ సభ్యత్వాన్ని వదులుకుంటున్నామని నోటిమాటగా చెప్పి వెళ్లిపోయారు. వారిలో లార్స్‌ జిల్లెస్టైన్‌ చనిపోవడంతో ఆయన స్థానంలో  క్రిస్టినా లుగున్‌ అనే సాహిత్యవేత్తను ఎన్నుకున్నారు. 2015లో లొట్టా లొటాస్‌ అనే మహిళ కూడా వ్యక్తిగత కారణాలతో అకాడమీ నుంచి తప్పుకుంది.  దీంతో అకాడమీ సభ్యుల సంఖ్య 18 నుంచి 16కు పడిపోయింది. వీరిలో ఐదుగురు మహిళలు ఉండగా వారిలో శాశ్వత కార్యదర్శి సారా డేనియస్‌ ఈ నెల 12న అకాడమీ నుంచి తప్పుకున్నారు. ఆమె బాటలోనే కవయిత్రి కతరినా ఫ్రోస్టెన్సన్‌ తన భర్త జీన్‌ క్లాడ్‌ ఆర్నాల్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో అకాడమీ నుంచి తప్పుకున్నారు. భర్తపై ఆరోపణలు వస్తే భార్య ఎందుకు బలి కావాలన్న చర్చ అకాడమీలో కూడా జరిగింది. అయితే ఆర్నాల్ట్‌ నడుపుతున్న కళాకారుల క్లబ్‌కు ఆర్థిక సాయం అందిస్తున్నదే స్వీడిష్‌ అకాడమీ. పైగా ఈ లైంగిక ఆరోపణలు ఈ నాటివి కావు. 1996లో అన్నా కరీన్‌ బైలండ్‌ అనే యువ కళాకారిని తనను ఆర్నాల్ట్‌ లైంగికంగా వేధిస్తున్నారంటూ నాటి స్వీడిష్‌ అకాడమీ శ్వాశ్వత కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. 

2017లో ప్రముఖ హాలివుడ్‌ నిర్మాత హార్వీ విన్‌స్టైన్‌ సెక్స్‌ కుంభకోణం వెలుగులోకి వచ్చిన  కారణంగా మొదలైన ‘మీ టూ’ ఉద్యమంలో భాగంగా ఆర్నాల్ట్‌కు వ్యతిరేకంగా 18 మంది యువతులు మీడియా ముందుకు వచ్చి తామూ లైంగిక వేధింపులకు గురయ్యామని వెల్లడించారు. దీంతో ఆర్నాల్ట్‌ భార్య కతరినా ప్రోస్టెన్సన్‌ను తొలగించాలంటూ అకాడమీలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై అకాడమీ సారా డేనియస్‌ ఏప్రిల్‌ 12న తన పదవికి గుడ్‌బై చెప్పగా, కతరినా రాజీనామా చేశారు. ఆమెకు మద్దతుగా నవలా రచయిత క్లాస్‌ ఆస్టర్‌ గ్రెన్, సాహితీవేత్త స్కాలర్‌ కేజెల్, చరిత్రకారులు పీటర్‌ ఎంగ్లండ్‌లు కూడా అకాడమీకి రాజీనామా చేశారు. దీంతో అకాడమీ సభ్యత్వం 11కు పడిపోయింది. అకాడమీ నిబంధనల ప్రకారం కొత్త సభ్యులను ఎన్నుకోవాలంటే 12 మంది సభ్యులు ఉండాలి. నిబంధనలను మార్చే హక్కు అకాడమీకి లేదు. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో నోబెల్‌ అవార్డు ఎంపికను పక్కన పెట్టి మిగిలిన సభ్యులు స్వీడన్‌ రాజు వద్దకు సమస్యను తీసుకెళ్లారు. త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top