ఇక మీదట ఇంట్లో కూడా మాస్క్‌ | Sakshi
Sakshi News home page

ఇక మీదట ఇంట్లో కూడా మాస్క్‌

Published Fri, May 29 2020 9:53 AM

Study Says Wearing Masks at Home Stop Coronavirus Spread Among Family Members - Sakshi

సిడ్ని: కరోనా విజృంభిస్తోన్న వేళ మాస్క్‌ ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడమే శ్రీరామ రక్ష అంటూ ప్రభుత్వాలు ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే. సాధారణంగా అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు మాస్క్‌ ధరించి.. తిరిగి రాగానే తీసేస్తాం. కానీ బీఎమ్‌జే గ్లోబల్‌  హెల్త్‌లో ప్రచురితమైన ఓ నివేదిక మాత్రం ఇక మీదట ఇంట్లో కూడా మాస్క్‌ ధరించాలని చెబుతుంది. అప్పుడే మనతో పాటు మన కుటుంబ సభ్యులను కూడా మహమ్మారి బారి నుంచి కాపాడుకోగలమంటుంది ఈ నివేదిక. ఇంట్లో ఎవరికి కరోనా సోకక ముందు నుంచే మాస్క్‌ ధరిస్తే.. వైరస్‌ వ్యాప్తిని 79 శాతం.. ప్రతి రోజు ఇంటిని బ్లీచ్‌, ఇతర క్రిమిసంహారకాలతో శుభ్రపరిస్తే.. 77 శాతం వైరస్‌ వ్యాప్తిని నిరోధించగమలని సదరు నివేదిక వెల్లడించింది. కుటుంబ సభ్యుల మధ్య కనీసం ఒక మీటరు సామాజిక దూరం తప్పనిసరి అని ఈ నివేదిక తెలిపింది. 

కుంటుంబాల్లోనే వ్యాప్తి ఎక్కువ
ఈ నివేదిక తెలిపిన దాని ప్రకారం చైనాలో ఫిబ్రవరిలో నమోదయిన క్లస్టర్‌ కేసులు సూపర్‌ మార్కెట్‌, పాఠశాలల నుంచి వచ్చినవి కావని.. కుటుంబాలలోనే వ్యాప్తి చెందిన కేసులని తెలిపింది. దాదాపు 1000 క్లస్టర్‌ కేసులను పరిశీలించినప్పుడు వాటిలో 83 శాతం కేసులు కుంటుబ సమూహాలుగా గుర్తించబడ్డాయని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వైరస్ నిపుణుడు వు జున్యూ తెలిపారు. బయటకు వెళ్లినప్పుడు సామాజిక దూరం పాటించడం.. మాస్క్‌ ధరించం వల్ల వైరస్‌ వ్యాప్తిని నిరోధించగలమన్నారు వూ జున్యూ. అయితే ఇంటిలో  కూడా మాస్క్‌ ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించేందుకు చాలా తక్కువ ఆధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే ఇంట్లో కూడా మాస్క్‌ ధరించడం మంచిదే అన్నారు వు జున్యూ. (‘మాస్క్‌ లేదా.. పొర్లుదండాలే’)

చైనాలో జరిగిన మరో సర్వే కోసం బీజింగ్‌లోని 124 కుటుంబాలకు చెందిన 460 మందిని పరిశోధకులు పిలిపించారు. వీరంతా వైరస్‌ సోకిన వ్యక్తుల కుటుంబ సభ్యులు. తమ కుటుంబ సభ్యులకు మహమ్మారి సోకిన సమయంలో ఇంటి శుభ్రత, ఇతర అంశాల ఎలా ఉండేవని పరిశోధకులు వీరిని ప్రశ్నించారు. ఈ 124 కుంటుంబాలలో.. 41 ఇళ్లలో మొదట వైరస్‌ సోకిన వారి నుంచి దాదాపు 77 మందికి వ్యాధి సోకినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే మిగతా కుటుంబాలలో తొలుత ఒకరికి కరోనా వచ్చినప్పటికి.. ప్రతి రోజు ఇంటిని బ్లీచ్‌, ఇతర క్రిమిసంహారకాలతోతో శుభ్రపర్చడం..  కిటికీలు తెరిచి ఉంచడం.. ఇంట్లోని వ్యక్తుల మధ్య కనీసం 1 మీటర్ (3 అడుగులు) సామాజిక దూరం పాటించడం వంటి చర్యలు తీసుకోవడం వల్ల మిగత వారికి వైరస్‌ సోకలేదని పరిశోధకులు గుర్తించారు. అంతేకాక ఇంట్లో కుటుంబ సభ్యులందరు ఒక్కచోట చేరి భోజనం చేయడం, టీవీ చూడటం వల్ల వైరస్‌ సోకే ప్రమాదం 18 శాతం ఎక్కువ ఉన్నట్లు ఈ సర్వే తెలిపింది. (ఎందుకు రిస్క్‌? వేస్కోండి మాస్క్‌)

ఇంట్లో మాస్క్‌.. మంచిదే అంటున్న నిపుణులు
ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. అధ్యయనంలో పాల్గొనని నిపుణులు కూడా ఈ నివేదిక ప్రాముఖ్యతను గుర్తించారు. ‘ఇంట్లోనూ మాస్క్‌ ధరించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే లాక్‌డౌన్ సడలించిన తర్వాత బయట నుంచి ఇంటికి (ఉదా. ప్రజా రవాణా, ఆఫీసు నుంచి) వచ్చిన వ్యక్తి ద్వారా ఇతర కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. అయితే దీని గురించి వెంటనే మనకు తెలియదు కాబట్టి మిగితా కుటుంబ సభ్యులకు కూడా వైరస్‌ సోకే ప్రమాదం అధికం. కనుక ఇంట్లో కూడా మాస్క్‌ ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం వల్ల మనతో పాటు మన కుటుంబ సభ్యులను కూడా కాపాడుకున్నవారం అవుతాం’ అని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ సాలీ బ్లూమ్ఫీల్డ్ ఒక ప్రకటనలో తెలిపారు.(అలాంటిదేం లేదు.. అయినా పాజిటివ్‌!)

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ట్రిష్ గ్రీన్హాల్గ్‌ ఈ నివేదికపై స్పందిస్తూ.. ‘ఇప్పటికే చాలా మంది వైరస్‌ సోకనప్పటికి కూడా ముందు జాగ్రత్త చర్యగా ఇంట్లో మాస్క్‌ ధరించడం చేస్తున్నారు. కోవిడ్ -19 సోకడానికి ముందే మాస్క్‌ ధరించడం ద్వారా ఇంటిలోని ఇతరులకు వైరస్‌ వ్యాపించే అవకాశం చాలా తక్కువగా ఉంది. వ్యాధి సోకిన తర్వాత ముసుగు ధరించడం ప్రారంభించిన వారు తమ కుటుంబాన్ని రక్షించలేకపోయారు’ అని గ్రీన్హాల్గ్ వెల్లడించారు. లండన్ యూనివర్శిటీ కాలేజీ డాక్టర్ ఆంటోనియో లాజారినో మాట్లాడుతూ.. ‘ఈ నివేదిక మంచిదే కానీ అధికారిక సిఫార్సులు చేయడానికి ఈ అధ్యయనం సరిపోదు. ఎందుకంటే ఇది శాస్త్రీయమైనది కాదు. గణాంక విశ్లేషణలో అనేక పరిమితులను కలిగి ఉంది. ప్రధాన లిమిటేషన్‌ ఏమిటంటే ఇది వ్యక్తిగత స్థాయిలో కాకుండా కుటుంబ స్థాయిలో రూపొందించబడింది’ అన్నారు. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement